బొత్స ఘోరపరాజయం
చీపురుపల్లి, న్యూస్‌లైన్ : జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వరకూ ఆయన మకుటం లేని మహారాజు. నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి, పది సంవత్సరాలు మంత్రిగా, ఒక ఏడాది ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా పనిచేశారు. ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. అన్నిటికి మించి తన కనుసన్నల్లో జిల్లాను ఎదురులేకుండా ఏలారు. ఆ స్థాయి వ్యక్తిని నేడు చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. సత్తి కాలపు నమ్మకాలను ప్రజలు పక్క నపెట్టారు. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికలు ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. విజయం సాధించడానికి ఆయన వేసిన ఎత్తులేవీ పనిచేయలేదు. ఏకంగా 20,840 ఓట్లతో వ్యత్యాసంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో ఓటమి చవి చూశారు. తన కుటుంబంలో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పదవిని పెట్టుకుని జిల్లాను శాసించిన బొత్సకు ఈ సారి గర్వభంగం తప్పలేదు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తనతో పాటు, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోవడంతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది.
నియోజకవర్గంలో ఆది నుంచి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ బొత్సతో పాటు ఆయన మేనల్లుడు చిన్నశ్రీను సైతం నియోజకవర్గంలో విజయం కోసం అష్టకష్టాలు పడ్డారు. రేయింబవళ్లు శ్రమించారు. ఓటర్లపై ప్రలోభాల వల విసిరారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రధానంగా చీపురుపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం తక్కువగా వచ్చాయి. దీనికి కారణం రాష్ట్ర విభజన విషయంలో బొత్స రెండునాల్కల ధోరణితో వ్యవహరించారని ప్రజలు విశ్వసించడమే. ఆ సమయంలో ఉప్పెనలా వచ్చిన ఉద్యమాన్ని అణిచివేసేందుకు అమలు చేసిన కర్ఫ్యూవల్ల ప్రజలు నానా పాట్లు పడ్డారు. భయంతో బితుకుబితుకుమం టూ గడిపారు. కనీసం ఆలయానికి వెళ్లి తమను కాపాడమని భగవంతుడిని ప్రార్థించే అవకాశాన్ని కూడా లేకపోయింది. రాత్రీపగలు తేడా లేకుండా నిత్యం పోలీసుల బూటు చప్పుళ్ల ధ్వనితో వారు తీవ్రంగా భీతిల్లారు. ఇంతగా తమను భయబ్రాంతులకు గురిచేసిన బొత్సపై ప్రజలు పెంచుకున్న కసిని ఇలా తీర్చుకున్నారు. ప్రజల ను మోసం చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించారు.