నువ్వా.. నేనా..!
ఎట్టకేలకు ‘పల్లె’ గుట్టు వీడింది. ఇన్నాళ్లూ ఆశగా చూసిన అభ్యర్థుల టెన్షన్‌కు మంగళవారం వెలువడిన ఫలితాలు సమాధానమిచ్చాయి. జిల్లాలోని వివిధ కౌంటింగు కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభమైన దగ్గరనుంచి అందరిలోనూ ఉత్కంఠ సాగేలా ఫలితాలు వచ్చాయి. ‘హస్త’లాఘవం, కారుజోష్, సైకిల్ వ్యూహం, బీజేపీకి ఊరట ఇలా అంతా కలిపి నువ్వా..నేనా అనే చందంగా విజేతల వివరాలు వెల్లడయ్యాయి. ఆలస్యంగా ప్రారంభమైన లెక్కింపు...ఫలితాల వివరణలో జాప్యం అందరి సహనానికి పరీక్షగా మారాయి. కొన్ని చోట్ల సరైన సౌకర్యాలు లేక సిబ్బంది నిరసన గళం వంటివి అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపానికి అద్దం పట్టాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
స్థానిక సంస్థల ప్రాదేశిక నియోజకవర్గాలకు జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నువ్వా నేనా అనే రీతిలో ఫలితాలు సాధించాయి. సోమవారం ప్రకటించిన పురపాలక ఫలితాల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. తెలుగుదేశం పార్టీ కొడంగల్, నారాయణపేట మినహా ఎక్కడా చెప్పుకోదగిన రీతిలో సంఖ్యా బలం సాధించలేక పోయింది. మున్సిపల్ ఫలితాల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా రాణించిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం చతికిల పడినట్లు స్పష్టంగా కనిపించింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సింగిల్ డిజిట్ ఫలితాలు సాధించాయి. పలు చోట్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నికలో స్వతంత్రులే కీలక పాత్ర పోషించనున్నారు.
టీఆర్‌ఎస్ నుంచి తీవ్ర పోటీ
మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. మక్తల్, షాద్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో మాత్రమే పైచేయి సాధించింది. గద్వాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకోవడంతో నాలుగు మండలాల పరిధిలో ఒక్క ఎంపీపీ పదవిని కూడా కాంగ్రెస్ దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలో ఏకపక్ష విజయం సాధించిన మాజీ మంత్రి డీకే అరుణకు ప్రస్తుత ఫలితాలు ఒకింత ఆందోళన కలిగించే రీతిలోనే వున్నాయి. 64 జడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ 28 చోట్ల విజయం సాధించింది. టీఆర్‌ఎస్, టీడీపీ జట్టు కడితే ఇక్కడ జడ్పీ చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు అందడం అసాధ్యంగా కనిపిస్తోంది.
అనూహ్యంగా బలం పుంజుకుని
మున్సిపల్ ఎన్నికల్లో అయిజ మున్సిపాలిటీ మినహా మిగతా చోట్ల పెద్దగా ప్రభావం చూపని టీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. దేవరకద్ర, నాగర్‌కర్నూ లు, కొల్లాపూర్, గద్వాల, జడ్చర్ల నియోజకవర్గాల్లో మెజారీటీ ఎంపీటీసీ స్థానా లు కైవసం చేసుకుంది. లింగాల మండల పరిధిలోని పది ఎంపీటీసీ స్థానాలూ టీఆ ర్‌ఎస్ ఖాతాలోనే పడటం గమనార్హం. వనపర్తిలో కాంగ్రెస్‌తో సమ ఉజ్జీగా నిలిచింది. హంగ్ ఏర్పడిన చోట టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీపీల ఎన్నికలో కీలక పాత్ర పోషించనున్నారు.
కొడంగల్‌లో టీడీపీ హవా
స్థానిక సంస్థల ఎన్నికలో చతికిల పడిన టీడీపీ కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం హవా కొనసాగించింది. నాలుగు జడ్పీటీసీ స్థానాలు, మూడు ఎంపీపీ అధ్యక్ష పదవులు సొంత బలంపై ఆధార పడి గెలుచుకోనుంది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు అనూహ్య విజయాన్ని అందించాయి. నారాయణపేట నియోజకవర్గంలోనూ మిత్రపక్షం బీజేపీతో కలిసి టీడీపీ మెజారిటీ ఎంపీపీ అధ్యక్ష పదవి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ సాధించిన ఎనిమిది జడ్పీటీసీ పదవులు చైర్మన్ ఎన్నికలో కీలకం కానున్నాయి.
బీజేపీ, స్వతంత్రులపై గురి
అమన్‌గల్, నారాయణపేట జడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ మరో 54 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ ఆశించిన ఫలితం సాధించలేక పోయింది. నారాయణపేట ఎంపీపీ పదవిని కూడా బీజేపీ సునాయాసంగా దక్కించుకోనుంది. స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో గెలవడంతో హంగ్ ఏర్పడిన చోట వీరి మద్దతు కీలకం కానున్నది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొల్లాపూర్‌లో ఓట్ల లెక్కింపు వాయిదా వేశారు. వనపర్తిలో టీడీపీ అభ్యర్థి కేవలం 24 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో రీ కౌంటింగ్ చేపట్టారు.