
రేపు కేసీఆర్ రాక
సాక్షి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నిరల ప్రచారంలో భాగంగా తెఉలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్ సోమవారం నల్లగొండకు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి దుబ్బాక నర్సింహారెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు.
నల్లగొండ లోక్‌సభ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు పెద్దఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమై చర్చించినట్లు దుబ్బాక వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టో, ప్రచారంలో భాగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టడం, పార్టీ సానుకూల అంశాలపై సమీక్షించారని తెలిపారు.
కేవలం తెలంగాణవాదంపైనే ఆధారపడకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించడం, ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్లాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని వివరించారు. సభను విజయవంతం చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు.