కమలానికి షాక్
* బీజేపీని పట్టించుకోని ‘పట్టణ’ ఓటర్లు
* నారాయణపేట్‌ను నిలబెట్టుకోవ టానికే ఆ పార్టీ పరిమితం
* ఎక్కడా కనిపించని మోడీ హవా
* ‘తెలంగాణ’ క్రెడిట్ కూడా ఓట్లు రాల్చని తీరు.. 19 మునిసిపాలిటీల్లో సున్నా
* అసెంబ్లీ ఫలితాలూ ఇలాగే ఉంటాయోమోనని నేతల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. తెలంగాణకు ఆది నుంచి మద్దతు తెలిపిన పార్టీగా ఉన్న పేరును ఓట్లుగా మలచుకుని ఈసారి కనీసం నాలుగైదు పురపాలక సంఘాల్లో పాగా వేయాలనుకున్న ఆ పార్టీ ఆశలు వమ్మయ్యాయి. ‘తెలంగాణ’ క్రెడిట్‌ను కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కే కట్టబెట్టిన ఓటర్లు బీజేపీని పెద్దగా పట్టించుకోలేదు. అతికష్టమ్మీద మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ పురపాలక సంఘాన్ని నిలబెట్టుకున్న ఆ పార్టీ, కరీంనగర్ జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీ స్థానాలను దక్కించుకున్నా, చైర్మన్ పదవి పొందటానికి రెండు స్థానాల(వార్డులు) దూరంలో ఆగిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షమైన టీడీపీకి ఇక్కడ ఒక్క వార్డు కూడా దక్కకపోవటంతో స్వతంత్రుల మద్దతుతో చైర్మన్‌గిరీని దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే... నల్లగొండ జిల్లా భువనగిరి మునిసిపాలిటీలో కాంగ్రెస్‌తో సమంగా ఎనిమిది వార్డులు దక్కించుకుంది. ఇక్కడ మిత్రపక్షమైన టీడీపీకి ఏడు వార్డులు రావటంతో రెండు కలిసి మునిసిపాలిటీని దక్కించుకున్నట్లయింది. మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశలు పెట్టుకున్న మిగతా అన్ని చోట్లా ఆ పార్టీకి తీవ్ర నిరాశే మిగిలింది. అన్ని మునిసిపాలిటీలు కలిపి కేవలం 122 వార్డులు (కార్పొరేషన్లలో 10 డివిజన్లు అదనం) మాత్రమే దక్కటం బీజేపీ దయనీయ పరిస్థితికి నిదర్శనం. బీజేపీతో పోలిస్తే చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్‌కు 78 వార్డులు (కార్పొరేషన్లలో 18 అదనం) దక్కటం విశేషం.
కనిపించని మోడీ ‘హవా’...
తెలంగాణ సిద్ధించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రెండు అంశాలు తమకు ఓట్లు కురిపిస్తాయని బీజేపీ ఆశించింది. తెలంగాణ తెచ్చిన పార్టీల్లో ఒకటిగా ప్రజల్లో ఉన్న గుర్తింపు, దేశవ్యాప్తంగా బలంగా ఉందంటున్న మోడీ ప్రభావంతో ఎక్కువ మునిసిపాలీటీల్లో పాగా వేయాలని కమలనాథులు కలలుగన్నారు. ఈ రెండూ పనిచేయలేదని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితాలు ఇంతకంటే గొప్పగా ఉండవనే ఆందోళనలో పడిపోయారు.
కార్పొరేషన్లలోనూ అదే తీరు...
పురపాలక సంఘాల తరహాలోనే నగరపాలక సంస్థల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్‌లో కేవలం ఆరు డివిజన్లే దక్కాయి. అదే మజ్లిస్ ఇక్కడ ఏకంగా 16 స్థానాలు దక్కించుకోవటాన్ని కమలనాథులు పెద్ద పరాభవంగా భావిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న ఆ పార్టీ, అక్కడి కార్పొరేషన్‌లో కేవలం రెండు డివిజన్లతో సరిపెట్టుకుంది. రామగుండం కార్పొరేషన్‌లో కూడా రెండింటిని మాత్రమే దక్కించుకోగలిగింది. మూడు కార్పొరేషన్లు కలిపి పది డివిజన్లు రాగా... మజ్లిస్ పార్టీకి పద్దెనిమిది స్థానాలు దక్కటం విశేషం.
పందొమ్మిది మున్సిపాలిటీల్లో సున్నా...
ఈ ఎన్నికల్లో ఏకంగా పందొమ్మిది పురపాలక సంఘాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేకపోయింది. తొమ్మిది మునిసిపాలిటీల్లో ఒక్కో వార్డుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట్ మునిసిపాలిటీని మాత్రమే నిలబెట్టుకుంది.