మాట తప్పను.. ఉచితం ఇస్తాను..
* వైఎస్ మాట ఇది
* ఉచిత విద్యుత్‌పై హామీ నిలబెట్టుకున్న వైఎస్
* కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ కొనసాగింపు
సి. మాణిక్యాల రావు: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏ పథకం, ఏ కార్యక్రమం అమలు చేసినా దాని వెనుక ఒక బలమైన ప్రజల ఆకాంక్ష, వారి కష్టార్జితం ఉంటాయి... ఇందుకు ప్రబల నిదర్శనం 2004 ఎన్నికల ముందు ఆయన ప్రకటించిన రైతులకు ఉచిత విద్యుత్ అంశం. ఎన్నికల ముందు హామీ ఇవ్వడమే కాదు..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైఎస్ ఉచిత విద్యుత్ ఫైలుపై ప్రజల ముందే తొలి సంతకం చేశారు. అప్పటి నుంచి మొదలు ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులూ కూడా ఉచిత విద్యుత్‌కు ఏదో విధంగా మంగళం పలికించాలనే కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు.
ప్రతి ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళిక ఆమోదం సమావేశంలో కేంద్ర ప్రణాళికా సంఘం ఉచిత విద్యుత్‌పై అభ్యంతరాలను ప్రస్తావిస్తూనే ఉంది. ఆఖరికి 2008 సంవత్సరంలో కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలని గట్టిగా పట్టుపట్టారు. సబ్సిడీలను ప్రోత్సహించరాదని, అలాంటి రాష్ట్రాలకు కేంద్ర సాయం తగ్గించాల్సి ఉంటుందని సింగ్ హెచ్చరించారు. దీనిపై వైఎస్ ఉచిత విద్యుత్ ఎందుకు ఇస్తున్నదీ గట్టిగా వివరించారు.
ఉచిత విద్యుత్ సరఫరాపై వైఎస్ నిబద్ధతకు నిదర్శనాలివి...
ఉచిత విద్యుత్ ఇస్తే తప్పేమిటి...!
‘‘రాష్ట్రంలో భూములు యూనిఫాంగా లేవు..కొన్ని ప్రాంతాల్లో మెట్ట భూములున్నాయి..కొన్ని ప్రాం తాల్లో పల్లం భూములున్నాయి.. సీమాంధ్రలో సహజ జలవనరులు అందుబాటులో ఉండడంతో ప్రభుత్వ పెట్టుబడితో ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతుల పొలాలకు కాలువల ద్వారా సాగునీటిని అందిస్తోంది..ఇక్కడ రైతు పెట్టుబడి కేవలం కష్టపడటమే..అయితే తెలంగాణలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులున్నాయి..ఇక్కడ అన్నీ మెట్ట భూములే..ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వసతి లేదు..ఇక్కడ రైతులే అప్పు చేసో ఏదో రకంగా సొంత పెట్టుబడితో బోర్లు వేసుకున్నారు..ఒక్కో సారి రెండేసి మూడేసి బోర్లు వేస్తే గానీ నీరు దొరకదు..చాలా రిస్క్‌తో తెలంగాణ రైతులు వ్యవసాయం చేస్తున్నారు..ఇక్కడ ఎక్కడా సాగునీటి వసతికి ప్రభుత్వ పెట్టుబడి లేదు..బోర్లు, మోటార్లు అంతా రైతు పెట్టుబడే..ఈ నేపథ్యంలో ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ ధర్మం..దీన్ని ఎంత మాత్రం సబ్సిడీ భారంగా పరిగణించలేం..దేశ ఆహార భద్రతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద మొత్తంలో వాటా ఇస్తోంది.. ఈ నేపథ్యంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం..ఇందుకు మీరు సబ్సిడీని భరిస్తే భరించండి లేదంటే రాష్ట్రమే భరిస్తుంది..ఈ విషయంలో కేంద్ర జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించం....’’
- వైఎస్ 2008లో ప్రణాళికా సంఘం ముందు ఉచిత విద్యుత్‌పై చేసిన వాదన ఇదీ..ఇందులో తెలంగాణ రైతుల పట్ల ఆయనకు గల నిబద్ధత ఎలాంటిదో చాటిచెప్పింది.
మాట తప్పను...
‘‘నేను ఎన్నికల ముందు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చాను..చిన్న పెద్ద అనే తేడా చెప్పలేదు..ఇప్పుడు మాట తప్పలేను..ఎంత కష్టమైనా, నష్టమైనా మాట తప్పను’’
-ఉచిత విద్యుత్‌ను చిన్న, మధ్యతరగతి రైతులకే పరిమితం చేయాలని, పెద్ద రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దని, ఇందుకు భూ పరిమితి విధించాలని ఓ సందర్భంలో వామపక్షాలు వైఎస్‌కు సూచించినపుడు ఆయన స్పందన ఇది.