అఖిల్‌ను చూసి ఆశ్చర్యపోయా!
‘‘ఏం జరిగినా మన మంచికే అంటారు. ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా దసరాకే విడుదల చేసి ఉంటే.. తక్కువ థియేటర్లు దొరికి ఉండేవి. దీపావళికి వాయిదా పడటంవల్ల ఎక్కువ థియేటర్లు దొరికాయి. ఈ చిత్రం రషెస్ చూసినవాళ్లు ‘పెద్ద హిట్’ అంటున్నారు’’ అని వీవీ వినాయక్ అన్నారు. అక్కినేని అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మించిన
‘అఖిల్’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా వినాయక్‌తో జరిపిన ఇంటర్వ్యూ...
నాగార్జునతో చేయకుండా డెరైక్టగా అఖిల్‌తో సినిమా చేసేశారు.. ఎలా అనిపిస్తోంది?
వి.వి. వినాయక్: ఇప్పటివరకూ నాగార్జునగారితో సినిమా కుదరలేదు. అఖిల్‌తో అనుకోకుండా కుదిరింది. చిరంజీవిగారు, రాంచరణ్.. ఇలా రెండు తరాల హీరోలతో సినిమాలు చేశాను. మంచి కథ దొరికినప్పుడు తప్పకుండా నాగార్జునగారితో కూడా సినిమా చేస్తాను.
మీరేమో పక్కా మాస్ డెరైక్టర్.. అఖిల్ ఏమో ఫుల్ మోడ్రన్‌గా ఉంటాడు. ఇద్దరికీ ఎలా సింక్ అయ్యింది?
ఇది ఫుల్ మోడ్రన్ యాక్షన్ మూవీలా ఉంటుంది. వినాయక్ చాలా యూత్‌ఫుల్‌గా తీశాడని సినిమా చూసినవాళ్లు అంటారు.
అఖిల్ పరిచయ చిత్రం చేయడంపై ఒత్తిడి ఫీలయ్యారా?
ఒక స్టార్ హీరో కొడుకుని పరిచయం చేయడం అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. పైగా, నాగార్జునగారు ఓ వేడుకలో ‘నా కొడుకుని నీ చేతిలో పెట్టా’ అని చెప్పిన మాటలు నా బాధ్యతను మరింత పెంచాయి.
గ్రాఫిక్స్ కుదరనందుకే విడుదల వాయిదా వేశారు కదా.. అది ఎవరి నిర్ణయం?
అందరి నిర్ణయమే. ‘సినిమా మొత్తం బ్రహ్మాండంగా ఉంది కదా.. ఈ కొంచెం కూడా ఎందుకు వేరే విధంగా ఉండాలి’ అని నాగార్జునగారు కూడా అన్నారు. క్వాలిటీ బాగుండాలి కదా అని మళ్లీ గ్రాఫిక్స్ చేయించాం. రీ-షూట్స్ జరగలేదు.
ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని పెట్టిన ప్రెస్‌మీట్‌లో అఖిల్ పాల్గొనలేదు.. అప్పటివరకూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్న తను ఆ తర్వాత అలా లేకపోవడానికి కారణం?
దీన్ని ఓ పెద్ద ఇష్యూగా అందరూ అనుకుంటున్నారేమో. మాకైతే అస్సలు ఇది ఇష్యూ కానే కాదు. సినిమా విడుదల తేదీ ఖరారు కాగానే యాక్టివ్‌గా ఉండాలని అఖిల్ అనుకుని ఉంటాడు.
ఇంతకూ అఖిల్ నటన గురించి ఏం చెబుతారు?
అఖిల్ పూర్తిగా కొత్త స్టయిల్‌లో ఉంటాడు. కొన్ని మేనరిజమ్స్ నాగార్జునగారిలా ఉంటాయి. ఇంత బాగా డ్యాన్సులు, ఫైట్లు చేస్తున్నాడేంటి? అని ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్ కాంబినేషన్‌లో అఖిల్ బాగా చేశాడు. సెంటిమెంట్ కూడా అంతే బాగా చేశాడు. కచ్చితంగా తను పెద్ద స్టార్ అవుతాడు. ఇలా ఎందుకంటున్నానంటే.. ఇంట్రడక్షన్ సాంగ్‌కి ఫుడ్ తీసుకోకుండా మరీ ప్రాక్టీస్ చేశాడు. ఒకరోజు కళ్లు తిరిగి పడిపోయాడు కూడా. పని మీద అఖిల్‌కి ఉన్న శ్రద్ధ గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు.
మహేశ్‌బాబుతో ఛత్రపతి శివాజీ తీయాలనుకుంటున్నారట?
ఫలానా తరహా సినిమా అని ఇప్పుడే చెప్పను. వంద కోట్ల బడ్జెట్‌తో మహేశ్‌తో సినిమా తీయాలని ఉంది. కథ రెడీ అయ్యాక మొదలుపెడతాం.
చిరంజీవి 150వ సినిమాకి మీరే డెరైక్టర్ అట?
ఇంకా ఏం ఫైనలైజ్ కాలేదు.