
సోల్ బెలో
రష్యా నుంచి కెనడాకు వలస వచ్చింది సోల్ బెలో కుటుంబం. సోల్ బెలో (1915–2005) కెనడాలోనే పుట్టాడు. దాదాపుగా మురికివాడల రౌడీలా పెరిగాడు. బెలో చిన్నతనంలోనే వాళ్ల కుటుంబం మళ్లీ అమెరికాకు వెళ్లింది. తన రచనల్లోని పాత్రలన్నీ ఒక ఉత్కృష్టస్థితిని పొందడానికి పరితపించేవిగా కనబడతాయని చెబుతారు, అది వెలివాడల పరిస్థితుల నుంచే కాదు వెలివాడల మానసిక సంకెళ్ల నుంచి కూడా. యూదు కుటుంబం కావడాన, ఇంట్లో, ముఖ్యంగా వాళ్లమ్మ నుంచి మతం గురించిన ఒత్తిడి ఎక్కువుండేది. కొడుకును రబ్బీని చేయాలని కూడా కోరుకుంది. కానీ ఊపిరిసలపని ఛాందసం భరించరానిదంటూ దానికి ఎదురు తిరిగాడు. చిన్న వయసులోనే రాయడం మీద ఆసక్తి కలిగింది. ‘అంకుల్ టామ్స్ క్యాబిన్’ చదివాక రచయిత కావాలనుకున్నాడు. ఇరవయ్యో శతాబ్దపు ప్రభావశీల నవలాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. 1976లో నోబెల్ పురస్కారం వరించింది. ది ఎడ్వెంచర్స్ ఆఫ్ ఆగి మార్చ్, హెండర్‌సన్ ద రెయిన్ కింగ్, హెర్జోగ్, మిస్టర్ శామ్లర్స్ ప్లానెట్, సీజ్ ద డే ఆయన నవలల్లో కొన్ని. మోస్బీస్ మెమొయిర్స్, హిమ్ విత్ హిజ్ ఫూట్ ఇన్ హిజ్ మౌత్ ఆయన కథా సంకలనాలు. విమర్శకుల స్పందనలను ఖాతరు చేసేవాడు కాదు. ఒక పిచ్చివాడు నీళ్లలోకి విసిరిన రాయిని పదిమంది వివేకవంతులు కూడా దొరికించుకోలేరన్న హీబ్రూ సామెతను ఉదహరించేవాడు. తన వ్యక్తిగత వివరాలకు రచయిత ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు నచ్చేది కాదు.
Comments
Please login to add a commentAdd a comment