ఎలిజెబెత్ బెర్గ్
తాము తప్పు చేస్తున్నామేమో అన్న సంశయం తమ పెళ్ళి రోజునే జాన్, ఐరీన్‌లకు కలుగుతుంది. పెళ్ళి ముందటి రాత్రి, ఇంటి నుంచి పారిపోయేందుకు తనకు సహాయం చేయమని ఐరీన్ తన ఆప్తమిత్రురాలైన వాలెరీని అడుగుతుంది.
జాన్ ధైర్యం కోల్పోయి బార్‌లో కూర్చున్నప్పుడు, అతని స్నేహితుడు జాన్‌ను ఊరడించేందుకు, ‘ముందు ఐరీన్‌ను ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నావో గుర్తుకి తెచ్చుకో’ అంటాడు. సమాధానం తట్టని జాన్, ‘ఆమె మేక్ అప్ వేసుకోదు గనుక’ అన్న కుంటిసాకు చెప్తాడు. ఇన్ని అభ్యంతరాలతోనూ పెళ్ళి జరిగిపోతుంది. సేడీ పుడుతుంది.
దంపతులు ఆలస్యం చేయకుండా విడాకులు పుచ్చేసుకుంటారు. జాన్, తన స్వస్థలం అయిన మినిసోటాకి వెళ్ళిపోతాడు. ఐరీన్ కాలిఫోర్నియాలో ఉంటుంది. సేడీకి 18 ఏళ్ళు వచ్చిన తరువాత, చాలా మట్టుకు తల్లితో గడుపుతూ, సంవత్సరంలో నాలుగు సార్లు తండ్రి వద్దకి వెళ్తుంది, ‘వన్స్ అపాన్ అ టైమ్, దేర్ వస్ యు’ నవల్లో.
జాన్‌కు ‘సులభంగా సౌకర్యంగా ఉండే నిలకడైన సంబంధం, నాటకీయత లేని క్షణాలు’ ఇష్టం. ‘ఇతరులకి ఇచ్చేటందుకు నీ వద్ద ఎంతో ప్రేముంది. అయితే, నువ్వెప్పుడూ టొమాటో బుట్టలో ‘యాపిల్ పళ్ళెక్కడ?’ అంటూ వెతుక్కుంటావు’ అంటూ ఐరీన్ మీద వాలెరీ విసుక్కుంటుంది. ఐరీన్ ఆన్‌లైన్లో బోయ్‌ఫ్రెండ్స్ కోసం వెతుకుతూ, తన గురించి లేకి వివరాలు ఇస్తుంటుంది.
‘‘మనుష్యులు మూర్ఖులు. వారు రూపొందించబడిన విధానంలోనే ఒక అల్గోరిథమ్ ఉంది. ‘ప్రేమించు, ప్రేమించబడు’ అన్న సూత్రం పాటిస్తే సంతోషంగా ఉంటాం. ఇది సరళమైనదే కానీ అర్థం చేసుకోవడమే కష్టం’ అని వయస్సుకి మించిన పరిణితి చెందిన సేడీ, తల్లిదండ్రులకి చెప్తుంది.
అప్పటికల్లా, రచయిత్రి ఎలిజెబెత్ బెర్గ్– మాజీ దంపతుల నేపథ్యాలనూ, సంతోషం లోపించిన వారి బాల్యాలనూ పరిచయం చేస్తారు. విడాకుల తరువాత, ఇతర సంబంధాలు కల్పించుకునే వారి విఫల ప్రయత్నాలు కూడా పాఠకులకి తెలుస్తాయి.
వారాంతంలో బోయ్‌ఫ్రెండైన రోన్‌ను కలుసుకోవాలనుకున్న సేడీ, తన స్నేహితులతో వెళ్తున్నానని తల్లిదండ్రులకు అబద్ధం చెప్తుంది. కేవలం కూతుర్ని మాత్రమే ప్రేమించగల ఐరీన్, జాన్ పంతం పట్టడంతో, ‘సరే’నంటుంది. రోన్ గురించి ఇద్దరికీ తెలియదు. సేడీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి, ఐరీన్ మాజీ భర్తకు తెలియజేస్తుంది. తను మొదలుపెట్టబోతున్న కొత్త సంబంధాన్ని వదిలేసి, అతను వచ్చేస్తాడు. ఇద్దరూ కలుసుకున్న క్షణమే, వారి మధ్య ఉన్న పూర్వపు అపనమ్మకం, కోపం తలెత్తుతాయి. ఒకరినొకరు దెప్పుకోడానికి– గతంలో జరిగిన సంఘటనలనూ, సంభాషణలనూ వాదనలోకి తెచ్చి, పోట్లాడుకుంటారు.
సేడీ, రోన్ కోసం ఎదురు చూస్తుండగా, ఆమెని ఒక ఆగంతకుడు అపహరించి, వొక గుడిసెలో ఉంచుతాడు. రెండ్రోజుల తరువాత, రోన్ సహాయంతో పోలీసులు సేడీని కాపాడినప్పుడు, ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తల్లిదండ్రులకు ఫోన్ చేయకుండా, రోన్‌ను పిలుస్తుంది. పెళ్ళి చేసుకున్న తరువాతే ఇంటికి వెళ్దామని నిశ్చయించుకుంటారు ఇద్దరూ.
మొదట, కూతురు బతికే ఉందని ఊరట చెందిన ఐరీన్ తన తెలివైన కూతురు, ‘పెళ్ళి చేసుకునే మూర్ఖపు పని ఎందుకు చేస్తోందో!’ అని కోపం తెచ్చుకుంటుంది. ఆమె తిరిగి జాన్‌తో ఏకమవుతుందేమో అని ఆశించిన పాఠకులను నిరాశపరుస్తూ, వొంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది.
ముగ్గురి పాత్రలపైనా కేంద్రీకరించిన నవల హాస్యంగా ఉండి, ప్రేమకుండే శక్తి గురించి చెబుతుంది. తెగిన సంబంధాల మధ్య పిల్లల్ని పెంచడంలో కలిగే ఇబ్బందులను రచయిత్రి వాస్తవిక కోణంలో చూపుతారు. నవలని రాండమ్ హౌస్, 2011లో ప్రచురించింది.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment