కుళత్తుపుళై బాలకనే శరణం అయ్యప్పాఅరియన్ కావు అయ్యనే శరణం అయ్యప్పాఅచ్చెన్ కావు అరశనే శరణం అయ్యప్పాశబరిమలై అయ్యనే శరణం అయ్యప్పాకాంతి మలై జ్యోతినే శరణం అయ్యప్పా
అని భక్తులు శరణుఘోషలో స్వామిని స్తుతిస్తుంటారు. చిత్రం ఏమిటంటే, చాలామంది భక్తులకు శబరిమల తప్ప ఈ జాబితాలోని మిగిలిన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాస్తవానికి ఇవన్నీ శబరికి దగ్గరలోనే అటవీ ప్రాంతంలో ఉంటాయి. పైగా ఈ అయిదు ఆలయాలు కూడా స్వయంగా పరశురామ ప్రతిష్టిత ఆలయాలే. వీటిని కూడా శబరిమలై ఆలయం పరిపాలన బాధ్యతలు చూస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం వారే పర్యవేక్షిస్తూ ఉంటారు.
1. కుళత్తుపుళై
ఇక్కడ అయ్యప్పస్వామి బాలకుని రూపంలో దర్శనం ఇస్తారు. కుళత్తు పుళై అన్నది కేరళలోని కొల్లమ్ జిల్లా పత్తనాపురమ్ తాలూకాలో ఒక చిన్న గ్రామం. కొల్లమ్ – షెన్ కొట్టయ్ జాతీయ రహదారికి చేరువలో కనిపిస్తుంది. తిరువనంతపురంకు, కొల్లమ్‌కు దగ్గరగా కనిపిస్తుంది. కుళత్తు నదికి ఆనుకొని గ్రామం ఉన్నందున ఈ పేరు వచ్చింది. నదికి అవతల వైపున గుడి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప బాలుని రూపంలో దర్శనం ఇస్తారు. ఉదయం సాయంత్రం అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఇదే మందిరంలో శివుడు, యక్షి, విష్ణుమూర్తి, గణపతి, భూతనాథన్, నగర్, కరుప్ప స్వామి వంటి దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ కొలనులో చేపలకు ఆహారం వేసే సేవకు మీనొత్తుసేవ అని పేరు. చర్మరోగాలతో బాధపడేవారు ఈ సేవ చేయించుకుంటారు.
2. అరియన్ కావు
ఇది కేరళ తమిళనాడు సరిహద్దుల్లో నెలకొని ఉన్న గుడి.. కేరళ లోని కొల్లమ్ జిల్లా పథనాపురమ్ తాలూకాలోని అరియన్ కావు గ్రామం ఉంది. గుడి ఉన్న ప్రాంతం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. ప్రతీచోట అయ్యప్పస్వామి చిన్ముద్రతో కూర్చొని కనిపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏనుగు మీద కూర్చొన్న భంగిమలో దర్శనం ఇస్తారు. కుడి కాలు కిందకు ఉంటే, ఎడమ కాలు మడిచి ఉంచుతారు. ఇక్కడ కూడా శబరిమలై మాదిరిగా పదునెట్టాంపడి ఉంటుంది. ఆలయంలో స్వామికి ఎడమవైపున అమ్మవారు, కుడివైపు పరమేశ్వరుడు దర్శనం ఇస్తుంటారు. ఆలయానికి వెలుపల నాగరాజు విగ్రహాలు, పుట్ట కనిపిస్తాయి. పాండియన్ ముడి, త్రిక్కళ్యాణమ్, కుంభాభిషేకం ప్రత్యేక ఉత్సవాలు.
3. అచ్చెన్ కోవిల్
శబరిమలైకు వెనుకగా దట్టమైన అడవుల్లో నెలకొని ఉన్న ప్రాంతంగా అచ్చెన్ కోవిల్. సాధారణంగా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అవతారం అని మన అందరికీ తెలుసు. అయితే అచ్చెన్ కోవిల్‌లో మాత్రం పూర్ణ, పుష్కల అనే ఇద్దరు భార్యలతో స్వామి దర్శనం ఇస్తారు. మహా వైద్యన్ రూపంలో అయ్యప్పను కొలవటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ పూజాదికాలన్నీ తమిళ సాంప్రదాయంలో నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామి విగ్రహం రుద్రాక్షశిలతో చేసినదిగా చెబుతారు. అయ్యప్పతోపాటు మాళికాపురత్తమ్మ, దుర్గ, నాగరాజా, గణపతి, మురుగ, కరుప్పస్వామి, కరుప్పయి అమ్మ, చెప్పని ముదరన్, చెప్పని మాదన్, మాదన్ తేవన్ వంటి దేవతామూర్తులు కనిపిస్తారు. వెనుకభాగంలోని నాగప్రతిష్ట దర్శించతగినది.
4. శబరి మలై
శబరి మలై గురించి భక్తులు అందరికీ తెలుసు. ప్రధానమైన అయ్యప్ప ఆలయంతోపాటు ఉండే ఉప ఆలయాల గురించి మాత్రం చాలా మందికి తెలియక పోవచ్చు. మహిమాన్వితమైన మూర్తిగా అయ్యప్ప భక్తుల్ని అనుగ్రహిస్తుంటారు. తండ్రి రాజశేఖరునికి ఇచ్చిన వరం మేరకు ఇక్కడ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో స్వామి విగ్రహాన్ని మకర సంక్రాంతి రోజున ప్రతిష్టించారట. అందుకే ఆలయంలో సంక్రాంతి పర్వదినాన అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి రోజున తిరువాభరణాల్ని స్వామికి అలంకరించి పూజలు చేయిస్తారు. అందుకే శబరిమలైలో సంక్రాంతికి అంతటి ప్రత్యేకత.
ఇక శబరిమలై గుడిమీదనే అయ్యప్ప గుడికి ఆనుకొని కన్నెమూల గణపతి గుడి కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి కుడివైపున ఉండే ఈ ఆలయం ఎదుట కూడా ఇరుముడిని చూపించటం ఆనవాయితీ. ఇక్కడ జరిగే గణపతి హోమం విశేషమైనది గా చెప్పుకోవచ్చు. అలాగే నాగ రాజీవ గుడి కూడా ప్రశస్తమైనది. అయ్యప్పకు చిన్నన్నయ్య హోదాలో పూజలు అందుకొంటారు. దీంతో పాటు ప్రధానమైన ఆలయం మాళికాపురత్తమ్మ. అయ్యప్ప స్వామి మీద మనస్సు పడ్డ లీలావతి ఈ రూపంలో కొలువై ఉందని చెబుతారు. ఆది పరాశక్తి అంశలో దర్శనం ఇస్తుంది.
5. కాంతిమలై
అయిదు ఆలయాల్లో ఈ కాంతిమలై విశిష్టమైనది. మిగిలిన నాలుగు ఆలయాలకు భక్తులంతా చేరుకొనే వీలు ఉంది. కానీ కాంతిమలైకు మాత్రం భక్తులు వెళ్లటం సాధ్యం కాదు. శబరిమలైకు ఎదురుగా ఉండే కొండనే కాంతిమలైగా పిలుస్తుంటారు. ఇక్కడకు సమీపంలోని పొన్నంబల మేడు నుంచి మకర సంక్రాంతి రోజున సాయంత్రం సమయంలో జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనం ఇస్తారని భక్తుల నమ్మకం. అందుచేత దూరంనుంచే కాంతి రూపంలో అయ్యప్పను దర్శించుకొని వెనక్కి మళ్లుతారు. పరమత సహనానికి శబరిమలై పెట్టిందిపేరు. అయ్యప్ప క్రీస్తుశకం వెయ్యివ సంవత్సరాల కాలంలో నడయాడినట్లు చెబుతారు. అప్పటికే కేరళలో ముస్లిం కుటుంబాలు స్థిరపడి ఉన్నాయి. అందులో వావర్ అనే ముస్లిం యువకునితో అయ్యప్పన్‌కు స్నేహం కుదిరింది.
వావర్ స్వామియే, వావరిన్ తోళరే అని శరణు ఘోషలో భక్తులు పఠిస్తూ ఉంటారు. ఈ వావర్‌కు గుర్తుగా శబరిమలై కొండమీద వావరన్ నాడా (కోవెల) కనిపిస్తూ ఉంటుంది. మాళికపురత్తమ్మ ఆలయానికి సమీపంలో ఇప్పటికీ మనం చూడవచ్చు. అలాగే ఎరుమేలికి వెళ్లినప్పుడు అక్కడ వావర్ స్వామి మసీదు కనిపిస్తుంది. భక్తులందరూ వావర్ స్వామి ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. మలయాళ సాహిత్యం ప్రకారం అయ్యప్ప స్వామి అర్యన్ కేరళ వర్మ (రాజుల పేరు) తో పందళ రాజ్యంలో పెరిగారని చెబుతారు. మణిమాల ఉన్నందున మణికంఠుడిగా పిలుచుకొనేవారు. మహిషిని అంతం చేసేందుకు వచ్చినందున ఆ ప్రక్రియ ముగిశాక అయ్పప్ప అవతారం చాలించారని చెబుతారు.
ఇందులో భాగంగా ఇప్పుడు శబరికొండపై ఉన్న మణి మండపం ప్రాంతంలో స్వామి తపస్సు చేసుకొన్నారని, స్వామికి సన్నిహితులైన వారంతా అక్కడకు చేరుకొన్న తర్వాత అయ్యప్ప స్వామి అకస్మాతుగా మకర సంక్రాంతి రోజు సాయంత్రం అదృశ్యం అయ్యారట. అదే సమయాన పొన్నంబల మేడ్ సమీపంలో ఒక దివ్యకాంతి జ్యోతిరూపంలో దర్శనం ఇచ్చిందట. అంతటితో అయ్యప్ప అవతారం పూర్తయిందని నమ్మిన భక్తులు.. శబరిమలైలో సంక్రాంతి రోజున పూజాదికాలు విశేషంగా జరిపిస్తుంటారు. ప్రతి ఏటా జ్యోతి దర్శన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అదే అయ్యప్ప గుడికి, మకర సంక్రాంతికి ఉన్న అనుబంధం. ఈ మకర సంకాంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో అందరికీ అన్ని శుభాలూ చేకూరాలని కోరుకుందాం.
– రమా విశ్వనాథన్
Comments
Please login to add a commentAdd a comment