
రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ వరద ముద్రలు ప్రదర్శిస్తూ పులా గజరాజు సేవిస్తున్న తేజోమూర్తిగా శరన్నవరాత్రుల్లో ఆరోరోజున కనకదుర్గాదేవి భక్తులను మహాలక్ష్మీ అవతారంలో అనుగ్రహిస్తుంది. ఈ తల్లి సర్వమంగళకారిణి, సకల సౌభాగ్యప్రదాయిని, ఆనంద సంధాయిని. నిత్యం ప్రసన్నవదనంతో ఉంటుంది. అష్టలక్ష్ముల సమష్టిరూపంగా, సకల జీవకోటిలో, ప్రకృతిలో నిండి ఉన్న సకల లక్ష్మీస్వరూపంగా ఈమెను శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ‘యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ అని చండీసప్తశతి చెబుతోంది.
డోలాసురుడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం ఈ దేవత. శక్తిత్రయంలో ఈమె మధ్యలో ఉంటుంది. ఎరుపురంగు పూలతో అర్చించి, లక్ష్మీస్తోత్రం పారాయణ చేస్తే శీఘ్రఫలితాలు కలుగుతాయి. మహాలక్ష్మీ ప్రీతిగా పూర్ణాలు నివేదన చేయాలి. సువాసినులకు షోడశోపచారాలతో అర్చించి, శక్తికొద్దీ మంగళద్రవ్యాలు అందించాలి.
మంత్రం: ‘ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్షై్మ్య నమోనమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి
నైవేద్యం: పూర్ణాలు
ఫలితం: సకలైశ్వర్య సిద్ధి.