' ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిల
' అందరికీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత వైఎస్
' మళ్లీ అలాంటి సంక్షేమ రాజ్యంకోసం వైసీపీకి ఓటేయండి
' పులిని చూసి న క్క వాతలు పెట్టుకున్నట్టు బాబు వాలకం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అంబేద్కర్‌లాంటి మహనీయుల స్ఫూర్తితో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని.. అదే అంబేద్కర్ స్ఫూర్తితో జగనన్న తన మేని ఫెస్టోను రూపొందించారని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజైన సోమవారం ఆమె జిల్లాలోని ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో పర్యటించారు.ఉదయం ప్రచారాన్ని ప్రారంభించగానే అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంబేద్కర్, వైఎస్సార్‌చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ఆమె ఏమన్నారంటే..
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా గడపగడపకు సంక్షేమ పథకాలు అందేలా చూశారు. వైఎస్సార్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆయన మరణం తర్వాత ఒక్కొటొక్కటిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వాస్తవం. ఇప్పుడు కావాల్సింది సంక్షేమరాజ్యం. వైఎస్సార్‌లా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, డ్వాక్రా రుణాలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల ప్రేమను గెలుచుకునే వారెవరనేది ప్రజలు ఆలోచించాలి. సమర్థనాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వైఎస్సార్ పథకాలను కొన సాగించేందుకు, రాజన్న రాజ్యం తెచ్చేందుకే వైఎస్‌ఆర్‌సీపీ పుట్టింది. ఆయన ఆశయాలు సాధించడమే వైఎస్‌ఆర్ సీపీ లక్ష్యం. ఓటేసే సమయంలో ఒక్కసారి వైఎస్సార్‌ను గుండెలనిండా గుర్తు తెచ్చుకోండి. ఆయన పాలన తిరిగి తెచ్చేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గొప్ప మెజారిటీతో గెలిపించండి.
ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే!
ైవె ఎస్ రాజశేఖరరెడ్డి ఏ పథకాలు అమలు చేశారో అవే పథకాలను తాను ప్రవేశపెడతానని చెబుతున్నారు చంద్రబాబు. వైఎస్‌ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తే.. తానూ ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నారు. వైఎస్‌ఆర్ రుణమాఫీ చేస్తే.. తానూ రుణమాఫీ చేస్తానంటున్నారు. వైఎస్‌ఆర్ ఫీజు రీయంబర్స్‌మెంట్ ప్రవేశపెడితే... తాను ఉచితంగా విద్యనందిస్తానంటున్నారు. ఎన్నివాతలు పెట్టుకున్నా.. నక్క నక్కే, పులి పులే. కాగా, షర్మిల వెంట వైఎస్‌ఆర్‌సీపీ ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకటరావు, ఖమ్మం,వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు నాగభూషణం, బాణోతు మదన్‌లాల్, డాక్టర్ రవిబాబునాయక్, వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో జగనన్న మేనిఫెస్టో : షర్మిల
Published Tue, Apr 15 2014 3:09 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM
Advertisement