త్వరలో కష్టాలన్నీ తీరతాయి
సామర్లకోట/పిఠాపురం, న్యూస్‌లైన్ :
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామర్లకోటలో నిర్వహించిన రోడ్‌షోలో అడుగడుగునా ప్రజలు తమ ఆప్యాయతానురాగాలు పంచారు. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. వాటన్నింటినీ ఆయన ఓపికగా విని వారికి ధైర్యం చెప్పారు. ‘నా పెద్ద కొడుకు రాజన్న మళ్లీ వచ్చినట్టుంది.. మనవడా నీవు చల్లగా ఉండాలి. ఆ మహానేత కొడుకుగా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి నీవు మళ్లీ మాముందుకు ముఖ్యమంత్రిగా వస్తావు బాబూ’ అంటూ సామర్లకోటకు చెందిన ఎ. బుల్లమ్మాయి అనే వృద్ధురాలు ఆప్యాయంగా పలకరించింది.
ఆమెను జగన్‌మోహన్‌రెడ్డి ముద్దాడి ‘నీ ఆశీర్వాదంతో మళ్లీ వస్తా నాయనమ్మా’ అని అన్నారు. నాకు గతంలో కంటితుడుపుగా పింఛను అందేది, అది కూడా నెలల తరబడి ఇచ్చేవారు కాదు. వైఎస్సార్ మాకష్టాలు తెలుసుకుని రూ.200 మంజూరు చేశారు. ప్రస్తుతం అది ఎప్పుడు ఇస్తారో తెలియక సతమతమవుతున్నాను. అంటూ ఆ వృద్ధురాలు జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుంది, త్వరలో రూ.700 పింఛను మీకు అందిస్తా అని ఆమెకు భరోసా ఇచ్చారు. ‘తమ్ముడూ నీవు ఏం చదువుకుంటున్నావు’ అంటూ సామర్లకోటకు చెందిన ఎస్.వినోద్ అనే విద్యార్థిని స్థానిక సాయిబాబా గుడి దగ్గర జగన్‌మోహన్‌రెడ్డి పలకరించారు.
సార్, నేను పెద్దాపురం కిట్స్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాను, నాకు ఫీజురీయింబర్స్‌మెంటు అందడం లేదు. దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ రాలే దు అని వివరించాడు. త్వరలోనే అన్ని ఇబ్బందులు తీరుతాయి అని ఆలింగనం చేసుకోవడంతో అతడు ఉబ్బితబ్బిబయ్యాడు. అమ్మను కూడా అడిగానని చెప్పు తమ్మూడూ అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడంతో ఆ విద్యార్థి ఆనందపరవశుడయ్యాడు. వయసుమళ్లుతుండడంతో జీవనోపాధి కరువైందని సామర్లకోట మున్సిపల్ కార్యాలయం వద్ద కోరుకొండ సూరిబాబు, మహాలక్ష్మి దంపతులు జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవిం చారు. నాన్న ఆశయాలను నేను నెరవేరుస్తా, మీరు నన్ను ఆశీర్వదించండి.
మీకు అండగా నేనుంటాను అని ఆయన భరోసా ఇచ్చారు.ఆధార్ కార్డు లేకపోవడంతో ఏ పథకం వర్తించడం లేదని సామర్లకోటకు చెందిన అనుసూరి దుర్గ అనే మహిళ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు తీసుకుని వెంటనే సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని తన వెంట ఉన్న తోట సుబ్బారావు నాయుడిని ఆయన ఆదేశించారు. అధికారులతో మాట్లాడి ఆమెకు ఆధార్ కార్డు వచ్చేలా చూడాలని చెప్పారు. ఏ కార్డూ లేకుండానే అన్ని పథకాలు అందరికీ అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
మీరంతా నన్ను ఆశీర్వదించి వైఎస్సార్ సీపీని గెలిపించాలని జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. మహానేత వైఎస్సార్‌ను మీలోనే చూసుకుంటున్నామని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని దుర్గ చెప్పింది. ఎందరికో సొంత గూడు కల్పించిన మహానేత వైఎస్సార్ మృతి చెందాక తమను పట్టించుకునేవారే కరువయ్యారని సామర్లకోటకు చెందిన జి.సీతాలక్ష్మి, దారా కామేశ్వరి జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని వాపోయారు. మీ కష్టాలు తీరే సమయం దగ్గరలోనే ఉందని జగన్‌మోహన్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.