ఆండ్రాయిడ్ వన్ వచ్చేసింది! | Android one smartphone sales to hit 2 million in 2014 | Sakshi
Sakshi News home page

ఆండ్రాయిడ్ వన్ వచ్చేసింది!

Published Thu, Sep 18 2014 8:09 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

ఆండ్రాయిడ్ వన్ వచ్చేసింది! - Sakshi

ఆండ్రాయిడ్ వన్ వచ్చేసింది!

రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్... బోలెడు వినూత్న ఫీచర్లు..
 అయినా సరే... ఐటీ రంగం దిగ్గజం గూగుల్...
 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

 
ఎందుకు? ఏమిటి? ఎలా..?

సరిగ్గా రెండు రోజుల క్రితం మూడు భారతీయ కంపెనీలు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఆండ్రాయిడ్ వన్’తోపాటు ఈ మూడు కంపెనీలు వేర్వేరు పేర్లతో విడుదల చేసిన ఫోన్లన్నింటిలోనూ ఫీచర్లు అన్నీ ఒకటే! ఎందుకిలా? ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇతరుల కంటే ఎక్కువ ఫీచర్లు అందివ్వడం ద్వారా ఎక్కువ ఫోన్లు అమ్ముకోవాలని ఎవరైనా ఆలోచిస్తారు. దీనికి భిన్నంగా మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్ టెలికామ్ కంపెనీలు కొత్త స్మార్ట్‌ఫోన్ల విడుదల చేసేందుకు కారణం.. ఇంటర్నెట్ సెర్చింజిన్ గూగుల్!
 
సెర్చింజిన్‌ను నడపడంతోపాటు గూగుల్ అనేక ఇతర రంగాల్లోనూ పనిచేస్తోందని అందరికీ తెలుసు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌సిస్టమ్ కూడా వీటిల్లో ఒకటి. అప్పుడప్పుడూ కొత్త కొత్త పేర్లతో ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేయడం... వాటిని ఉపయోగించుకుని కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడం.. ఇదీ ఇప్పటివరకూ నడిచిన వ్యవహారం. అయితే ప్రపంచవ్యాప్తంగా... మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు, తన ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్‌లు అమ్మే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వాణిజ్యాని పెంచుకునే లక్ష్యంతో గూగుల్ తాజాగా చేస్తున్న ప్రయత్నం ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫార్మ్.
 
లేటెస్ట్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్...

ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లన్నింటిలోనూ లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకోలా చెప్పాలంటే అతితక్కువ ఖర్చుతో మెరుగైన ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కునేందుకు ఆండ్రాయిడ్ వన్ అవకాశం కల్పిస్తోంది. 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఒక జీబీ ర్యామ్, నాలుగు నుంచి 8 జీబీల మెమరీ, అయిదు మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెళ్ల సెల్ఫీ కెమెరా... 4.5 అంగుళాల స్క్రీన్. ఇవీ వన్ ప్లాట్‌ఫార్మ్‌లోని ప్రధాన ఫీచర్లు. కొద్దిపాటి తేడాలతో అన్నింట్లోనూ ఒకే రకమైన అప్లికేషన్లు ఇన్‌బిల్ట్‌గా వచ్చాయి. ధర కూడా రూ.6299 నుంచి రూ.6499 మధ్యలోనే ఉండటం గమనార్హం. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ వన్ కొన్నవారు సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మళ్లీ డబ్బు చెల్లించాల్సిన అసలు లేదంటోంది గూగుల్. భవిష్యత్తులో విడుదలయ్యే కొత్త ఓఎస్‌లన్నింటినీ ఈ ఫోన్లకు అందిస్తామని, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కూడా ఇస్తూంటామని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ ఓఎస్‌లో కొన్ని మార్పులు చేసి ఉపయోగించుకునే కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
 
500 కోట్ల మందికి స్మార్ట్‌ఫోన్లు లక్ష్యం
 
ప్రపంచ జనాభాలో స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య 200 కోట్లకు మించదని అంచనా. ఈ నేపథ్యంలో మిగిలిన 500 కోట్ల మంది చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు ఉంచడమే లక్ష్యంగా గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫార్మ్‌ను అభివృద్ధి చేసింది. వీరిలో వందకోట్ల మంది ఒక్క భారత్‌లోనే ఉన్నారని అంచనా. పైగా గత నాలుగేళ్లలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువైన నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌పై గూగుల్ కన్ను పడింది. స్మార్ట్‌ఫోన్లు తయారు చేయాలంటే అది ఆండ్రాయిడ్ వన్‌లా ఉండాలని ఎవరైనా అనుకునేలా చేయాలన్నది గూగుల్ లక్ష్యం. అందుకే వేర్వేరు కంపెనీల భాగస్వామ్యంతో ఒకే రకమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ల తయారీకి చొరవ చూపింది. తద్వారా మైక్రోసాఫ్ట్, బ్లాక్‌బెర్రీ, సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న శాంసంగ్‌కూ చెక్ పెట్టింది.
 
స్థానిక భాషలకు ప్రాముఖ్యత...

ఆండ్రాయిడ్ వన్‌లో ఉన్న మరో ప్రముఖమైన ఫీచర్ స్థానిక భాషలకు సపోర్ట్. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ ఫీచర్‌ను తమ ఫోన్లలో చేర్చినప్పటికీ ఆండ్రాయిడ్ వన్‌లో భాగం కావడం వల్ల దీని ప్రాధాన్యత పెరుగుతుంది. దాదాపు ఏడు భాషల్లో పనిచేయించుకోగల అవకాశం ఉండటం వల్ల ఆయా భాషల్లో కొత్త కొత్త అప్లికేషన్ల తయారీకి మార్గం సుగమం అవుతుందని గూగుల్ అంచనా. అంతేకాదు... త్వరలో గూగుల్ తన ‘న్యూస్‌స్టాండ్’ అప్లికేషన్‌ను కూడా స్మార్ట్‌ఫోన్లకు అందుబాటులోకి తేనుంది. స్థానిక పత్రికల డిజిటల్ ఎడిషన్లను వీటి ద్వారా చూసుకోవచ్చునన్నమాట. మొత్తంమ్మీద ఇంటర్నెట్‌లో గూగుల్ ద్వారా సృష్టించిన సంచలనాన్ని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోనూ పునరావృతం చేసేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నం ఫలిస్తే వినియోగదారులకు మరింత మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement