‘బంగారు తల్లి’కి బెంగ
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: సుమారు ఏడాది క్రితం.. మే ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారు తల్లి పథకానికి అంకురార్పణ చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు దశలవారీగా ఆర్థికంగా చేయూత అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపికైన వారికి ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.2.16 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నది లక్ష్యం. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉన్న తరుణంలో హడావుడిగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ ఎన్నికల పథకమేనన్న ఆరోపణలు వచ్చాయి.
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చేందుకే దీన్ని ప్రారంభించారన్న విమర్శలు కూడా వినిపించాయి. అందుకు తగినట్లే ఇప్పుడు ఈ పథకానికి గ్రహణం పట్టుకుంది. జిల్లాలోని 31 మండలాల నుంచి 9014 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,613 మందిని అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సుమారు రూ.1.40 కోట్లు కూడా జమ చేశారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా 3,401 దరఖాస్తులను అధికారులు పెండింగులో పెట్టారు. దీంతో దరఖాస్తుదారులు నిరాశ చెందారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయినా దరఖాస్తుదారులు కొత్త అనుమానాలతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ ప్రభుత్వం రద్దయ్యింది. కొత్తగా అధికారంలోకి రానున్న టీడీపీ ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఏ వైఖరి అవలంభిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుందన్నది తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకే టీడీపీ ప్రభుత్వం కిందా మీదా పడాల్సిన పరిస్థితులు ఉన్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించిన ఈ పథకం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పథకం అమలు, పెండింగు దరఖాస్తుల విషయంలో అధికారులు సైతం నోరు మెదపడం లేదు. దీనిపై వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా డీఆర్‌డీఏ అధికారులు ఏవరూ అందుబాటులో లేరు.