
కొత్త అసెంబ్లీల కొలువెక్కడ ?
భవనాలను పరిశీలించిన గవర్నర్ సలహాదారు రాయ్
సభాప్రతినిధుల అభిప్రాయాల ప్రకారమే నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రెండు శాసనసభలు, శాసనమండళ్లు ఎక్కడ కొలువుదీరాలి? వాటి సచివాలయా లు ఎక్కడ ఏర్పాటుచేయాలి? తదితర అంశాలపై గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్ శనివారం పరిశీలన చేశారు. అసెంబ్లీ ప్రాంగణలోని ప్రస్తుత భవనాలను, పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న కౌన్సిల్, దాని చుట్టుపక్కల ఉన్న భవనాలను ఆయన సందర్శించారు. ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి శ్యాం బాబు, లక్ష్మీపార్థసారధి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజసదారాం తదితరులు రాయ్‌కు ఆయా భవనాలు అందులోని సదుపాయాల గురించి వివరించారు.
రెండు అసెంబ్లీలు, రెండు కౌన్సిళ్లను ఏర్పాటుచేసే విషయం లో స్పీకర్, మండలి ఛైర్మన్‌లతో పాటు ఇతర ముఖ్యులతో కూడా చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. అధికారుల కార్యాలయాలకు మాదిరిగా అసెంబ్లీ, కౌన్సిళ్లకు భవనాలను ఎక్కడపడితే అక్కడ కేటాయించే వీలుండదని, రాజకీయపరమైన సభలు కనుక వివాదాలు తలెత్తకుండా ఆయా సభాప్రతినిధుల అభిప్రాయాల ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అంతకుముందు రాయ్ ఇతర అధికారులు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి కేటాయిస్తున్న హెచ్-బ్లాక్‌లోని ఉత్తర, దక్షిణ భవనాలను పరిశీలించారు. పక్కనే ఉన్న హెలిప్యాడ్, దాన్ని ఆనుకొని ఉన్న కిండర్ గార్టెన్ స్కూలు ప్రాంతాన్ని చూశారు. ఈ బ్లాక్‌కు ఎదురుగా జీర్ణావస్థలో ఉన్న జి-బ్లాక్ భవనాన్ని కూడా రాయ్ పరిశీలించారు.
ప్రాంతాలవారీగా మాజీ ఎమ్మెల్యేల పెన్షన్లు: అసెంబ్లీ ద్వారా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు పంపిణీ అవుతున్న పెన్షన్లను విభజనానంతరం ఏ రాష్ట్ర పరిధిలోని వారికి ఆ ప్రభుత్వాలే చెల్లింపులు చేయనున్నాయి. అసెంబ్లీలో పెన్షన్‌దారుల స్చంఖ్య 1,236. వీరికి జిల్లాల వారీగానే చెల్లింపులు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణ, సీమాంధ్రల్లో ఏ ప్రాంతంలోని వారికి అక్కడే పెన్షన్లు అందనున్నాయి. అసెంబ్లీలో ఉద్యోగుల విభజనపైనా చర్చ సాగుతోంది. ప్రస్తుతం 550 మంది ఉద్యోగులుండగా అందులో 65 శాతం మంది సీమాంధ్రవారే ఉన్నారని చెబుతున్నారు. విభజన కమిటీ నిబంధనల ప్రకారం వీరి విభజన జరగనుంది.
అదనపు సిబ్బంది అనివార్యం: అసెంబ్లీలో ప్రస్తుత సిబ్బందిని విభజించినా అది రెండు అసెంబ్లీ, కౌన్సిళ్లకు సరిపోద ని అధికారులు భావిస్తున్నారు. అసెంబ్లీలు వేరయినా ఇపుడున్న అసెంబ్లీ కమిటీలు, వాటికింద పనిచేసే సెక్షన్లు, ఇతర విభాగాలన్నీ కొత్త అసెంబ్లీకి కూడా ఏర్పాటు కావాల్సి ఉంటుంది. అసెంబ్లీ సచివాలయంలో ఇపుడు 39సెక్షన్లు పనిచేస్తున్నాయి. కొత్త అసెంబ్లీకి ఇన్నే సెక్షన్లు అవసర ం. కనుక అదనపు సిబ్బంది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.