కేంద్ర కేబినెట్‌లో వెంకయ్య!
తెలంగాణ నుంచి దత్తాత్రేయకు చాన్స్!
హరిబాబుకు సహాయ మంత్రి పదవి?
టీడీపీకీ రెండు కేబినెట్,
రెండు సహాయ మంత్రి పదవులు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. బీజేపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు బలం ఉన్నప్పటికీ.. ముందుగా అనుకున్న ప్రకారమే ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలూ కొత్త ప్రభుత్వంలో భాగస్వాములు కానున్నాయి. ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశంపార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి 15, తెలంగాణ నుంచి 1 ఎంపీ సీటు సాధించింది. అలాగే బీజేపీకి ఏపీ నుంచి రెండు, తెలంగాణ నుంచి ఒక సీటు దక్కింది. ఈనేపథ్యంలో మన రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవులు ఎన్ని దక్కనున్నాయి? ఎవరెవరికి దక్కనున్నాయి? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. గత యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల్లో మంత్రివర్గాలు చాలా పెద్దవిగానే ఉన్నాయి. ఇప్పుడు మోడీ కూర్పు ఎలా ఉండబోతోందన్న అంశమూ ఆసక్తికరంగా మారింది. బీజేపీ కోర్ గ్రూప్ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తోంది.
రెండు పార్టీలకు ప్రాధాన్యం..
నాటి ఎన్డీఏలో ప్రధాని సహా 39 మంది కేబినెట్‌లో సభ్యులుగా ఉన్నారు (దశలవారీ విస్తరణలో). 8 మంది ఇండిపెండెంట్ చార్జి సహాయ మంత్రులు ఉండగా.. 43 మంది సహాయ మంత్రులు ఉన్నారు. అంటే మొత్తం 90 మంది సభ్యులు మంత్రులుగా ఉన్నారు. నాటి ఎన్డీఏ హయాంలో అనేక పార్టీలు కీలకపాత్ర పోషించాయి. తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, బీజేడీ, ఎల్జేపీ, డీఎంకే, శివసేన, ఇలా అనేక పార్టీలు కీలకపాత్ర పోషించడంతో 16 కేబినెట్ పోస్టులు ఆ పార్టీలకే దక్కాయి. కానీ ఇప్పుడు ఉన్న ఎన్డీయే కూటమిలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో పాటు మిగిలిన పార్టీలు అతితక్కువగా ఉన్నాయి. వాటిలో శివసేన, టీడీపీ ప్రధాన పార్టీలు. ఇప్పుడు ఈ రెండు పార్టీలకే ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఎవరిని వరించేనో..: నాటి ఎన్డీఏ హయాంలో రాష్ట్రం నుంచి వెంకయ్యనాయుడుకు కేబినెట్ మంత్రిపదవి, బండారు దత్తాత్రేయ, సి.హెచ్.విద్యాసాగర్‌రావు, సినీనటుడు కృష్ణం రాజు, బంగారు లక్ష్మణ్‌లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. అయితే ఈసారి రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లో మూడు సీట్లను బీజేపీ గెలుచుకుంది. తెలంగాణలో సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, నర్సాపురం నుంచి గోకరాజు గంగరాజు విజేతలుగా నిలిచారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు, నరేంద్ర మోడీ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కనుంది. అద్వానీకి సన్నిహితంగా ఉండే వెంకయ్యనాయుడు.. మోడీ ప్రధాని అభ్యర్థిగా నిలవడంలో కూడా కీలకపాత్ర పోషించారు. గత ఎన్డీఏ హయాంలో రైల్వేశాఖ సహాయ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దత్తాత్రేయకూ కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. అలాగే విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న హరిబాబుకూ సహాయమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీడీపీకి ఎన్ని?: ఎన్డీఏ కూటమిలో బీజేపీ 282 సీట్లు సాధించగా.. ఆతరువాత రెండో స్థానంలో 18 సీట్లతో శివసేన నిలిచింది. ఇక 16 సీట్లతో మూడో స్థానంలో టీడీపీ నిలిచింది. ఈనేపథ్యంలో టీడీపీ రెండు రాష్ట్రాలకు మంత్రి పదవులను కోరుతుందా? లేక కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కోరుతుందా? అసలు బీజేపీ ఎన్ని పదవులు ఇవ్వనుంది? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల విశ్లేషణను బట్టి చూస్తే టీడీపీకి కనీసం రెండు కేబినెట్, రెండు సహాయ మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజాగా టీడీపీ నుంచి ఎన్నికైన వారిలో నలుగురు మినహాయించి అందరూ తొలిసారి ఎంపీగా ఎన్నికైనవారే కావడం గమనార్హం. నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ రావు, ఎన్.శివప్రసాద్, ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన రాయపాటి సాంబశివరావులు మాత్రమే ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచారు. అశోక్‌గజపతి రాజు ఎంపీగా తొలిసారి ఎన్నికైనప్పటికీ పార్టీలో సీనియర్ నేత. పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా ఈయన పేరు వినిపిస్తోంది. వీరితోపాటు చంద్రబాబునాయుడు సన్నిహితుడిగా పేరున్న సినీ నటుడు మురళీమోహన్ కూడా రేసులో ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యుల్లోనూ ఒకసారి ఎన్నికైన వారే ఉన్నారు. అయినప్పటికీ పొత్తుల చర్చల్లో కీలకపాత్ర పోషించిన రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేశ్, సుజనాచౌదరిలు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసుకునేందుకు ఒక పదవిని తీసుకోవాలనుకుంటే మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా ఎన్నికైన సి.హెచ్.మల్లారెడ్డికి ఆ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.