వికసించని బాల్యానికి  విహంగాల నైపుణ్యం! | Ambika Infant Center in Kurnool is the youngest child from childhood | Sakshi
Sakshi News home page

వికసించని బాల్యానికి  విహంగాల నైపుణ్యం!

Published Fri, Mar 1 2019 12:11 AM | Last Updated on Fri, Mar 1 2019 12:11 AM

Ambika Infant Center in Kurnool is the youngest child from childhood - Sakshi

అంబిక
శారీరంగా, మానసికంగా ఆరోగ్యవంతమైన పిల్లలు ఇంట్లో ఇద్దరికి మించి ఉన్నారంటే ఆ అల్లరి అంతా ఇంతా కాదు. అలాంటిది బుద్ధిమాంద్య, మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఉంటే.. వారిని చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు. పదిహేనేళ్ల వయస్సు వచ్చినా ఆకలేస్తే అన్నం తినాలనే ఆలోచన ఉండదు. అత్యవసరాలకు వెళ్లాలన్నా చెప్పడం రాదు. అలాంటి మనో, దేహ అసహాయతలను జయించడానికి అవసరమైన బాటలను చిన్నారుల బాల్యం నుంచే వేస్తోంది కర్నూలులోని అంబికా శిశు కేంద్రం. ఈ కేంద్రంలో  వైకల్యంతో మాటలు రాని పిల్లలకు ఫిజియోథెరపి, స్పీచ్‌ థెరపి లాంటి అత్యవసరమైన చికిత్సలతోపాటు అనునిత్యం పాఠాలు, ఆటలు, పాటలు నేర్పిస్తున్నారు. ఎటువంటి విరాళాలూ సేకరించకుండా, ఆర్థిక సహకారాలు పొందకుండా గత ఇరవై మూడేళ్లుగా ఉచిత సేవలు అందిస్తోంది అంబికా శిశు కేంద్రం.

కర్నూలు నగరంలోని ప్రకాష్‌ నగర్‌లో అంబికా శిశు కేంద్రం 1995లో ఆవిర్భవించింది. హేమ్‌చంద్‌ దేవ్‌చంద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ (హెచ్‌డీసీ ట్రస్ట్‌) ఆధ్వర్యంలో.. బహుళ వైకల్యాలు కలిగిన పిల్లలకు జీవన నైపుణ్యాలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కేవలం ఇద్దరితో ప్రారంభమైన ఈ కేంద్రంలో ప్రస్తుతం నూటఎనభై మంది సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవడం, వీలైనంత తక్కువగా ఇతరుల సేవలను ఉపయోగించుకోవడం నేర్పుతారు. అలాగే చేయగల, చేసుకోగల సాధారణ పనులు నేర్పుతారు. సమాజంలో ఎలా మసులుకోవాలి, షాపులకు వెళ్తే కావాల్సిన వస్తువులను ఎలా కొనుగోలు చేయాలి, పొదుపు, సురక్షిత జీవనం, ప్రమాదం ఉందనుకున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, తప్పిపోయినప్పుడు తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు సమీపంలో ఉన్న వాళ్లకు ఇచ్చి సమాచారం ఇవ్వమని చెప్పడం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు.

ముఖ్యంగా సమాజంలో అవహేళనకు గురి కాకుండా ఉండేలా సూచనలిస్తారు.హేమ్‌చంద్‌ దేవ్‌చంద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ 1968లో ఏర్పడింది. ప్రస్తుతం కాంతిలాల్‌ షా మేనేజింగ్‌ ట్రస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యాపారం రంగంలో రాణిస్తున్న కాంతిలాల్‌ షా సొదరులు సమాజ సేవా చేయాలన్న లక్ష్యంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 1971లో హెచ్‌డీసీటీ (సేuŠ‡ హాస్పిటల్‌) పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలందించేందుకు శ్రీకారం చుట్టారు. మెడికల్‌ క్యాంప్‌ల నిర్వహణ, ఉచిత మందులు, కంటి పరీక్షల క్యాంప్‌లు, ఉచిత కళ్ల అద్దాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో బుద్ధిమాంద్య, మానసిక, బహుళ వైకల్యం కలిగిన పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్ని చూపును తొలిగించేందుకు అంబికా శిశుకేంద్రం ఏర్పాటు చేశారు.

ప్రసుత్తం నాలుగు అంతస్తుల సొంత భవనంలో కేంద్రాన్ని నడుపుతూ సేవలందిస్తున్నారు. ప్రత్యేక వైద్యసేవలు, శిక్షణతో పాటు చదువు, స్వయం ఉపాధి పనులు వంటి ముఖ్య అంశాలతో అంబికా శిశుకేంద్రం పని చేస్తోంది. వివిధ వ్యాపారాలలో నిత్యం తీరిక లేకుండా ఉన్నా సేవా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ట్రస్టు వ్యవస్థాపకులు. అంబికా శిశు కేంద్రంలో అరవై రెండు మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉండగా వారి జీత భత్యాలు, శిక్షణ, కేంద్రం నిర్వాహణకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
ఎస్‌.పి. యూసుఫ్, సాక్షి, కర్నూలు 
ఫోటోలు: డి. హుసేన్‌

నాన్న ఇచ్చిన స్ఫూర్తి  
మా నాన్న హేమ్‌చంద్‌ దేవ్‌చంద్‌ 1943లో చెన్నై నుంచి కర్నూలుకు వచ్చారు. వంట నూనె తయారి, అమ్మకాలు చేపట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. క్రమంగా రైస్‌మిల్, దాల్‌మిల్, రిఫైనరీ, సబ్బుల ఫ్యాక్టరీలను నెలకొల్పాం. ‘మనకు అన్నం పెట్టే ఊరి ప్రజల కోసం చేతనైనంత చేయాలి’ అని నాన్న చెప్పేవారు. ఆ మాట ఇచ్చిన స్ఫూర్తితో అంబికా శిశు కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నాం. కేంద్రం నిర్వహణలో మా కోడలు, ఇతర కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, సహకారం ఉంది.
కాంతిలాల్‌ షా, మేనేజింగ్‌ ట్రస్ట్‌

డిగ్రీ చదువుతున్నా 
నాకు సెరిబ్రల్‌ పాల్సీ (మెదడుకు సంబంధించిన ఓ వ్యాధి) అని డాక్టర్లు నిర్ధారించారు. 1995లో నన్ను అంబికా శిశు కేంద్రంలో చేర్పించారు. అక్కడ శిక్షణ, చదువు నేర్చుకొని 2009లో టెన్త్‌ పూర్తి చేశా. ఇంటర్‌ చేసి ప్రస్తుతం అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నా. ఇక్కడ చేరిన వాళ్లకు కంప్యూటర్‌ చేర్పించేందుకు ఇక్కడే ట్రైనీ ఉద్యోగంలో చేరాను.

కిరణ్, సెరిబ్రల్‌ పాల్సీ విద్యార్థి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement