ప్రేమ వెల్లువల్లె.. మమత కొండమల్లె
సాక్షి, ఏలేశ్వరం :
కల్మషం లేని ఆ మనుషుల మనసులు ఆ మహానేత తనయుని చూడాలని తహతహలాడాయి. కుట్రకుతంత్రాలు తెలియని; కల్లాకపటం లేని వారి ప్రేమానురాగాలు అయస్కాంతాల్లా ఆకట్టుకుంటుండగా.. జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెల్లమెల్లగా ముందుకు సాగారు.
మైదానప్రాంతాల్లోనే కాదు.. గిరిజన ప్రాంతంలో కూడా ఆయనపై అదే ఆదరాభిమానాలు ఏలేరు వరదలా ఉప్పొంగాయి. జిల్లాలో సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఎనిమిదో రోజైన సోమవారం ఉపప్రణాళికా ప్రాంతంలోని ఏలేశ్వరంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం తునిలో జరిగిన జనభేరి సభలో పాల్గొన్నారు.
ఉదయం 10.15 గంటలకు ఏలేశ్వరం లింగవరం కాలనీలోని మండల యూత్ కన్వీనర్ జువ్విన వీర్రాజు ఇంటి నుంచి ప్రారంభమైన రోడ్ షో నగర పంచాయతీ పరిధిలోని వీధులలో సాగింది. సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోకు..అడుగడుగునా వెల్లువెత్తిన ప్రజా స్పందనతో ఏడున్నర గంటలకు పైగా పట్టింది.
రోడ్ షోలో జగన్ వెంట కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఉన్నారు. రోడ్ షో లింగవరం కాలనీ నుంచి ఎమ్మార్వో కార్యాలయం, ప్రభుత్వాసత్రి, నంది వీధి, పల్లపు వీధి, మార్కెట్ వీధి, హనుమాన్ జంక్షన్, దిబ్బలపాలెం, కాలేజ్ రోడ్ మీదుగా బాలాజీ చౌక్ వరకు సాగింది.
పేరుకు ఎన్నికల ప్రచారమే అయినా.. పర్యటన ఆద్యంతం జననేత ప్రజా సమస్యలకేప్రాధాన్యమిచ్చారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ, వారిలో భరోసా నింపారు. గతంలో ఏనాడూ ఏలేశ్వరంలో ఒక పార్టీ అధినాయకుడు ఇలా పర్యటించలేదు. జగన్‌ను చూసి, ఆ ప్రాంత గిరిజనుల మోముల్లో సంభ్రమాశ్చర్యానందాలు నిండాయి. జగన్ పలుచోట్ల నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకు తానే వెళ్లి బాగోగులు తెలుసుకోవడం వారిని అమితంగా ఆకట్టుకుంది.
ఏజెన్సీ ముఖద్వారం కావడంతో జగన్ పర్యటనకు భారీ ఎత్తున పోలీసులను, యాంటీనక్సల్ స్క్వాడ్ సిబ్బందిని మోహరించారు. అయితే జననేత ఇవేమీ పట్టించుకోకుండా మామూలు మనిషిలా ప్రజలతో మమేకమయ్యారు. నడినెత్తిన నిప్పులు చెరుగుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా.. రోడ్‌షో సాగిన దారి పొడవునా జనం రోడ్లకిరువైపులా బారులు తీరారు. గర్భిణులు, బాలింతలు కూడా జగనన్నను చూడాలని మండే ఎండలో నిరీక్షించారు. ఇక చిన్నారులు, యువకులు ‘జె జగన్..జైజై జగన్’ అంటూ నినదించారు.
చిన్నారికి సునీల్‌గా నామకరణం
ఏలేశ్వరం పల్లపు వీధికి చెందిన కర్రోతు గణేష్, సాయిపద్మినిల మూడవ సంతానమైన 22 రోజుల శిశువుకు జననేత ‘సునీల్’ అని నామకరణం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆ శిశువు ైవె ద్యానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చలమలశెట్టి సునీల్‌కు సూచించారు.
దిబ్బలపాలెం కాలేజీ రోడ్‌లో నడవలేకున్నప్పటికీ జగన్‌ను చూడాలని రోడ్డుపై కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తున్న రిటైర్డ్ టీచర్ పులపకూర ఆశీర్వాదం దగ్గరకు ఆయనే నడుచుకుంటూ వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
వినతుల వెల్లువ
ఏలేశ్వరం రోడ్ షోలో పలు సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు. బీఈడీ చేసిన వారందరికీ ఎస్‌జీటీలుగా అవకాశం కల్పించాలంటూ బీఈడీ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ అర్హత పరీక్షలు రద్దు చేయాలని, గ్రామాల్లో డిగ్రీ, ఇంటర్, పదవతరగతి చదివిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిరుద్యోగులు వినతిపపత్రాలు సమర్పించారు.
ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కాంట్రాక్టు లెక్చరర్లు కోరారు. వారి సమస్యలన్నీ సావధానంగా విన్న జననేత మరో రెండు నెలల్లో వచ్చే మన ప్రభుత్వంలో మీ సమస్యలు పరిష్కరిస్తాను’ అని హామీ ఇచ్చారు.
పింఛన్‌లు, ఇళ్లు కావాలని, రేషన్ కార్డులు, రుణాలు అందించి ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేయగా ‘కొంచెం ఓపిక పట్టండి. తప్పకుండా మన ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ఇళ్లు, పింఛన్లు అందేలా చూస్తాను’ అని భరోసానిచ్చారు.