నాకు 55 ఏళ్లు. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జ్ అయ్యిందని ఏడాది క్రితం టీయూఆర్‌పీ అనే ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. ఈ ఆపరేషన్ వల్ల అంగస్తంభనలు తగ్గుతాయా? ముందు ముందు ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందా? పీఎస్‌ఏ పరీక్ష చేయించాలా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
- ఏ.కె.ఆర్., చెన్నై
టీయూఆర్‌పీ అంటే... ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. ఈ సర్జరీలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా పెరిగిన ప్రోస్టేట్‌ను తీసివేసి మూత్రం రావడానికి గల అడ్డును తొలగిస్తారు. ఇది 50 ఏళ్లు పైబడ్డ వాళ్లలో చాలా సాధారణంగా నిర్వహించే సర్జరీ. దీనికీ అంగస్తంభనలకు సంబంధం లేదు. అంతకుమునుపు ఉన్నట్లే సర్జరీ తర్వాత కూడా అంగస్తంభనలు ఉంటాయి. కాకపోతే 50 ఏళ్ల పైబడ్డవారిలో సాధారణంగా కనిపించే బీపీ, షుగర్ వంటి వాటి వల్లనో లేదా ఫిజికల్ ఫిట్‌నెస్ లేకపోవడం వల్లనో మీకు అంగస్తంభనలు తగ్గి ఉండవచ్చు.
సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వారు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్‌ఏ) పరీక్ష రెండేళ్లకు ఓసారి చేయించుకోవడం మంచిది. టీయూఆర్‌పీ సర్జరీ తర్వాత కూడా పీఎస్‌ఏ పరీక్ష తరచూ చేయించాలి. ఈ పరీక్ష చేయించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయమయ్యేలా చికిత్స తీసుకోడానికి అవకాశం ఉంది.
నా వయస్సు 25 ఏళ్లు. నా పురుషాంగం లోపల అంటే ముందుచర్మం వెనక్కిలాగితే బయటకు కనిపించే ప్రాంతంలో చిన్న చిన్న బుడిపెలు ఉన్నాయి. ఇవి రావడం ప్రమాదమా? చికిత్స అవసరమా? వివరించండి.
- సీ.ఆర్.ఆర్., విశాఖపట్నం
అంగం ముందు భాగం (గ్లాన్స్) మీద చిన్న చిన్న బుడిపెలు ఉండటం చాలా సాధారణం. ముఖం మీద మొటిమల్లాగే వీటిల్లోంచి కూడా స్రావాలు తయారవుతూ ఉంటాయి. కొందరికి చుట్టూరా తెల్లగా బుడిపెలు బుడిపెలుగా సాధారణంగా కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. గట్టిగా నొక్కితే తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇవన్నీ మామూలుగా ఉండేవే. చాలామంది వీటిని ఇన్ఫెక్షన్ అనుకుంటారు. నొప్పి, మంట, దురద లేకుంటే ఈ చిన్న బుడిపెల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్,
కె.పి.హెచ్.బి, హైదరాబాద్
యాండ్రాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jun 4 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM
Advertisement