ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కొలాం ఆశ్రమ పాఠశాలలో పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఆటంకం కలగకుండా పోలీసులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను వివరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో బాగంగానే కేఆర్కే కాలనీ, తంతోలి గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు.
లెక్కింపు కేంద్రాలను పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ప్రణాళిక ప్రకారం బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి ఓట్ల లెక్కింపు విజయవంతానికి కృషి చేయాలన్నారు. మద్యం షాపులు మూసి ఉంచాలని, ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. లెక్కింపు సరళిపై పోలీసులు మాట్లాడకూడదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
2100 మంది పోలీసు బలగాలు..
జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 2100 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 120 మంది ఎస్సైలు, 180 మంది ఏఎస్సైలు, 320 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 800 మంది కానిస్టేబుళ్లు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 120 మంది ప్రత్యేక సాయుధ దళాలు బందోబస్తులో పాలుపంచుకుంటున్నాయి. కాగా, డాగ్‌స్క్వాడ్, బాంబుస్క్వాడ్‌లతో లెక్కింపు కేంద్రాలను అణువణువు తనిఖీ చేస్తున్నారు. డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టివ్ ద్వారానే ప్రతిఒక్కరినీ లోపలికి అనుమతించనున్నారు.
నేటితో తెర..
ఎన్నికల ఫలితాల జాతరకు నేటితో తెరపడనుంది. రెండు నెలలుగా అవిరామంగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు చివరిదైన సార్వత్రిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను సైతం విజయవంతంగా ముగించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
కౌంటింగ్‌కు మూడంచెల భద్రత
Published Fri, May 16 2014 1:39 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement