ఆశ్రమంలో వశిష్ఠుడు, అరుంధతి శ్రీరామకల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పదిరోజులు ముందుగానే చలువ పందిళ్లు వేయించారు. కల్యాణానికి వచ్చేవారందరూ కమనీయంగా ఆ వేడుక చూడటం కోసం ఈత ఆకులు, తాటి ఆకుల చాపలు సిద్ధం చేశాడు. పానకం, వడపప్పుకు కావలసిన సంభారాలన్నీ దండిగా ఇచ్చింది కామధేనువు. అన్నీ సిద్ధమయ్యాయి. అరుంధతి వశిష్ఠులవారిని సమీపించి–‘‘స్వామీ! తెల్లవారితే శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుందనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ఆయన అడవుల పాలయ్యాడు కదా. ఆయన ఎంత స్థితప్రజ్ఞుడో కదా! నాకొక సందేహం స్వామీ! ఇన్ని వేల సంవత్సరాలుగా సీతారాముల కల్యాణం ఎందుకు జరిపిస్తున్నారు. రామావతారానికి ముందు, తరువాత కూడా అవతారాలున్నాయి కదా! ఈ రాముడికే ఎందుకు ఇంత వైభోగం. మీరు ఆయన కులపురోహితులు, రాముల వారిని దగ్గర నుంచి చూశారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన సుగుణాలు మీకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియవు! ఏ కారణంగా ఆయనకు నేటికీ కల్యాణం జరుపుతున్నారు.
రామరాజ్యం అనే పేరే ఎందుకు స్థిరపడిపోయింది. రామరాజ్యాన్ని అధిగమించే రాజ్యమే రాలేదా!’’ అని ప్రశ్నించింది అరుంధతి. వశిష్ఠుడు గంభీరంగా నవ్వుతూ, ‘‘అరుంధతీ! నా రాముడని నేను గొప్పలు చెప్పడం కాదు కానీ, దశరథ మహారాజుని మించినవాడు నా రాముడు. దశరథుడి పాలన కూడా అద్భుతంగానే సాగింది. కాని ఆయన ముగ్గురిని వివాహం చేసుకున్న కారణంగా, కన్నకొడుకుని అడవుల పాలు చేయవలసి వచ్చింది. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు కదా! ఆ విషయం పక్కన పెడితే –రామపట్టాభిషేకానికి ముందురోజు దశరథుడు రాముడిని పిలిచి, ‘నాయనా! ఈ కోసల రాజ్య ప్రముఖులందరూ రేపు ఉదయం నిన్ను పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. కనక పట్టాభిషిక్తుడు కావలసిన రాజనందనుడు ఏ నియమవ్రతాలు అనుసరించాలో గురువులు చెబుతారు. ఆ ప్రకారం ఈ రాత్రి గడుపు. ఉదయమే మంగళ స్నానానంతరం పట్టాభిషేకం చేస్తారు’ అని నా దగ్గరకు పంపాడు.
నేను నా రామునికి ధర్మశాస్త్రం వివరించి, సింహాసనం అధివసించేవాడు, రాత్రి ఉపవసించి, కటిక నేల మీద దర్భాసనం పరిచి పడుకోవాలి. తెల్లవారేవరకూ మౌనంగా ఉండాలి. రాజభోగాలు అనుభవించడానికి అన్ని అధికారాలూ లభించే క్షణంలో తిండి లేకుండా, రాతి నేల మీద పడుకుని, స్నేహితులతో, భార్యతో ముచ్చటలాడుకునే అవకాశం లేకుండా రాత్రి గడపాలి’ అని వివరించాను.‘‘దేని కోసం ఈ నియమం?’’ అని అమాయకంగా ప్రశ్నించింది అరుంధతి.రాజు కాబోయేవానికి తన ప్రజల ఆకలి బాధ తెలియాలి. దారిపక్కన చెట్టు నీడన కాపురం చేస్తూ బండ రాళ్ల మధ్య నిద్రించేవారి బాధ వంటబట్టాలి. రాజ్యం చేతికందనున్న సమయంలో ఆవేశం పెరిగి ‘అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అని వాగ్దానాలు చేయకూడదు, చెయ్యవలసిన లోక క్షేమంకర పథకాలను ఆలోచించుకుని, ఆచరణలో వచ్చే కష్టసుఖాలు తెలుసుకోవాలి.
అప్పుడు సింహాసనం ఎక్కినవాడు ప్రజల జీవితావసర కార్యాలు నిరాఘాటంగా నిర్వహించగలుగుతాడు, వారి బాధలను గ్రహించి పరిష్కారం చేయగలిగి, అందరి అభిమానాన్నీ పొందగలుగుతాడు’ అని వివరించాను అన్నాడు.‘‘మరి రాముడు మీ ఆదేశాలను ఆచరించాడా మహర్షీ!’’ అంది అరుంధతి.‘‘నా ఆదేశాలను పాటించి, రామభద్రుడు ఉపవాస నియమంతో, అధశ్శయనంతో, మౌనంగా ఆ రాత్రి గడిపాడు. అందుకే రాముడు ధర్మానికి ప్రతీక అయ్యాడు’’ అన్నాడు వశిష్ఠుడు.తండ్రి మాటలకు మారుమాటాడకుండా నా దగ్గరకు రావటమే కాదు, నేను చెప్పిన నియమాలను కూడా త్రికరణశుద్ధిగా అనుసరించాడు. ‘ఇలా ఎందుకు చేయాలి?’ అని ఎదురు ప్రశ్నించని సుగుణాభిరాముడు నా రాముడు.... అని కించిత్ గర్వంగా అన్నాడు వశిష్ఠుడు, తన శిష్యుడి వినయాన్ని మనసులోనే అభినందిస్తూ.
‘‘రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం కదా! ఆయనకు కూడా ఇన్ని నియమాలు విధించారా స్వామీ!’’ అన్నది అరుంధతి.‘‘మానవరూపంలో ప్రభవించాక పరమేశ్వరుడైనా, ఆదిగర్భేశ్వరి అయినా మానవ ధర్మాన్ని ఆచరించి ఆదర్శం చూపాలి’’ అన్నాడు కులగురువులు వశిష్ఠులు.‘‘ప్రజల కష్టం తెలుసుకోలేని వాడికి రాజు కాగల అర్హత లేదు. కష్టాలను స్వయంగా అనుభవించాలి. రాజుకి ఆకలి బాధ తెలియాలి, కటిక నేల మీద నిద్రించేవాడి బాధ తెలియాలి, బంధువులకు పదవులు కట్టబెట్టకూడదని తెలియాలి. అయినవారికి అనుకూలంగా ప్రవర్తించేవాడికి రాజు కాగల అర్హత లేదని తెలుసుకోవాలి. ఇవన్నీ నా రాముడికి నేను తెలియచెప్పాను. గురువునైన నా ఆజ్ఞను త్రికరణశుద్ధిగా అనుసరించిన నా రాముడు జగదభిరాముడు కాకుండా ఉండగలడా, ఆయన పరిపాలన రామరాజ్యం కాకుండా ఉంటుందా అరుంధతీ!’’ అన్నాడు వశిష్ఠుడు.ఈ దృష్టితో రామాయణం చదివి వివేకంతో వ్యవహరించేవారు అధికారంలో ఉంటే అశేషప్రజల జీవితం ప్రశాంతంగా సాగుతుందని రాముడి నడవడిక ద్వారా తెలియచెప్పాడు ఆదికవి వాల్మీకి.
– డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment