జన సునామీ
మనసంతా ఆప్యాయత గూడుకట్టుకున్న పలకరింపు... ఆ పలకరింపు విని పులకరించిపోయే అవ్వా, తాతలు, అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు...ఆ కర స్పర్శ కోసం కలవరించే అభిమాన జనతరంగం... ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకునే జనం మనసెరిగిన నేత వైఎస్ జగన్‌ను చూడగానే అందరి హృదయాలూ ఆనందంతో పరవశించాయి. వారి కళ్లల్లో మెరుపులు మెరిశాయి...
అందుకే నిప్పులు కక్కుతున్న ఎండలో సైతం వినుకొండ బస్టాండు సెంటర్ జనంతో నిండిపోయింది. శివయ్యస్థూపం సెంటరు నుంచి సభావేదిక దాకా ఇసుకేస్తే రాలని జనం...అభిమాన నేతకు అడుగడుగునా బ్రహ్మరథం...
రాత్రి చిలకలూరిపేటలోనూ అదే తీరు... సమయం మించిపోయినా హృదయాల్లో గూడు కట్టుకున్న అభిమానం వారిని కదలనివ్వలేదు. కళామందిర్ సెంటర్ కిక్కిరిసిపోయింది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు, జనప్రవాహం పొంగింది.. అభిమానం తొణికిసలాడింది.. ఎటు చూసినా జనసంద్రమే సాక్షాత్కరించింది.. జనప్రభంజనం వెల్లువెత్తింది.. రాజన్న బిడ్డ ముఖంలో చిరుమందహాసాన్ని చూసిన ప్రజానీకం ఉప్పొంగిపోయింది... వైఎస్సార్ జనభేరి కార్యక్రమంలో భాగంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జనభేరి కార్యక్రమానికి విచ్చేసిన జననేత వైఎస్ జగన్‌ను చూసి పల్లెప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు.
మండుటెండను లెక్కచేయని జనం.. తమ దార్శినికునిపై పూలజల్లు కురిపించి ఆప్యాయతానురాగాలను వ్యక్తపరచింది. వినుకొండ పట్టణంలోని మేడలు, మిద్దెలు, చెట్లు ఇలా అన్నింటిపై అభిమానులు కిక్కిరిసిపోయారు. జయహో.. జగనన్నా.... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నినాదాలతో వినుకొండ హోరెత్తింది.
మంగళవారం రాత్రి బస చేసిన బాలాజీ ఎస్టేట్స్ వద్ద నుంచి జగన్ జనభేరి ప్రచార రథం వినుకొండ పట్టణానికి బుధవారం ఉదయం 11 గంటలకు బయలుదేరింది. బాలాజీ ఎస్టేట్స్ నుంచి వినుకొండకు రోడ్‌షోగా బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ నన్నపనేని సుధ ఉన్నారు.
మార్గంమధ్యలో నిర్మల స్కూల్ వద్ద ఎండను సైతం లెక్కచేయకుండా ఎదురుచూస్తున్న మహిళలు, వృద్ధులు, చిన్నారులను చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకుసాగారు. అక్కడి నుంచి నారపురెడ్డిపల్లెలో ఉన్న బీఈడీ కళాశాల వద్ద భారీ సంఖ్యలో వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను చూసి ప్రచారరథం దిగి కిందకు వచ్చి ఆత్మీయంగా పలకరించారు.
విఠంరాజుపల్లి చేరుకున్న ప్రచార రథానికి అడ్డుతగిలిన అశేష జనవాహిని రాజన్న తనయుడిని కనులారా చూసి పులకరించిపోయింది. బసకేంద్రం నుంచి వినుకొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ప్రజాభిమానాన్ని కాదనలేక అనేక చోట్ల ప్రచార రథాన్ని ఆపుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ వినుకొండకు చేరుకునే సరికి సుమారు మూడు గంటల సమయం పట్టింది.
అశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ శివయ్యస్థూపం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ ప్రాంగణానికి మధ్యాహ్నానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలన లో రైతులను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రుణమాఫీ చేస్తానంటూ మీముందుకు వస్తున్నాడు.
ఇలాంటి వ్యక్తిని చొక్కపట్టుకుని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిని, వినుకొండ అసెంబ్లీ అభ్యర్థిని డాక్టర్ నన్నపనేని సుధను ఫ్యాను గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఈలలు, కేకలు, హర్షధ్వానాలతో ఫ్యాను గుర్తుకే మా ఓటంటూ ప్రజలంతా నినదిం చారు.
అక్కడి నుంచి రోడ్‌షోగా పట్టణ శివారువరకు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. విఠంరాజుపల్లి మీదుగా బాలాజీ ఎస్టేట్స్‌కు చేరుకున్న వైఎస్ జగన్ మధ్యాహ్న భోజనం విరామం అనంతరం శావల్యాపురం మండలం కనమర్లపూడి చేరిన వైఎస్ జగన్ రోడ్‌షోకు గ్రామప్రజలు సాదర స్వాగతం పలికారు.
అక్కడి నుంచి శావల్యాపురం వెళుతున్న వైఎస్ జగన్ రోడ్‌షో అక్కడక్కడ తన కోసం వేచి ఉన్న రైతులు, మహిళా కూలీలు, వృద్ధుల వద్ద ఆగుతూ వారిని పలకరిస్తూ శావల్యాపురం చేరుకున్నారు. గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు పూలవానతో తమ అభిమాననేతను ముంచెత్తారు.
అక్కడి నుంచి పొట్లూరు చేరుకున్న జగన్ ప్రచారరథానికి అడుగడుగునా ప్రజలు అడ్డుతగులుతూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అక్కడి నుంచి కృష్ణాపురం చేరుకునే సరికి యువకులు పెద్దఎత్తున ద్విచక్రవాహనాల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. ఘంటావారిపాలెం చేరుకున్న వైఎస్ జగన్‌కు అభిమానులు, మహిళలు బ్రహ్మరథం పట్టారు.
అక్కడి నుంచి బయలుదేరిన జగన్ ప్రచారరథం ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం, సంతమాగలూరు మండలం, వెల్లలచెరువు అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరుకుని ఆత్మీయ స్వాగతం పలికారు. సంతమాగలూరు అడ్డరోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్‌కు అశేష జనవాహిని నీరాజనాలు పలికింది.
అనంతరం నరసరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్‌కు నరసరావుపేట మండలం లక్ష్మీపురం వద్ద భారీసంఖ్యలో మహిళలు ఎదురేగి స్వాగతం పలికారు. యువకులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెట్లూరివారిపాలేనికి చేరుకున్న వైఎస్ జగన్‌ను పూలతో ముంచెత్తారు.
వేలాది మంది అభిమానులు, మహిళలు, వృద్ధులకు అభివాదాలు చేసుకుంటూ జగన్ కోటప్పకొండ వైపునకు ముందుకుసాగారు. కట్టుబడివారిపాలెం వద్దకు చేరుకున్న జగన్‌ను చూసేందుకు చిమ్మచీకట్లోనూ మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం బారులు తీరారు. యడవల్లి, పురుషోత్తపట్నం మీదుగా చిలకలూరిపేటకు చేరుకున్న వైఎస్ జగన్ ప్రచార రథానికి అశేష జనవాహిని ఎదురేగి అఖం డ స్వాగతం పలికారు.
పట్టణంలో రోడ్‌షో నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి బారులు తీరిన ప్రజానీకానికి అభివాదం చేసుకుం టూ బహిరంగసభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేచి ఉన్న వేలాది మంది జనం జగన్‌ను చూడగానే ఉప్పొంగిన ఉత్సాహం తో హర్షధ్వానాలు చేశారు. జగన్ ప్రసంగిస్తున్నంతసేపూ ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ అభిమానాన్ని చాటుకున్నారు.
నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌లను ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ కోరడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ రోడ్‌షోలో వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ దేవళ్ల రేవతి, ఆళ్ళ పేరిరెడ్డి, లతీఫ్‌రెడ్డి, గజ్జల నాగభూషణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు జనభేరి సాగేదిలా...
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపడుతున్న వైఎస్‌ఆర్ జనభేరి కార్యక్రమంలో భాగంగా గురువారం పొన్నూరు, గుంటూరులలో పర్యటించనున్నారని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం తెలిపారు. ఉదయం పది గంటలకు పొన్నూరు పట్టణంలోనూ, సాయంత్రం ఐదు గంటలకు గుంటూరు నగరంలోనూ జరిగే బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రసంగిస్తారని వివరించారు.