
‘లెజెండ్’ సినిమాను నిలిపేయండి
అనంతపురం: నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ ఆదినారాయణ శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ సినిమా కథానాయకుడైన బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఓటర్లు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
లెజెండ్ సినిమా టీడీపీకి అనుకూలంగా ఉందని, అందులోని డైలాగులు, కథనం ఆ పార్టీకి ప్రచారం చేకూర్చేలా ఉన్నాయని వివరించారు. సీమాంధ్ర, తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. బాలకృష్ణ టీడీపీ అభ్యర్థి అని తమకు బీ-ఫాం అందాక ఈ ఫిర్యాదును పరిశీలిస్తామని చెప్పారు.