ఏ కార్డయిన 24 గంటల్లోనే | Which card within 24 hours | Sakshi
Sakshi News home page

ఏ కార్డయిన 24 గంటల్లోనే

Published Tue, Mar 25 2014 2:11 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఏ కార్డయిన  24 గంటల్లోనే - Sakshi

ఏ కార్డయిన 24 గంటల్లోనే

రేషన్, ఆరోగ్యశ్రీ, పింఛన్‌లను  మీ వార్డులు, పంచాయతీల్లోనే ఆఫీసు పెట్టి అక్కడే ఇప్పిస్తా: జగన్
 
 
 ‘‘ఎక్కడ ఏ పదిమంది అక్కాచెల్లమ్మలు, అవ్వాతాతలు కన్పించినా వారిని ఆప్యాయంగా పలకరించడం ఇప్పటి వరకు నా వైఖరి. ఈ వేళ మున్సిపాల్టీల్లో, వార్డుల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడకెళ్లినా ఎవరిని కలిసినా ఇవాళ్టికీ కూడా.. నాకు పింఛన్ రావడం లేదన్నా.. నాకు రేషన్ కార్డు లేదన్నా.. నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా.. నాకు ఇల్లు లేదన్నా అని చెబుతున్నారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా ఒక భరోసా ఇస్తున్నా.

ఈ వ్యవస్థను మారుస్తాను.. ఆ వార్డులోనో లేదా ఆ పంచాయతీలోనో అక్కడే ఒక ఆఫీసు తెరుస్తాను. ఒక కంప్యూటర్ పెడతాను. ఒక రెటీనా మిషన్ , ఒక లామినేషన్ మిషన్, ఒక స్కానర్ పెట్టిస్తాను. అర్హులైన వారికి ఏ కార్డు కావాలన్నా 24 గ ంటల్లో ఇచ్చేలా చేస్తాను. అదే ఆఫీస్ నుంచి పింఛన్ అందేలా చేస్తాను. ఇక ముందు ఎవరూ ఎటువంటి కార్డుకైనా, ఎవరి గడపా ఎక్కాల్సిన అవసరం లేకుండా చేస్తాను. ఇందుకోసం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదో సంతకం చేస్తాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిదో రోజు సోమవారం ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉదయం జగన్ రోడ్‌షో నిర్వహించారు. రాత్రి తుని గొల్ల అప్పారావు సెంటర్‌లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’లో జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
 ఆ 5 సంతకాలూ రాష్ర్ట చరిత్రనే మార్చేస్తాయి..
 
‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజున.. అదే క్షణాన ఐదు సంతకాలు చేస్తాను. ఆ సంతకాలు రాష్ర్ట చరిత్రను మార్చేవిగా ఉంటాయి. పైనున్న ఆ దివంగత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గర్వించేలా ఆ సంతకాలు ఉంటాయి.
   
 మొట్టమొదటి సంతకంతో అక్కాచెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికిపంపించండి. అలా పంపే పిల్లలకు ఒకరికైతే రూ. 500, ఇద్దరికైతే రూ. 1,000 ఆ అక్కాచెల్లెమ్మ అకౌంట్‌లో జమ చేస్తాను. అదే అమ్మ ఒడి పథకం.
     
రెండో సంతకం ఆ అవ్వాతాత కోసం పెడతాను. వారికి ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను రూ. 700 చేస్తాను. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 3 వేల కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేస్తాను.డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తూ నాలుగో సంతకం చేస్తాను. ఇది 20 వేల కోట్ల రూపాయలే  కాబట్టి కిందా మీద పడి ఏదో విధంగా చేస్తానని మీకు మాట ఇస్తున్నా.
   
 రాజశేఖరరెడ్డి ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల ఇళ్లు కట్టించి చరిత్ర సృష్టించారు. ఈ రోజు నేను మాట ఇస్తున్నా.. నాన్న కట్టించిన ఇళ్లకంటే ఒక లక్ష ఎక్కువగానే అంటే ఏడాదికి 10 లక్షల దాకా పేదలకు ఇళ్లు కట్టిస్తానని మాట ఇస్తున్నా. ఇల్లు లేదన్న మాటే రాకుండా పాలిస్తా.
 
జిల్లాకొక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి

 మీకొక విషయం చెప్పదల్చుకున్నా.. గుండె ఆపరేషన్ కావాలన్నా.. మరే ఆధునిక వైద్యం కావాలన్నా ఇప్పటి వరకు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ మహానగరాన్ని మనకు కాకుండా చేశారు. మన రాష్ర్టంలో ఎక్కడకు వెళ్లినా వైద్యుల్లేని పరిస్థితిని మారుస్తా. ప్రతీ జిల్లాలో ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాను. హైదరాబాద్ నగరానికి మించిన మహానగరాన్ని నిర్మించుకుందాం. అక్కడ 15 నుంచి 17 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుచేస్తాను. అక్కడ అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండేటట్టు చూస్తా. అంతేకాకుండా ఏ జిల్లాలో ఎవరికి ఏ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా వైద్యులు అందుబాటులో ఉండేలా రొటేషన్ పద్ధతి తీసుకొస్తాను.
 ఓటుతో తలరాత మారాలి..

 వరుసగామున్సిపల్.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత మన భవిష్యత్‌ను నిర్ణయించే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరుగుతాయి. మీ అందరికి ఒక మాట చెప్పాలి. మనం వేసే ఓటు మన తలరాతలను మార్చేదిగా ఉండాలి. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే వ్యక్తి ప్రజల మనసు ఎరిగేవాడు.. ప్రజల గుండెచప్పుడు వినేవాడు.. చని పోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికి ఉండేలా పా లించే వాడిని ఎన్నుకోవాలి. ఆ దివంగత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి దూరమై ఐదేళ్లయినా ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తే.. మా గుండెల్లో బతికే ఉన్నారని సమాధానం వస్తోంది. అలాంటి నాయకుడినే ఎన్నుకోవాలి.

 
9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావ్?


 ఆ దివంగత నేత కంటే ముందుగా చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించారు. ఆయన అధికారం కోసం ఎలాంటి గడ్డినైనా తినే నాయకుడు. ఆ భయానక పాలన ఇంకా నాకు గుర్తుంది. పంటలు వరుసగా దెబ్బతిని ైరైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులవి. వారి కోసం ఆ మహానేత వైఎస్ ఎన్నో  ఉద్యమాలు చేశారు. ఉచిత కరెంట్ ఇవ్వాలని, రుణాలు మాఫీ చేయమని ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అయినా బాబు మనసు చలించలేదు. పైగా హేళనగా మాట్లాడేవారు. అటువంటి బాబు ఇప్పుడు అధికారం కోసం రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని అబద్ధాలాడుతున్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉండగా ఎందుకు రైతుల రుణాలు మాఫీ చేయలేకపోయావని నేను అడుగుతున్నా. ఏకంగా మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానని చంద్రబాబు చెబుతుండడం ప్రజలను వంచించడం కాదా?
 
పోటెత్తిన జనం


ఏలేశ్వరంలో జగన్ రోడ్‌షోకు అనూహ్య స్పందన లభించింది. అనంతరం తునిలో వైఎస్సార్ జనభేరికి కనీవినీ ఎరుగని రీతిలో జనం పోటెత్తారు. జనభేరి జరిగిన తుని గొల్ల అప్పారావు సెంటర్ జనంతో కిక్కిరిసిపోయింది. ఈ సభలో తుని అసెంబ్లీ అభ్యర్థిగా దాడిశెట్టి రాజా, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కుసుమంచి శోభారాణిని జగన్ ప్రకటించారు. పర్యటనలో పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, కాకినాడ పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తదితరలు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం జగన్ తుని పట్టణంలో రోడ్‌షో, సాయంత్రం విశాఖజిల్లా నర్సీపట్నంలో వైఎస్సార్ జనభేరిలో పాల్గొననున్నారు.
 
 కుప్పం-శ్రీకాకుళం కారిడార్‌తో ఉద్యోగాలిస్తా..


 ‘‘అధికారంలోకి వచ్చాక కుప్పం నుంచి శ్రీకాకుళం దాకాచేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మించుకోవాలి. భారీ పరిశ్రమలు తీసుకురావాలి.వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్.. ఇలా పలు మౌలిక సదుపాయాలు కల్పించే పరిశ్రమలు తీసుకురావాలి.. వీటిని తీసుకు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాను. ఉద్యోగం కోసం హైదరాబాద్‌వైపు చూడకుండా ఇక్కడే వాటిని కల్పిస్తాను. ఇవి కాకుండా ఇంకా చాలానే పనులున్నాయి. వీటన్నిటితో పాటు మరో పదేళ్లలో సింగపూర్‌కు మించిన రాయల్‌సిటీని నిర్మించుకుందాం. చదువుకున్న ప్రతి ఒక్కరికీ చెబుతున్నా వారికి ఉద్యోగం వచ్చే విధంగా పనిచేస్తా. నేను మీకు హామీ ఇస్తున్నా.. ఆ హామీని అమలు చేసే ముఖ్యమంత్రిగా పని చేస్తాను.’’
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement