కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుండగా, పది గంటల వరకు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటృన్నారు.
జిల్లాలో పది నియోజకవర్గాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలుర, బాలికల)లో జరుగుతుంది. జిల్లా కేంద్రంలో 20 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక నియోజకవర్గానికి చెందిన ఓట్లను రెండేసి హాళ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. నిరంతరం కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు ఎనిమిది మంది పరిశీలకులకు అందుబాటులో ఉంచారు. వీరు ఒక రౌండ్ పూర్తయిన వెంటనే మళ్లీ పరిశీలించిన లెక్కింపు జరుపుతారు. వీరితోపాటు కలెక్టర్ అహ్మద్ బాబు, జేసీ లక్ష్మీకాంతంలు ఉంటారు.
లెక్కింపునకు 1,164 మంది అధికారులు
సాధారణ ఓట్ల లెక్కింపు కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 20 హాళ్లలో 240 టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక ప్రింటింగ్ కమ్ ఆక్సిలరీ డిస్‌ప్లే యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు మగ్గురు అధికారుల చొప్పున నియమించారు. 288 మంది సూపర్‌వైజర్లను, 288 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను, 288 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించారు.
వీరు కాకుండా 300 మంది ఇతర కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు లెక్కించనున్నారు. ఓట్లను కౌంటింగ్ చేసిన అధికారులు ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలి. సీల్ ఉందా.. లేదా.. అనే విషయాలు తెలుస్తాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీసు బందోబస్తు నియమించారు.
ముందస్తు ఫలితాలతో ఉత్కంఠ
సాధారణ ఎన్నికల ఫలితాలకు ముందు స్థానిక, మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో అభ్యర్థుల్లో మూడు రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. ముందుగా వచ్చిన ఫలితాలు మరోసారి రిపీటు అవుతాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముందొచ్చిన ఫలితాలు అభ్యర్థులకు కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నా.. ఆ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపేవిగా లేదనే ధీమాతో అభ్యర్థులు ఉన్నారు. ఇక కౌంటింగ్ కోసం పార్లమెంట్ అభ్యర్థులు ఇప్పటికే 336 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలో జరుగగా, పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు పెద్దపల్లిలో జరుగనుందని కలెక్టర్ అహ్మద్ బాబు బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
Published Fri, May 16 2014 1:35 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement