
'చెప్పిన పనులే కాదు... చెప్పనవి కూడా చేస్తా '
రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్దానాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ విమర్శించారు.
కర్నూలు: రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్దానాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అబద్దపు హామీలిస్తున్నారని అన్నారు. మన రాష్ట్ర బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లయితే.. రూ.1.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, మద్యపాన నిషేధంను ఎత్తివేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం కర్నూలు జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు. కర్నూలు జిల్లా నుంచి మొట్టమొదటి ఎమ్మెల్సీ అభ్యర్థి అవకాశం ముస్లింకి ఇస్తానని ఆయన హామీయిచ్చారు. ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా, ఢిల్లీకి సాగిల పడే ప్రభుత్వం కావాలా అని ఆయన అడిగారు. చంద్రబాబు మోడీకి ఓటు వేయమంటున్నారని, తాను తెలుగుజాతి భవిష్యత్ కోసం ఓటు వేయమంటున్నానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రం దశ-దిశ మార్చే ఆరు పనులు చేస్తానని హామీయిచ్చారు. చెప్పిన పనులే కాకుండా.. చెప్పనవి కూడా చేస్తానని జగన్ అన్నారు.