అంతా మన మంచికే...
ఇస్లాం వెలుగు
ఒక్కోసారి అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతా దైవ నిర్ణయం. కాని అందులో శుభం ఉంటుంది. మంచైనా, చెడైనా దైవ నిర్ణయమని తలచడం విశ్వాసుల లక్షణం. పూర్వం యుద్ధరంగంలో ఒక రాజుకు చేతివేలు తెగిపోయింది. ఈ విషయం తెలిసి అందరూ వచ్చి పరామర్శించి వెళుతున్నారు. మంత్రి కూడా వచ్చి రాజుగార్ని పరామర్శించాడు. ‘మాషా అల్లాహ్... దేవుడు తాను తలచింది చేస్తాడు. అందులో శుభం ఉంటుంది. ఏది ఏమైనా అంతా మనమంచికే.’ అని ఊరడించాడు.
కానీ రాజుకు తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే మంత్రిని కొలువునుండి తొలగించమని ఆదేశించాడు. మంత్రి ‘మాషా అల్లాహ్... దైవం తాను తలిచింది చేస్తాడు. అందులోనే శుభం ఉంది.’ అంటూ ఇంటిముఖం పట్టాడు. ఇంతలో రాజ్యం నుండి కూడా బహిష్కరించమని మరోఆజ్ఞ జారీ అయింది. దీంతో మంత్రి రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడూ రాజు తన చేతిని చూసుకొని బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి వేటకు బయలుదేరాడు. అడవిలో ఓ అందమైన లేడి కనిపించింది.
దాన్ని పట్టుకోవాలని అశ్వాన్ని దౌడు తీయించాడు. ప్రాణభయంతో లేడి అడ్డదిడ్డంగా పరుగులు పెట్టసాగింది. రాజుకూడా అశ్వాన్ని దౌడుతీయిస్తున్నాడు. ఈ క్రమంలో వెంట ఉన్న రక్షణ దళం బాగా వెనుకబడి, రాజును సమీపించలేకపోయింది. కీకాకారణ్యంలో లేడి అదృశ్యమైపోయింది. బాగా అలసిపోయిన రాజు ఓ చెట్టుకింద మేనువాల్చాడు. నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చేసరికి అక్కడి పరిస్థితి అంతా చిత్రవిచిత్రంగా ఉంది. దేవతకు నరబలి ఏర్పాట్లు జరుగుతున్నాయక్కడ. అడవి మనుషులు పసుపు కుంకుమలు చల్లి, రకరకాల అలంకారాలతో రాజును బలిపీఠం ఎక్కించారు. తల తెగనరికేముందు నఖ శిఖ పర్యంతం పరిశీలించిన పూజారి అతణ్ణి బలివ్వడానికి తిరస్కరించాడు. ఏ లోపమూలేని బలినే దేవత స్వీకరిస్తుందని చెప్పడంతో వారు రాజును విడిచి పెట్టారు. రాజు రాజధానికి చేరుకున్నాడు.
’మాషా అల్లాహ్’ మర్మం తెలిసొచ్చిన రాజు వెంటనే మంత్రి ఎక్కడున్నా వెతికి సగౌరవంగా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. మంత్రి రాగానే నమస్కరించి, గుండెలకు హత్తుకుని, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ‘నా వేలు తెగినప్పుడు, నన్ను సహనం వహించమని, దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడని చెప్పారు. మీమాట నిజమైంది. కాని, నేను మిమ్మల్ని పదవిలోంచి తీసేసి దేశబహిష్కారం చేసినప్పుడు కూడా మీరు అదేమాట అన్నారు. కారణం ఏమిటి?’ అని ప్రశ్నించాడు.
‘‘రాజా! మీరు నన్ను పదవిలోంచి తొలగించకుండా, రాజ్యబహిష్కారం చేయకుండా ఉండి ఉంటే, నేను కూడా మీతోపాటు వచ్చి ఉండేవాడిని. మీ వెన్నంటే ఉండేవాడిని. వేలు తెగిన లోపం వల్ల మీకు విముక్తి లభించినా, ఏలోపమూ లేని నన్ను బలిపీఠం ఎక్కించి తెగనరికేవారు. ఆరోజు నన్ను పదవినుండి తొలగించడం వల్లనేకదా బతికి పోయాను. దేవుడుఏది చేసినా మనమంచికే చేస్తాడు. మాషా అల్లాహ్! అంటూ నవ్వాడు మంత్రి. ఈసారి ప్రేమగా కౌగిలించుకున్నాడు రాజు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్