విజయహో...
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మకు పల్లెలన్నీ నీరాజనాలు పట్టాయి. పోటెత్తిన నదుల్లా పరవళ్లు తొక్కాయి. ఉరుకుల పరుగులతో పొంగి పొర్లాయి. ఉవ్వెత్తున అభిమానుల ఉత్సాహం ఉరకలేసింది. పల్లె ప్రజలు స్వాగతించిన తీరు నిరూపమానం. ఉప్పెనంత ఉత్సాహంతో ఉరికి వచ్చి, ఆ స్ఫూర్తి ప్రదాతను ఆదరించిన తీరు వర్ణానాతీతం. ప్రభంజనంలా విజయమ్మ ఎన్నికల ప్రచారం సాగింది. ఆత్మీయ అతిథికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. తమ ప్రియతమ నేత అర్ధాంగిని చూసి ఆనంద పరవశులయ్యారు. వైఎస్సార్‌సీపీ పతాకాలతో, జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.
సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు జనవాహినిలా గోచరించాయి. గురువారం ఉదయం బొబ్బిలిలో ప్రారంభమైన వైఎస్ విజయమ్మ రోడ్‌షో మక్కువ వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రమాదమని తెలిసినా, గోడలు, మేడలు ఎక్కి తమ అభిమాన నేత మాతృమూర్తిని చూసేందుకు పరితపించారు. చూడగానే మురిసిపోయారు. ఇక,విజయమ్మ అడుగు పెట్టగానే మక్కువ జనసంద్రమయ్యింది. ప్రజలనుద్దేశించి ప్రసంగించినప్పుడు ఆమె మాటలు అమృతపు గుళికలగా అందర్నీ హత్తుకున్నాయి.
‘చంద్రబాబు అధికారంలో ఉండగా అనేక ప్రభుత్వ సంస్థలను పప్పు బెల్లాల్లా తన బినామీలైన నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, రామోజీరావు, సత్యం రామలింగరాజు, బిల్లీరావు, మురళీమోహన్....ఇలా అనేక మందికి కట్టబెట్లి వందల కోట్ల రూపాయల మేలు పొందారు’ అని చెప్పగానే ప్రజల్లో ఒక్కటే కరతాళ ధ్వనులొచ్చాయి. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు, పెద్దగెడ్డ ప్రాజెక్టుల మిగతా పనులు పూర్తి చేస్తామని చెప్పేసరికి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక్కడ మక్కువ మండల మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మావుడి రంగునాయుడు, డీసీసీబీ డెరైక్టర్ మావుడి తిరుపతిరావు, మక్కువ సర్పంచ్ వెలగాడ వెంకటలక్ష్మి సహా 11మంది సర్పంచ్‌లు, 42మంది మాజీ ప్రజాప్రతినిధులు, మరో 15వేల మంది కార్యకర్తలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరడంతో సాలూరు ఎన్నిక వన్‌సైడ్ అయిపోయిందనే వాదన విన్పించింది.
చంద్రబాబు తొమ్మిదేళ్ల భయానక పాలన...
‘చంద్రబాబు తొమ్మిదేళ్ల భయానక పాలనలో కరువు, దుర్భిక్షంతో వేలాది మంది రైతన్నలు చనిపోయారని, మైక్రో ఫైనాన్స్ ఆగడాలతో వందలాది మంది అక్కాచెల్లెళ్లు ప్రాణాలు తీసుకున్నారని’ గుర్తు చేసేసరికి సభికులు అయ్యో అని బాధపడ్డారు. మక్కువ ప్రసంగం అనంతరం పార్వతీపురం వరకు రోడ్‌షో సాగింది. దారి మధ్యలో విజయమ్మను చూసేందుకు ఆత్రుత కనబరిచారు. తన వాకిట ముందు వెళ్లున్న ఆ మాతృమూర్తికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పార్వతీపురంలో జరిగిన సభలో చంద్రబాబు తీరును విజయమ్మ ఎండగట్టారు. అనేక ప్రభుత్వ సంస్థలను తన బినామీలకు కట్టబెట్టడమే కాకుండా దాదాపు 18 కుంభకోణాలకు పాల్పడరని వివరించేసరికి ప్రజలు నిర్ఘాంతపోయారు. చివరికి ఇంకుడు గుంతలు, పనికి ఆహారం పథకం, నీరు-మీరు పథకంలో కూడా అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసరికి చంద్రబాబు సంగతి అందరికీ తెలిసిందేనమ్మా అంటూ పలువురు గొంతు కలిపారు. జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఇక్కడ హామీ ఇవ్వగానే హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. పార్వతీపురంలో సభ ముగిసిన తర్వాత విజయమ్మ రోడ్‌షోగా కురుపాం చేరుకున్నారు. దారి పొడవునా గిరిజనులు ఎదురొచ్చి స్వాగతం పలికారు. విజయమ్మను చూసేందుకు పోటీ పడ్డారు.ఇక, కురుపాంలో విజయమ్మ చేసిన ప్రసంగం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.
ఉన్న ఊరిని మున్సిపాల్టీ చేయలేకపోయిన బాబూ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాడట
తాను 25ఏళ్లుగా తన ఊరి పేరుతో గల కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు చేసిందేమీలేదని విమర్శించారు.‘పంచాయతీ హోదాలో ఉన్న సొంత ఊరును మున్సిపాల్టీని చేయలేకపోయిన చంద్రబాబు ఇప్పుడేకంగా రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని నమ్మ బలుకుతున్నాడు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయనంత అవకాశవాది మరొకరు లేరు. ఎన్నికల ముందు ఎవరితోనైనా జతకడతాడు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసగిస్తాడు. ఎన్నికలవ్వగానే అందరి నెత్తిన చెయ్యి పెడతాడు’ అని ప్రసంగించగానే హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ‘రెండెకరాల చంద్రబాబు దేశమంతటా హెరిటేజ్‌లు ఎలా పెట్టేశాడో చెప్పాలి. 18స్కామ్‌లపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే తనకున్న లాబీయింగ్‌తో స్టే తెచ్చుకున్నాడు. జగన్‌ని, వైఎస్సార్‌ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదు. ఆయనకంత ధైర్యమంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి’ అని విజయమ్మ సవాల్ చేయగానే తరలిచ్చిన ప్రజానీకమంతా మద్దతిచ్చింది. ఇక, గుమ్మి డి గెడ్డ ప్రాజెక్టును జగన్ వచ్చాక పూర్తి చేద్దామని ప్రకటించగానే హర్షం వ్యక్తమయ్యింది. మొత్తానికి విజయమ్మ ప్రసంగం అదరహో అన్పించింది. అందర్నీ ఆకట్టుకుంది.
విజయమ్మ వెంట ఎన్నికల ప్రచారంలో అరకు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థులు కొత్తపల్లి గీత, బేబీనాయన, అసెంబ్లీ అభ్యర్థులు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, జమ్మాన ప్రసన్నకుమార్, పాముల పుష్ప శ్రీవాణి, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, జర్జాపు ఈశ్వరరావు, గొర్లె మధుసూధనరావు, జర్జాపు సూరిబాబు, మావుడి ప్రసాదనాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, పరీక్షిత్‌రాజు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, గులిపల్లి సుదర్శనరావు, మజ్జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.