విజయవాడ ఈస్ట్ కౌంటింగ్‌లో గందరగోళం
- వైఎస్సార్ సీపీ ఏజెంట్ల ఆందోళన
- ఈవీఎంలో ఓట్లు తారుమారు !
- గంటసేపు నిలిపివేత
- రీకౌంటింగ్ చేస్తామన్న ప్రకటనతో సాగిన కౌంటింగ్
- పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్
సాక్షి, విజయవాడ: విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోని ఒక ఈవీఎంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లు కాస్త ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలైనట్లు ఈవీఎంలో కనిపించి ప్రధాన పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడనట్లు మిషన్ చూపడం వివాదానికి కారణమయ్యింది. శుక్రవారం కానూరులోని పీవీపీ సిద్ధార్థ కళాశాలలో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది.
ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి రాధకృష్ణ, టీడీపీ నుంచి గద్దె రామ్మోహనరావు కాంగ్రెస్ నుంచి దేవినేని నెహ్రు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఉద యం 8గంటలకు కౌంటింగ్ మెదలైంది. ఆరో రౌండ్‌లో మూడో నెంబరు టేబుల్‌లో ఉన్న ఈవిఎం పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాణిగారితోటలోని 176 పోలింగ్ బూత్‌లో ఉన్న ఈవి ఎం లెక్కింపులో ఇబ్బంది తలెత్తింది.
ఎనిమిదో నెంబరు స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వంగవీటి రాధకృష్ణకు సున్నా ఓట్లు వచ్చినట్లు రాధ తర్వాత స్థానంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 668 ఓట్లు వచ్చినట్లు మిషన్‌లో నమోదయాఇంది. వాస్తవానికి వంగవీటి రాధకృష్ణకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. దీంతో అక్కడ మెజార్టీ వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఎజెంట్లు ధీమాతో ఉన్నారు.
అయితే లెక్కింపులో సున్నా రావటంతో ఏజెంట్లు అశ్చర్యానికి లోనై అక్కడి అధికారులను ప్రశ్నించగా వారేమి బదులివ్వకపోవటంతో ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తక్షణమే కౌంటింగ్ నిలిపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. తర్వాత రిటర్నింగ్ అధికారి మళ్లీ 176 బూత్ ఓట్లను రీకౌంటింగ్ చేస్తామని ప్రకటించారు. అయితే వివాదం తలెత్తిన క్రమంలో సుమారు గంటసేపు కౌంటింగ్ ప్రకియ నిలిచిపోయింది.
సిబ్బంది పోరపాటుతో...
వాస్తవానికి ఈవిఎంలు తెచ్చిన సిబ్బంది చేసిన పోరపాటు వల్ల ఈవివాదం జరిగింది. కౌం టింగ్ కేంద్రంలో మూడో నెంబరు టేబుల్‌లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు, 10 నెంబరు టేబుల్‌లో విజయవాడ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈక్రమంలో 10 నెంబరు టేబుల్‌లో లెక్కించాల్సిన పార్లమెంట్ ఈవిఎంను మూడో టేబుల్‌లో పెట్టి అసెంబ్లీ ఓటింగ్‌గా లెక్కించటంతో ఈసమస్య ఉత్పన్నం అయింది.
పార్లమెంట్ ఈవిఎంలో 8 నెంబరు స్వతంత్ర అభ్యర్థి, అసెంబ్లీలో రాధా ఉన్నారు. దీంతో పార్లమెంట్ ఈవిఎంను అసెంబ్లీలో లెక్కించటంతో సున్నా ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహం అనంతరం సుమారు గంటసేపు కౌంటింగ్ ఆపివేసి సమస్య మూలాల్ని గుర్తించి తర్వాత ఏజెంట్ల అనుమతితో ఈవిఎంలు మార్చి లెక్కించగా 176 బూత్‌లో వంగవీటి రాధాకృష్ణకు 300 పైచిలుకు ఓట్లు వచ్చాయి.
కౌంటింగ్ సెంటర్‌కు కలెక్టర్, సీపీ
వివాదం తలెత్తిందన్న సమాచారం తెలుసుకున్న కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగర కమిషనర్ బి. శ్రీనివాసులు ఈస్ట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అక్కడి అధికారులు అప్పటికే సమస్యను సరిదిద్దారు. ఈక్రమంలో కౌంటింగ్ కేంద్రంలోని ఏజెంట్లతో అధికారులు మాట్లాడారు. దీంతో బందోబస్తు అక్కడ భారీగా పెంచారు. మరోవైపు 267 బూత్‌లు కావటంతో 37 రౌండ్లు ఏర్పాటు చేశారు. దీంతో కౌంటింగ్ అలస్యంగా సాగుతుంది.