డిసెంబర్ 31
డెడ్ లైన్
ఈయన్ని చూడండి. చేతిలో డబ్బుంది. ముఖంలో సంతోషం లేదు. పేరు ఆర్.కె.అగర్వాల్. ఉంటున్నది లక్ష్మీనగర్... న్యూ ఢిల్లీ. డిసెంబర్ 31 గుర్తొస్తేనే అగర్వాల్‌కు నిద్రపట్టడం లేదు. ఆ తేదీ లోపు పాత నోట్లను వదిలించుకోవాలని దేశమంతా తొందరపడుతుంటే అగర్వాల్ మాత్రం... ఆ తేదీ తర్వాత ఇక పాత నోట్లు కనిపించవు కదా అని (చెల్లవు కదా అని కాదు!) బెంగ పెట్టేసుకున్నారు! అగర్వాల్ దగ్గర ప్రస్తుతం లక్షన్నర రూపాయల విలువైన 500 నోట్లు, 1000 నోట్లు ఉన్నాయి. వాటిని చేజార్చుకోడానికి ఆయన ఇష్టంగా లేరు. అందుకే ఇంతవరకు వాటిని మార్చుకోవడానికి బ్యాంకుకు వెళ్లలేదు!
బ్రిటిష్ ఇండియా నాటి కరెన్సీ నోట్లు కూడా అగర్వాల్ దగ్గర ఉన్నాయి. బర్మా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసి ఇచ్చిన పది రూపాయల నోటు కూడా వాటిల్లో ఉంది. 1947 వరకు బర్మాకు ఆర్.బి.ఐ.యే బ్యాంకర్ కాబట్టి ఆ దేశానికి కావలసిన కరెన్సీని ముద్రించి పంపేది. ఇక అన్నిటిలోకి అగర్వాల్ గర్వంగా చూపించుకునేది.. ఆర్.బి.ఐ. గవర్నర్ బి.ఎన్.అడార్కర్ సంతకంతో ఉన్న 1970 నాటి 5 రూపాయల నోటు. అడార్కర్ 42 రోజులు మాత్రమే ఆర్.బి.ఐ.గవర్నర్‌గా ఉన్నారు. అందుకే అగర్వాల్‌కు అది అంత అపురూపం.
అగర్వాల్ వయసు 63 ఏళ్లు. గత 30 ఏళ్లుగా రకరకాల అరుదైన కరెన్సీని కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు. పోనీ ఈ వెయ్యీ, ఐదొందల నోట్లలో ఒకటీ రెండు నోట్లను దాచుకుని మిగతావాటిని మార్చుకోవచ్చు కదా! నిజమే కానీ, అసలు అంత అందమైన ఫైవ్ హండ్రెడ్, థౌంజడ్ రుపీ నోట్స్ రద్దు కావడమే ఆయనకు ఇష్టం లేదట. ‘‘చూస్తాను, ఇప్పటికైతే వాటిల్లో ఒక్క నోటును మార్చుకోవడానికైనా నాకు మనస్కరించడం లేదు’’ అంటున్నారు అగర్వాల్. ఇంకో వారంలో నోట్ల మార్పిడి డెడ్‌లైన్ ముగుస్తుంది. చూడాలి. ఆర్.బి.ఐ. నోటు విలువైనదో? నోటుతో అగర్వాల్ అనుబంధం విలువైనదో?