శిలా'జెమ్‌' | Aswatha Special Story on Fossils Collecting | Sakshi
Sakshi News home page

శిలా'జెమ్‌'

Published Wed, Jun 19 2019 11:55 AM | Last Updated on Wed, Jun 19 2019 11:55 AM

Aswatha Special Story on Fossils Collecting - Sakshi

గువ్వలాంటి ఈ  పాపాయి గవ్వలతో ఆడుకుని అక్కడితే ఆగిపోయి ఉంటే.. ఇప్పుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోయేది. గవ్వలాగ కనిపిస్తూనే గవ్వ కానిదేదో అశ్వత ఆకర్షించింది. అది శిలాజం అని చెప్పింది అమ్మ. అలాంటి శిలాజాల కోసం వెతకడం మొదలు పెట్టింది. శిలాజాల శోధన అంత సులువు కాదని అప్పట్లో అశ్వతకు తెలియదు. అలాగని వాటికోసం వెతకడం మాననూ లేదు.

ఐదేళ్ల వయసు నుంచి శిలాజాల సేకరణ మొదలు పెట్టింది, ఇప్పుడామె దగ్గర 79 శిలాజాలున్నాయి. ఇన్ని ప్రత్యేకమైన శిలాజాలను (ఫాజిల్స్‌) సేకరించడం  సీనియర్‌ సైంటిస్ట్‌లకు తప్ప మామూలు వాళ్లకు సాధ్యంకాదు. పన్నెండేళ్లకే ఇంతగా అధ్యయనం చేసిందంటే ఆమెను బాల మేధావిగా గుర్తించి తీరాల్సిందే అని ప్రశంసించారు చెన్నై, పెరియార్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రామ్‌కుమార్‌. ఇండియాలో అత్యంత చిన్న వయసు పేలియెంటాలజిస్ట్‌  (శిలాజ పరిశోధకురాలు) అశ్వత. 

సెలవొస్తే మ్యూజియానికే!
అశ్వతకు సముద్ర తీరాలే కాదు పుస్తకాలంటే కూడా అంతే ఇష్టం. చదవడం రానంత చిన్నప్పటి నుంచి కూడా ఎన్‌సైక్లోపీడియా పుస్తకాన్ని విపరీతంగా ఇష్టపడేది. పేజీలు తిప్పుతూ బొమ్మలు చూస్తూ చదివినట్లే ఫీలయ్యేది. ఓ పేజీలో ఫాజిల్‌ (శిలాజం) కనిపించింది. సముద్రానికెళ్లి వెతికితే బోలెడన్ని దొరుకుతాయని ఆ చిట్టి బాల్యానికి పెద్ద ఆశ. అశ్వత సరదా మీద నీళ్లు చల్లడం ఇష్టంలేని ఆమె తల్లి విజయరాణి ఆమెను ఎగ్మోర్‌లో ఉన్న మ్యూజియానికి తీసుకెళ్లింది. ఐదేళ్ల పాపాయిగా తొలిసారి అశ్వత ఆ మ్యూజియాన్ని చూసింది. తరవాత అదే మ్యూజియానికి ఎన్నిసార్లు వెళ్లిందో లెక్కే లేదు. స్కూలుకెళ్లినంత క్రమబద్ధంగా మ్యూజియానికి వెళ్లేది. స్కూలుకు సెలవు వస్తే వాళ్ల ఫ్యామిలీ వీకెండ్‌ టూర్‌ మ్యూజియానికి లేదా సముద్ర తీరానికి. పిక్‌నిక్‌ని ఎంజాయ్‌ చేసినంత ఆనందంగా మ్యూజియంలోని శిలాజాలను చూసేది. అశ్వత ఊరికే చూస్తుందనే మాత్రమే అనుకుంది విజయరాణి, ఆ చిన్న మెదడుతో పెద్ద అధ్యయనమే చేస్తోందని తెలియదు.

ఊహించని మలుపు
అశ్వత ఐదవ తరగతిలో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో తిరుచ్చి భారతీదాసన్‌ యూనివర్సిటీ మెరైన్‌సైన్స్‌ హెచ్‌ఓడీని కలవడం జరిగింది. అశ్వత అడుగుతున్న సందేహాలను వివరిస్తూనే ఆమె అప్పటికే శిలాజ అధ్యయనంలో తెలుసుకున్న సంగతులకు ఆశ్చర్యపోయారు ఆయన. ఎన్నో ఏళ్ల పరిశోధనతో తప్ప సాధ్యం కాని పరిజ్ఞానం ఇంత చిన్న వయసులో సాధ్యం చేసినందుకు ప్రశంసించారు. యూనివర్సిటీకి వచ్చి తనను కలిస్తే అశ్వతకు మరిన్ని విషయాలను వివరిస్తానని తన కార్డు ఇచ్చారు. కానీ తీరా అశ్వత వెళ్లేటప్పటికి ఆయన అక్కడ లేరు. నిరాశతో వెనక్కు రావాల్సిన సమయంలో అశ్వతను  ఆమె తల్లి విజయరాణి పెరియార్‌ యూనివర్సిటీకి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్‌ రామ్‌కుమార్‌కి తాను సేకరించిన ఫాజిల్స్‌ను చూపించిందా అమ్మాయి. వాటిని చూసిన రామ్‌కుమార్‌ ఏకంగా మూడు గంటల సేపు వాటి గురించి అశ్వతకు వివరించారు. మూడు గంటల్లో ఆయన చెప్పిన సమాచారాన్ని అంతే వేగంగా ఆకళింపు చేసుకుందామె. బాల మేధావి అని భుజం తట్టి, అశ్వతకు ఓ ప్రాజెక్టు ఇచ్చారాయన. కావేరీ నది తీరాన అరియలూర్‌ దగ్గర విస్తరించిన నేల శిలాజ అధ్యయన క్షేత్రం. అక్కడ పరిశోధన చేయమని రూట్‌ మ్యాప్‌ ఇచ్చి పంపించారాయన. అలా ఫాజిల్‌ సేకరణను ముమ్మరం చేసింది అశ్వత. వాటి గురించి ఆమె అప్పటికే చదివి ఉండడంతో ఎగ్మోర్‌ మ్యూజియంలో లేని నమూనాలను మాత్రమే కలెక్ట్‌ చేసింది. ఇప్పుడు అశ్వత ఇల్లు ఓ మినీ మ్యూజియాన్ని తలపిస్తోంది. అది కూడా ఎగ్మోర్‌లో ఉన్న మ్యూజియానికి ఎక్స్‌టెన్షన్‌గా అన్నమాట!

కూతురి కోసం
ఎన్ని సర్దుబాట్లు చేసుకుని అయినా సరే, ఆమె కోసం పేరెంట్స్‌లో ఎవరో ఒకరు ప్రయాణిస్తూనే ఉన్నారు. శిలాజ క్షేత్రాలు ఎంత దూరంలో ఉన్నా అక్కడికి అశ్వతను తీసుకెళ్లడం, ఎప్పుడు, ఎక్కడ సెమినార్‌లు జరుగుతుంటే వాటికి హాజరు కావడానికి ఆమెకు తోడుగా వెళ్లడం కోసం ఒకరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. అదే మాట అడిగినప్పుడు ‘మా అమ్మాయి కోసం మేము కాకపోతే మరెవరు చేస్తారు’ అంటారు నవ్వుతూ.

చెప్పడమూ ఇష్టమే
అశ్వతకు ఫాజిల్స్‌ను సేకరించడంతోపాటు వాటి గురించి తన తోటి పిల్లలకు చెప్పడం కూడా అంతే ఇష్టం. స్కూలు హెడ్‌ మాస్టర్‌లకు ఉత్తరాలు రాసి అనుమతి తీసుకుంది. మొదట్లో ఆమె ఉత్సాహం చూసి ‘చిన్న పిల్లను నిరాశ పరచడం ఎందుకు, ఓ గంట టైమ్‌ ఇద్దాం’ అని మాత్రమే అనుమతినిచ్చారు. ఇప్పుడు స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు పేలియెంటాలజీ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఆమెను సెమినార్‌లకు ఆహ్వానిస్తున్నాయి. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా వినే వారిలో డాక్టరేట్‌లు సాధించిన సీనియర్‌ సైంటిస్టులు కూడా ఉంటున్నారు. అశ్వత చదువులో కూడా బ్రిలియెంట్‌ స్టూడెంటే. సైన్స్, మ్యాథ్‌ ఒలింపియాడ్‌లలో అవార్డులందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ కార్యక్రమంలో ఆమె రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ చేతుల మీదుగా యంగెస్ట్‌ పేలియెంటాలజిస్ట్‌ అవార్డు అందుకుంది.
ఒక శిలాజం ఒక చరిత్ర పుస్తకంతో సమానం. వందల వేల ఏళ్ల నాడు భూమి మీద సంచరించిన స్థితిగతులను వివరిస్తుంది. ఈ రంగంలో అధ్యయనానికి మన దేశంలో ఇన్‌స్టిట్యూషన్‌లు ఉన్నాయి, కానీ ఆదరణ అంతగా లేదు. ఆసక్తి ఉన్నవాళ్లు ఇతర దేశాలకు వలస వెళ్లేది ఇలాంటి పరిస్థితిలోనే. అందుకే మన మేధను మనదేశ నిర్మాణానికి ఉపయోగించుకునే అవకాశాలు కల్పించాలి. అప్పుడే మన అశ్వతలు మనదేశంలోనే ఉంటారు. ఈ అమ్మాయి పెద్దయ్యేలోపు మన దగ్గర పేలియెంటాలజీ రీసెర్చ్‌ మరింత పటిష్టంగా విస్తరించాలని కోరుకుందాం.– మంజీర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement