ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్సీపీదే హవా
ఒంటరిగా పోటీ చేసి అత్యధిక శాతం ఓట్లను సాధించిన పార్టీగా రికార్డు
అన్నాడీఎంకే, బీజేడీ, తృణమూల్ కంటే అత్యధికం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే అరుదైన గౌరవం సాధించింది. ఈ ఎన్నికల్లో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో సొంత రాష్ట్రంలో ఎక్కువ ఓట్ల శాతం సాధించిన పార్టీగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. పొత్తులేవీ లేకుండా ఒంటరిగా పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో అత్యధిక శాతం ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు వారి సొంత రాష్ట్రంలో తెచ్చుకున్న ఓట్ల శాతం కంటే వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంతంలో సాధించిన ఓట్ల శాతం ఎక్కువ. ఈ ఎన్నికల్లో లోక్‌సభలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా స్థానం దక్కింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ప్రాంతీయ పార్టీల్లో ఏఐడీఎంకే 37 స్థానాలతో మూడో స్థానం, 34 సీట్లతో తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌కు 20, మహారాష్ట్రకు చెందిన శివసేనకు 18, టీడీపీ 16, టీఆర్‌ఎస్ 11 సీట్లు వచ్చాయి. తొమ్మిది సీట్లతో జాతీయ పార్టీ సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రెండూ సమానంగా నిలిచాయి.
ఓట్ల శాతం విషయానికొస్తే.. ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే తమిళనాడులో సాధించిన ఓట్ల కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 0.1 శాతం అదనంగా ఓట్లు తెచ్చుకోగలిగింది. అన్నాడీఎంకేకు తమిళనాడులో 44. 3% ఓట్లు రాగా, బిజూ జనతాదళ్‌కు ఒడిశా రాష్ట్రంలో 44.1% ఓట్లు, తృణమూల్‌కు పశ్చిమబెంగాల్‌లో 39.3% ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో 44.4% ఓట్లను సాధించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ సైతం తెలంగాణ ప్రాంతంలో పోలైన మొత్తం ఓట్లలో కేవలం 34.75% ఓట్లనే సాధించగలిగింది. చివరకు సీమాంధ్రలో అధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి కూడా.. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లకన్నా దాదాపు 4% తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ- టీడీపీ కూటమిగా పోటీ చేయడం ద్వారా ఆ రెండు పార్టీలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్‌కన్నా 2% అదనంగా ఓట్లను తెచ్చుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్‌లో బలీయంగా ఉన్న ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీలు ఈ ఎన్నికల్లో వరుసగా 19.6%, 22.3% ఓట్లు మాత్రమే సాధించగలిగాయి.