కడప స్పోర్ట్స్ న్యూస్‌లైన్ : ఒకటే గమనం.. ఒకటే లక్ష్యం.. ఓటు వేయించడమే లక్ష్యంగా.. ఓటరును చైతన్యపరిచే విధంగా నిర్వహించిన 3కే వాక్ ఉత్సాహంగా సాగింది. శుక్రవారం నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో నిర్వహించిన 3 కిలోమీటర్ల నడక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని దేశంలోనే జిల్లాను ఆదర్శవంతంగా నిలిపేందుకు 3కే వాక్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నిద్ర శారీరక, మానసికం అని రెండు రకాలుగా ఉంటుందని, ప్రజలందరూ మానసిక నిద్ర నుంచి మేల్కొని తప్పక ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకేసారి 5 ఎన్నికలు నిర్వహించడం జరుగుతోందన్నారు.
గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం 60 శాతం మాత్ర మే పోల్ అయ్యాయన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందన్నారు. అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఓటింగ్ పట్ల అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఓటు వినియోగంపై అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఙ చేయించారు. అనంతరం 3కే వాక్ ర్యాలీని కలెక్టర్ జెండాఊపి ప్రారంభించారు.
డీఎస్‌ఏ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ నడక అప్సరా కూడలి, ఆర్టీసీ బస్టాండు మీదుగా కోటిరెడ్డి సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్‌ఓ సులోచన, ఆర్డీఓ హరిత, పరిశ్రమల కేంద్రం జీఎం గోపాల్, డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ ఎం. రామచంద్రారెడ్డి, పశుసంవర్థకశాఖ జేడీ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, శాంతిసంఘం కార్యదర్శి రాజారత్నం ఐజాక్, ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటుపై ప్రతిజ్ఞ
Published Sat, Mar 29 2014 3:52 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement