అస్త్ర తంత్ర : ధైర్యంతో పాటు మీ దగ్గర ఇవీ ఉండాలి
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన మహిళలందరినీ వణికించింది. సాయంత్రం విధులు ముగించుకుని, ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ ఉద్యోగినిని... ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయాలని ట్రై చేశాడు. వారి నుంచి తప్పించుకునేందుకు సకల ప్రయత్నాలూ చేసిన ఆ అమ్మాయి, చివరకు తన దగ్గరున్న డియోడరెంట్‌ను వారి కళ్లలో స్ప్రే చేసి, ఆటోలోంచి దూకి తప్పించుకుంది. ఒకవేళ ఆ సమయంలో ఆ అమ్మాయికి అలా చేయాలన్న ఆలోచన రాకపోతే? అసలు ఆమె దగ్గర ఆ డియో స్ప్రేనే ఉండకపోతే? తలచుకుంటేనే భయమేస్తోంది కదూ!
కిడ్నాపులు, అత్యాచారాలు పెచ్చుమీరుతుండటంతో ఆడ వాళ్లు అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా ధైర్యంగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగినులు ఉదయం బైట అడుగు పెట్టినప్పట్నుంచి, సాయంత్రం ఇంటికి చేరేవరకూ బిక్కుబిక్కుమంటూనే ఉంటున్నారు. ఏవైపు నుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియక భీతిల్లుతున్నారు. అందుకే మహిళల సంరక్షణ కోసం కొన్ని ‘ఆయుధాలు’ తయారయ్యాయి. వాటి గురించి తెలుసుకోవడం, వాటిని సదా దగ్గరుంచుకోవడం ప్రతి మహిళకీ అత్యవసరం.
పెప్పర్ స్ప్రే: మిరియాల పొడిని కళ్లలో చల్లితే ఎలా ఉంటుంది? భగ్గుమంటుంది. కాసేపు ప్రపంచమంతా మసకబారిపోతుంది. పెప్పర్ స్ప్రేలను తయారుచేసిన ఉద్దేశం అదే. దీన్ని కళ్లలో చల్లితే అవతలి వ్యక్తికి కాసేపు ఏమీ కనిపించదు. అతడు తేరుకునేలోపు మీరు తప్పించుకోవచ్చు. చిన్నగా, చేతిలో పట్టుకునేందుకు వీలుగా ఉంటాయివి. కీచెయిన్స్ రూపంలో ఉన్నవయితే మరీ సౌకర్యంగా ఉంటాయి. అది స్ప్రే అని ఎవరూ కనిపెట్టరు.
వెల: రూ. 400 నుంచి మొదలు
చిల్లీ పెప్పర్ స్ప్రే: మిరియాల పొడికి గొడ్డుకారాన్ని కలిపిన ఎఫెక్టు ఉంటుంది దీనితో. ఒక్కదాన్ని చల్లితేనే కళ్లు కనిపించకపోతే, ఈ రెండిటినీ కలిపి కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది! దీనివల్ల సదరు వ్యక్తి మరికాస్త ఎక్కువ ఇబ్బంది పడతాడు. మీరు మరింత ఎక్కువ దూరం వెళ్లిపోయే చాన్స్ ఉంటుంది.
వెల: రూ. 300 నుంచి మొదలు
కాప్ అలెర్ట్ అలారం: కంప్యూటర్ మౌస్ కంటే చిన్నగా ఉంటుందీ అలారం. ఒంటరిగా వెళ్తున్నప్పుడు దీన్ని చేత్తోపట్టుకుని ఉండటం మంచిది. ఏమాత్రం ప్రమాద సూచికలు కనిపించినా, వెంటనే దాన్ని నొక్కాలి. అది ఎంత శబ్దం చేస్తుందంటే... కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కూడా స్పష్టంగా వినిపిస్తుంది. దాంతో ఎవరో ఒకరు సహాయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
వెల: రూ. 450. మోడల్‌ను బట్టి రేటు పెరుగుతుంది.
ఫోల్డింగ్ స్టిక్: చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఒక్కసారి విదిలించగానే బారెడు పొడవవుతుంది. దీనితో ఒక్క పోటు పొడిచారంటే, అవతలివారు అదిరిపోవడం ఖాయం. ఎందుకంటే ఇది చాలా బలంగా తాకడమే కాదు, సన్నని ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా చేతి మీదో కాలి మీదో దీనితో కొడితే, ఆ అవయవం కాసేపు మొద్దుబారి కదలనని మొరాయిస్తుంది. ఈలోపు మనం ఎస్కేప్ కావచ్చు.
వెల: దాదాపు 2,000/-
పెప్పర్ గన్స్: ఇది కూడా పెప్పర్ స్ప్రే లాంటిదే. కాకపోతే గన్ మోడల్ చేతిలో చక్కగా ఇముడుతుంది కాబట్టి స్ప్రే కంటే కాస్త ఈజీగా ఉంటుంది ఆపరేట్ చేయడం. పైగా అనుమానం రాగానే కాస్త దూరం నుంచే సూటిగా అవతలి వారి కంట్లోకి గురిచూసి వదలొచ్చు.
వెల: రూ. 500 నుంచి మొదలు
ఎలక్ట్రిక్ షాక్ ఫ్లాష్ లైట్: ఓ వ్యక్తి సడెన్‌గా అటాక్ చేయడానికి ట్రై చేశాడనుకోండి... వెంటనే చేతిలోని ఫ్లాష్‌లైటును నొక్కితే సరి. అందులోంచి వెలువడిన కాంతిపుంజం అతడి ఒంటిమీద పడగానే, అతడికి తీవ్రమైన ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. అంతే, అతడు కాసేపు కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తీసుకెళ్లేముందు పూర్తిగా చార్జింగ్ పెట్టడం మర్చిపోకూడదు.
వెల: రూ. 5 నుంచి 7 వేల మధ్యలో ఉంది.
పెన్ డిఫెండర్: చూడ్డానికి పెన్నులాగే ఉంటుంది. చక్కగా జేబుకో లేక షర్టుకో పెట్టుకుని వెళ్లిపోవచ్చు. ప్రమాదాన్ని పసిగట్టగానే దానికున్న క్యాప్ తీసి అవతలివారి కళ్లలోకి స్ప్రే చేస్తే చాలు, ఇక మీరెక్కడున్నారో కూడా అతడు చూడలేడు.
వెల: రూ. 5000 నుంచి మొదలు. మోడల్‌ను బట్టి రేటులో మార్పు ఉంటుంది.
స్విస్ నైఫ్: యుద్ధ సమయాల్లో ఖైదీలకు ఉపయోగపడేందుకు, ఒకవేళ ఎక్కడైనా చిక్కుకుపోతే వాళ్లకు పలురకాలుగా ఉపయోగపడేందుకు తయారు చేసిన ఆయుధం ఇది. బాటిల్ ఓపెనర్, స్క్రూ డ్రైవర్, కత్తెర, రెంచ్, రెండు మూడు రకాల చాకులు కలిపితే స్విస్ నైఫ్. వీటన్నిటితో ఒక్కసారి దాడిచేస్తే ఎవరైనా చిత్తయిపోవాల్సిందే.
వెల: రూ. 1000 నుంచి మొదలు
ఇవన్నీ డిపార్ట్‌మెంటల్ స్టోర్లలో లభిస్తున్నాయి. ఆన్‌లైన్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. పలు ఇ-కామర్స్ వెబ్‌సైట్లు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాయి. ఒకవేళ వెల ఎక్కువైనా గానీ వీటిని కొనడానికి వెనుకాడకపోవడం మంచిది. ఎందుకంటే... వాటికోసం ఖర్చు చేస్తే, అవి ఎన్నోసార్లు మనల్ని కాపాడుతాయి.