అటు కోట.. ఇటు పురం...
‘పేట’ అయినా.. ‘కోట’ అయినా జన నినాదం ఒక్కటే-‘జై జగన్’! ఆయన ఏ ‘పురం’ వెళ్లినా.. ఏ పల్లె నుంచి సాగినా.. అందరి కనుపాపలపై ప్రతిఫలించే నమ్మకం ఒక్కటే- ‘రాజన్న రాజ్యం’ మళ్లీ రావడం తథ్యం! గుండె లోతుల్లోని ప్రజల అభిమానమే గొంతులోకి వస్తోంది. తమ కష్టాలు తీర్చగల, కడగండ్లను కడతేర్చగల నాయకుడు జననేతేనన్న తిరుగులేని గురే వారిని ఆయన దరికి పరుగులు పెట్టిస్తోంది.
సామర్లకోట పట్టణం సాధారణంగా.. అక్కడ కొలువుదీరిన కుమారారామ భీమేశ్వరుని సన్నిధికి మహాశివరాత్రి నాడు తరలివచ్చే భక్తులతో కిక్కిరిసిపోతుంది. జగన్ రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని చూస్తే.. ‘మొన్న మొన్ననే జరిగిన మహాశివరాత్రి ఇంతలోనే తిరిగి వచ్చిందా?’ అనిపించింది. ఇక.. పెద్దాపురంలో జరిగిన జనభేరి సభకు వెల్లువెత్తిన జనాన్ని చూస్తే.. ఆ పట్టణంలో ఆషాఢమాసంలో జరిగే.. మరిడమ్మ జాతర ‘ముందే వచ్చిందా?’ అనిపించింది.
సాక్షి, సామర్లకోట :
ఆత్మీయబంధువు రాకతో జనకెరటం ఎగసిపడింది. అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికింది. జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో నిజంగా ఎటు చూసినా పండగ వాతావరణం కనిపించింది. తమ గుండెల్లో దైవంలా కొలువుదీర్చి కొలుస్తున్న మహానేత తనయుడు తమ చెంతకు రావడంతో జనం ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఇళ్లనువదిలి రోడ్లపై చేరి, గంటల తరబడి నిరీక్షించారు.
చిన్నారులు.. యువకులు.. మహిళలు.. వృద్ధులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ అభిమాన నాయకుడిని చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. తన కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వారందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ జననేత ముందుకు సాగారు. ‘జగన్‌బాబుకు తనను ప్రేమించే ప్రజలంటే ఎంత మక్కువో! వారి మధ్యకు రావడానికి ఎంత ఆరాటమో! వారికి భరోసాను కల్పించడానికి ఎంత ఆయాసప్రయాసలనైనా భరించే ఆయనది ఎంత ఓర్పో! జనాన్ని తన ఆత్మీయగణంగా పరిగణించే అలాంటి నేతకు ఒక్కసారి అవకాశమిస్తే ఇక మా జీవితాల్లో వెలుగులు విరజిమ్మడం.. ఉషోదయం తూర్పున అన్నంత నిశ్చయమే!’ అని జనం ఉప్పొంగి పోయారు.
‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ఆరవ రోజైన శనివారం జననేత జగన్ సామర్లకోట పట్టణ వీధుల్లో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్వారపూడి రోడ్‌లోని నవభారత్ వెంచర్స్ గెస్ట్‌హౌస్ నుంచి పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, సామర్లకోట మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధి గోలి వెంకట అప్పారావు చౌదరి(దొరబాబు)లతో కలిసి జగన్ రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ‘ఎంత కూలి వస్తుంది? ఏ విధంగా ఉన్నారు?’ అంటూ ఆరా తీశారు. అక్కడి నుంచి రోడ్ షో రైల్వేస్టేషన్, పోలీస్ రింగ్ సెంటర్, దేవీచౌక్, గోలి వారి వీధి, నీలమ్మ ట్యాంకు, గొల్లగూడెం వీధి, బళ్ల మార్కెట్, సీతాఫలదొడ్డి, వెంకటేశ్వరస్వామి, చంద్రశేఖరస్వామి వారి ఆలయాల మీదుగా సాగింది.
ప్రియతమ నాయకుడా! నీకై ఎదురుచూస్తోంది మా వాడ!
తమ కలలకు కేంద్రంగా నిలిచిన నాయకుడిని తమ ప్రాంతానికి రప్పించుకోవాలన్న బలీయమైన ఆకాంక్షతో వేలాది మంది ప్రజలు రోడ్ షోకు అడ్డుపడ్డారు. తమ ప్రాంతాల్లో పర్యటించాలని జగన్‌ను ఒత్తిడి చేశారు. వారి అభిమానాన్ని కాదనలేని ఆయన వారి ప్రాంతాలకు పర్యటించారు. లారీ యూనియన్ అధ్యక్షుడు ముత్యం రాజుబాబు ఇంట్లో భోజన విరామం అనంతరం మధ్యాహ్నం వేణుగోపాలస్వామి గుడి, అడపా వారి వీధి, బోనాసువారి వీధి, పశువులమ్మ గుడిల మీదుగా బ్రౌన్‌పేట వైపు జగన్ రోడ్‌షో సాగాల్సి ఉంది.
అయితే బోనాసువారి వీధికి చేర్చి ఉన్న కుమ్మరిపేట, అరుంధతీపేట వాసులు తమ ప్రాంతాల్లో పర్యటించాలని కాన్వాయ్‌కు అడ్డుపడి అభిమానంతో కట్టిపడేశారు. అరుంధతీపేట వాసులైతే తమ ప్రాంతంలో ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేయాలని పట్టుబట్టారు. వారి అభిమానానికి బందీ అయిన జననేత కాలిన డకనే ఆయా ప్రాంతాలకు వెళ్లారు. కుమ్మరి వీధిలో ప్రతి ఒక్కర్నీ పలకరించడమే కాక.. అరుంధతీపేటలో స్థానికుల కోరిక మేరకు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చిన్నారులను ముద్దాడి..మహిళలు..వృద్ధులను పలకరించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అనంతరం పశువులమ్మగుడి మీదుగా బ్రౌన్‌పేటకొచ్చేసరికి వేలాది మంది జనం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయాల్సిందిగా పట్టుబట్టారు.
జగన్ ఆ మహానీయునికి నివాళులర్పించి ముందుకు కదిలారు. అడుగడుగునా ఇదే రీతిలో ప్రజలు జననేతకు జనం నీరాజనాలు పలికారు. దీంతో ఉదయం 10.10 గంటలకు ప్రారంభమైన రోడ్ షో పట్టణ పరిధిలో పది కిలోమీటర్ల మేర సాగడానికి పది గంటలకు పైగా సమయం పట్టింది. ప్రతి ఒక్కర్నీ పేరుపేరునా పలకరిస్తూ వారి కష్టసుఖాల్లో మమేకమైన జగన్‌ను చూసి ఇలాంటి నాయకుడిని ముందెన్నడూ వృద్ధులు వ్యాఖ్యానించారు. ‘బిడ్డ పదికాలాలు చల్లగా ఉండాలి. ప్రజలను చల్లగా పాలించాలి’ అంటూ ఆశీర్వదించారు.
జనఝరిగా జరిగిన ‘జనభేరి’
సామర్లకోట నుంచి జగన్ నేరుగా పెద్దాపురం వెళ్లి మెయిన్‌రోడ్లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో పాల్గొన్నారు. మహానేత తనయుడిని చూ సేందుకు నియోజకవర్గమంతా తరలి వచ్చిందా అన్నట్టు పెద్దాపురం పట్టణ వీధులు జనప్రవాహాలయ్యాయి. జగన్ ప్రసంగంలో ప్రతి పలుకుకూ ప్రజలు హర్షాతిరేకాలతో స్పందించారు. పర్యటనలో సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, అనుబంధ విభాగాల కన్వీనర్లు పంపన రామకృష్ణ, గుత్తుల రమణ, రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.