పీడియాట్రీ కౌన్సెలింగ్
మా బాబుకు ఐదేళ్లు. వాడికి మాటిమాటికీ జ్వరం వస్తూ మళ్లీ అదే తగ్గిపోతూ ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని మందులు, సిరప్ ఇచ్చారు. వాడినా ఏం లాభం లేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి పదేపదే జ్వరం రావడం నాకు ఆందోళన కలిగిస్తోంది. మా బాబు విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి.
- సౌజన్య, విజయనగరం
రోజూ ఆడుకునే సమయంలోనూ, ఇతర సమయాల్లోనూ పిల్లలు నిత్యం అనేక సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్‌పోజ్ అవుతుంటారు. దాంతో ఇలా తరచూ జ్వరం వస్తుండటం మామూలే. మరీ ముఖ్యంగా సీజన్స్ మారినప్పుడు ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా రావచ్చు. దాంతో జ్వరాలూ వస్తుంటాయి. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని... కొన్ని తీవ్రమైన సమస్యల వరకూ జ్వరం అన్నది ఒక లక్షణంగా కనిపించవచ్చు. మీరు రాసిన ఈ కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు పదే పదే జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షలు, దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేసే కొన్ని పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు - మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్‌ఎస్‌ఏఐడీ వంటివి వాడటం చాలా హానికరం. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్