నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకొని సెక్స్‌లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా?
- సీహెచ్.ఎమ్.ఆర్. విజయవాడ
సాధారణంగా ఎడమవైపున ఉండే వృషణం కుడివైపు కంటే కొంచెం కిందికే ఉంటుంది. ఇలా వృషణాలు సమానమైన లెవెల్‌లో లేకపోవడం సర్వసాధారణం. వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ, సెక్స్ సామర్థ్యానికి సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభన నార్మల్‌గా ఉంటే, వృషణాల్లో నొప్పి లేకపోతే నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. ఇది మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కానేకాదు.
నా వయస్సు 18 ఏళ్లు. నాకు గత నాలుగేళ్లుగా రొమ్ములు ఉన్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి.
- ఒక సోదరుడు, హైదరాబాద్
మీ సమస్యను గైనకోమేజియా అంటారు. కొన్ని సందర్భాల్లో హార్మోన్‌ల అసమతౌల్యం (హార్మోనల్ ఇంబ్యాలెన్స్)వల్ల ... అంటే ఈస్ట్రోజెన్, ప్రొలాక్టిన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ తక్కువైనప్పుడు ఇలా జరగవచ్చు. మీ రొమ్ము భాగం బయటకు కనిపించేంత పెద్దగా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల వచ్చిన లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా ఈ బ్రెస్ట్‌లోని ఫ్యాట్‌ను ఆపరేషన్ లేకుండా కూడా తొలగించుకోవచ్చు. కాకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చిందని తెలుసుకోడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో తెలుసుకొని, ఒకవేళ ఉంటే దాన్ని చక్కదిద్దడానికి ఓసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్
యాండ్రాలజీ కౌన్సెలింగ్
Published Wed, May 20 2015 11:35 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement