ఐదు సంతకాలతో బంగారు భవిత: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి | ys jagan said with five signs golden future is there | Sakshi
Sakshi News home page

ఐదు సంతకాలతో బంగారు భవిత: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Published Sun, Apr 20 2014 2:08 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan said with five signs golden future is there

 వైఎస్సార్, నెల్లూరు జిల్లాల ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

  •  రాజశేఖరరెడ్డి వారసత్వంగా నాకు వచ్చింది విశ్వసనీయతే
  •  సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తెస్తా
  •  బెల్టు షాపులు లేకుండా చేస్తా.. ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తా
  •  చంద్రబాబు ఓట్లు సీట్లు కోసం అన్నీ ఉచితమేనంటున్నారు
  •  అబద్ధాలు చెప్పడం ఆయన నైజం
  •  ఆ నయవంచకుడు వస్తే తొమ్మిదేళ్లలో ఏం చేశావని నిలదీయండి



సాక్షి ప్రతినిధి, కడప:
‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయి నాలుగున్నరేళ్లు కావస్తున్నా.. ఆ దివంగత నేత ఎక్కడ ఉన్నాడని ప్రశ్నిస్తే... ప్రజల చేయి నేరుగా గుండెల వైపు వెళ్తుంది. రాజన్న మా గుండెల్లో జీవించి ఉన్నారని నినదిస్తారు. ఆ మహానేత నుంచి నాకు వారసత్వంగా ఏదైనా వచ్చిం ది అంటే అది ఒక్క విశ్వసనీయతే. ఆ రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ మీకు అందిస్తా. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైనే ఐదు సంతకాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల దశ, దిశ మారుస్తా. నా అక్కచెల్లెళ్లకు, రైతన్నలకు బంగారు భవితను అందిస్తా’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
 
ఆయన శనివారం వైఎస్సార్‌జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా రాపూరు, సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు, ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలాల్లో ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ‘‘మన తలరాతలు మార్చే ఎన్నికలు మరో 20 రోజుల్లో రానున్నాయి. తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ ప్రజల కష్టాలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇస్తానంటూ అడ్డగోలు హామీలిస్తూ మీ ముందుకు వస్తున్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
 
పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా వెన్నుపోటు ద్వారా ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్నారు. ఆ తర్వాత ఆయనపై చెప్పులేయించి ఆయన మరణానికి కారకుడయ్యారు. ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా కనపడకుండా చేశారు, ఆ తర్వాత అవసరంకోసం అదే ఎన్టీఆర్ ఫొటోలకు దండలేసి దండం పెడుతున్నారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యనిషేధం అన్నారు. తర్వాత ఈనాడు పత్రికలో రాతలు రాయించి ఊరూరా బెల్టుషాపులు పెట్టించా రు. రూ.2కిలో బియ్యం పథకానికి తూట్లు పొడిచి రూ.5.25 చేశారు.
 
అధికారంకోసం పిల్లనిచ్చిన మామ కు, ఎన్నికల తర్వాత ప్రజలకూ వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర ఆయనది. నయవచకుడు చంద్రబాబును నమ్మొద్దు. ఆయన నోటి నుంచి చస్తే నిజాలు చెప్పరు. చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పి అదే నిజమని నమ్మించే రకం. ఆయన మీ ముం దుకు వస్తే సీఎంగా తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఏం మేలు చేశావని నిలదీయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆయా సభల్లో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే...
 
ఐదు సంతకాలతో రాష్ట్రం దశ దిశ మారుస్తా...

*అక్కాచెల్లెళ్లకు చదివించే స్థోమతలేక ఆరేడు తరగతులు చదువుతున్న పిల్లలను కూడా కూలి పనులకు తీసుకెళ్తున్నారు. వారికిచ్చే కూలి రూ.50తో మరో రోజు తిండికి గడుస్తుందని అలా చేస్తున్నారు. నా అక్కాచెల్లెళ్లను ఆ కష్టాలకడగండ్ల నుంచి గట్టెక్కేంచేందుకు అమ్మఒడి పథకంపై తొలి సంతకం చేయబోతున్నా. ఇద్దరు పిల్లలను బడికి పంపితే ఆ తల్లి ఖాతాలో ప్రతి నెలా రూ.వెయ్యి జమ చేస్తా.
 
*నా అవ్వాతాతల కోసం రెండో సంతకం చేయబోతున్నా. నాయనా మీ నాయన పుణ్యాన రూ.200 పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఆ డబ్బులు ఒకపూట తిండికే సరిపోతున్నాయి. మూడు పూటల తిండి తినాలంటే కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందని అవ్వాతాతలు చెబుతున్నారు. ఓ మనవడిగా వారికి నెలకు రూ.700 చొప్పున పెన్షన్ ఇచ్చేలా సంతకం చేస్తా.
 
*రైతన్నల కోసం మూడో సంతకం చేయబోతున్నా. రైతులకు మద్దతుధర, గిట్టుబాటు ధర కల్పించడం కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తా. కరువు, వరద వచ్చినప్పుడు వెంటనే పరిహారం అందించి రైతును ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో సహాయ నిధి ఏర్పాటుచేస్తా. ఖరీఫ్‌లో పంట నష్టపోతే రబీ నాటికి నష్టపరిహారం అందిస్తా.
 
*నా అక్కాచెల్లెళ్ల కోసం నాలుగో సంతకం చేయబోతున్నా. ఆర్థిక ఇబ్బందులవల్ల ఏ నెల కొంతైనా డ్వాక్రా మహిళలు చెల్లించకపోతే రూ.రెండు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆ వడ్డీ భారం తప్పించుకోవడానికి అక్కాచెల్లెళ్లు వారి పిల్లలను చదువు మాన్పించి పనులకు తీసుకెళ్తున్నారు.. ఆ ఇబ్బందుల నుంచి అక్కాచెల్లెమ్మలను తప్పించేందుకు రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.
 
*గ్రామాల్లోకి పోతే... రేషన్ కార్డు లేదని ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు అందడం లేదని చెబుతున్నారు.. రేషన్‌కార్డు, పెన్షన్‌కార్డు ఏ కార్డు కావాలన్నా మీ ఊర్లో, మీ వార్డులోనే 24 గంటల్లోగా కార్డు ఇప్పించేలా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఐదో సంతకం చేస్తా.
 
*2019 నాటికి ఏ గ్రామానికికైనా వెళ్లి ఇళ్లులేని వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే ఒక్క చేయి కూడా పైకి లేవకుండా చేస్తా. గుడిసే లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా.. ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. రూ. లక్ష వ్యయంతో ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాదు.. ఆ ఇంటి పట్టాలు కూడా అక్కాచెల్లెళ్లకు అందిస్తా. ఆ ఇంటి పట్టాలు తాకట్టు పెడితే పావలా వడ్డీకే రూ.30 వేలను రుణంగా ఇచ్చేలా బ్యాంకర్లతో నేను మాట్లాడతా.
 
*వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నమైన ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నీరుగార్చింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులను గౌరవించడం లేదు. 133 రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించారు. నేను సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీని బాగుచేస్తా. చికిత్స చేయించుకున్నవారు డాక్టర్ సూచన మేరకు ఎన్ని నెలలు విశ్రాంతి తీసుకుంటే.. అన్ని రోజులు నెలకు రూ.3 వేల చొప్పున సహాయంగా అందిస్తా.
 
*ఏ పేదవాడికి గుండె, కేన్సర్ ఆపరేషన్లు చేయించుకోవాలన్నా హైదరాబాద్‌కు పోవాల్సిన పరిస్థితి ఉంది. నేను సీఎం అయ్యాక ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించి డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చేస్తా. కొత్త రాష్ట్రంలో హైదరాబాద్‌ను మించిన నగరం నిర్మిస్తా.
 
*రాష్ట్రంలో వేళాపాళాలేని విద్యుత్ కోతలున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. 2019 నాటికి విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తా. వ్యవసాయానికి పగలు 7 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తా.
 
*ఒక టీవీ, రెండు ఫ్యాన్‌లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి ఇప్పుడు బిల్లు రూ. 550 వరకూ వస్తోంది. ఆ బిల్లులు కట్టలేని దుస్థితిలో పేదలు ఉంటే, కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. నేను సీఎం అయ్యాక ఒక టీవీ, రెండు ఫ్యాన్‌లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి రూ.వంద మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేలా చూస్తా. అది ప్రజల హక్కుగా మార్చుతా.
 
*ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన పిల్లలు బెల్ట్‌షాపుల వల్ల దారితప్పుతున్నారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక బెల్ట్‌షాపులను మూసివేయిస్తా. బెల్ట్‌షాపులు లేకుండా చేసేందుకు ప్రతి గ్రామానికి పది మంది ఆడ పోలీసులను నియమిస్తా. ప్రతి నియోజకవర్గానికి ఓ చోట మాత్రమే మద్యం దుకాణం ఉంటుంది. ఆ షాపును కూడా ప్రభుత్వమే నడుపుతుంది. మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా ఉంటాయి. త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళ్లి మద్యం తాగేవారు ఆ ధరలు చూసి అటునుంచి అటే హాస్పిటల్‌కు పోయే విధంగా ఉంటాయి.
 
కుప్పంలో అట్టహాసంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కె. చంద్రమౌళి శనివారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.  నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ అభిమానులు  ఉప్పెనలా తరలివచ్చారు. కుప్పం పట్టణం జనసంద్రమైంది. రెండుగంటలపాటు ర్యాలీ సాగింది.  జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలతో పట్టణం హోరెత్తింది.
 
 మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రమౌళి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సామాన్య కిరణ్, చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు, జెడ్పీ మాజీ  చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, వూజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, చిత్తూరు వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులు పాల్గొన్నారు.     - కుప్పం, న్యూస్‌లైన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement