పాపకు పదేపదే దద్దుర్లు..! | Baby rash repeatedly ..! | Sakshi
Sakshi News home page

పాపకు పదేపదే దద్దుర్లు..!

Published Tue, May 24 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

పాపకు పదేపదే దద్దుర్లు..!

పాపకు పదేపదే దద్దుర్లు..!

పీడియాట్రిక్ కౌన్సెలింగ్

 

మా పాప వయసు ఐదేళ్లు. ఇటీవల మూడు నాలుగు సార్లు ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మా పాపకు ఇలా జరగడానికి కారణం ఏమిటి? మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి.  - నాగరాణి, గుంటూరు
మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్యలో చర్మం పైభాగం (సూపర్‌ఫీషియల్ డర్మిస్) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేక చోట్ల కనిపించవచ్చు. ఆర్టికేరియాలో అక్యూట్ అని, క్రానిక్ అని రెండు రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్ అర్టికేరియా అని చెప్పవచ్చు.

 
ఆర్టికేరియాకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (అంటే... గుడ్డు, గోధుమ, పల్లీలు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (అంటే... తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు (అంటే బ్యాక్టీరియల్ లేదా వైరల్); కాంటాక్ట్ అలర్జీలు (అంటే లేటెక్స్/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల...అక్యూట్ అర్టికేరియా రావచ్చు. వీటితో పాటు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, కడుపులో నులిపురుగులు, సింథటిక్ దుస్తులు వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. ఇక దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్ అర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం.  కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి వాతావరణం వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) అర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.

 
పైన పేర్కొన్న అంశాలలో ఏది కారణమో గుర్తించి, మీ పాపను ఆ అంశాల నుంచి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్2 బ్లాకర్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యూనో మాడ్యులేషన్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు.  పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ పాపకు యాంటీహిస్టమైన్స్‌లో  హైడ్రాక్సిజీన్, సిట్రజీన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదే పదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యూనలాజికల్ పరీక్షలు కూడా చేయించాలి. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.

 

డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,  హైదరాబాద్

 

హోమియో కౌన్సెలింగ్

 

మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. ఈమధ్య తలలో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? - శంకుతల, మిర్యాలగూడ
మామూలుగా అందరూ పేనుకొరుకుడు అని వ్యవహరించే ఈ సమస్యను వైద్య పరిభాషలో అలోపేషియా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి నున్నగా అవుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తి కోల్పోయినప్పుడు తలపై ఉండే జుట్టు రాలిపోతుంటుంది. వెంట్రుకలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారై నిర్ణీత ప్రదేశంలో వెంట్రుకలు లేకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. ఆడ, మగ అనే తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఈ సమస్య కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 20 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగానీ... ఇలా ఎక్కడైనా కనిపించవచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా అలోపేషియా తలపై ఒకటి రెండు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి.

 
కారణాలు :  మానసిక ఆందోళన  థైరాయిడ్, డయాబెటిస్ బీపీ వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది  వంశపారంపర్యం  కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ.


లక్షణాలు :  తలపై ఎక్కువ మొత్తంలో జుట్టు ఊడిపోతుంది  తలపై అక్కడక్కడ గుండ్రంగా జుట్టు ఊడిపోతూ బట్టతల ఏర్పడుతుంది.  తలలో అక్కడక్కడా అతుకుల్లాగా మచ్చల్లాగా ఏర్పడతాయి  సాధారణంగా మచ్చలా ఉండే జుట్టు ఊడిపోయే ప్రదేశాలు గుండ్రగా లేదా అండాకృతితో ఉంటాయి.

 
హోమియో చికిత్స: పేనుకొరుకుడుకు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సమస్య లక్షణాలను, కారణాలను పరిగణనలోకి తీసుకొని మంచి మందులను వైద్యులు సూచిస్తారు. దీనికి యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, నేట్రమ్ మ్యూరియాటికమ్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలినియమ్, సోరినమ్, తూజా మొదలైన మందులను నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

 

డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్


స్కిన్ క్యాన్సర్ కౌన్సెలింగ్

 

నా వయసు 36 ఏళ్లు. నా వృత్తిరీత్యా రోజూ బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నా చర్మం నల్లబడటంతో పాటు కొన్నాళ్ల నుంచి నా ఒంటిపై తీవ్రమైన దద్దుర్లు, ఎర్రటి గడ్డల్లా వచ్చాయి. స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి కొన్ని మందులు వాడినా తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈసారి ఆయన కొన్ని పరీక్షలు చేసి ‘చర్మక్యాన్సర్’ ఏమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. నా ఒంటిమీద ఏర్పడ్డ పుండ్ల నమూనాను బయాప్సీకి పంపించారు. క్యాన్సర్‌కు మందులేదంటారు కదా. నాకు ఏదైనా జరిగితే నా కుటుంబం ఏమైపోతుందోనని ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - స్వరూప్, హైదరాబాద్
శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మం. ఇది ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతుంది. వాతావరణంలో ఏర్పడే మార్పుల నుంచి రక్షిస్తుంది. అలాగే స్పర్శను తెలియజేస్తుంది. ఇలా మనకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే మన చర్మాన్ని మనం శ్రద్ధగా చూసుకోము. ప్రకృతి మన శరీరానికి ‘మెలనిన్’ అనే రంగు పదార్థాన్ని ఇచ్చింది. ఇక మీరు మీ వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారని తెలిపారు. ఈసారి ఎప్పుడూ లేనంతగా ఎండలు చాలా తీవ్రంగా ఉండటంతో పాటు మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన, ప్రమాదకరమైన సూర్యుడి ‘అల్ట్రా వయొలెట్ రేడియేషన్’ బారిన పడి ఉంటారని అనిపిస్తోంది. దానివల్లనే మీ శరీరంపై ఇలాంటి మార్పులు చోటు చేసుకుని ఉంటాయి. చర్మంపై ఏర్పడిన దద్దుర్లు, గడ్డలు, వాటి సైజు, రంగు, రక్తం కావడం లాంటి లక్షణాలను బట్టి పరీక్షలు ఉంటాయి. ఒకవేళ మీకు బయాప్సీలో చర్మం సంబంధిత క్యాన్సర్ ఉన్నట్లు తెలిసినా అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ సమస్య కాస్త తీవ్రమైనదే అయినా ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన వైద్య ప్రక్రియలతో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మీకు మంచి చికిత్సను అందించవచ్చు. సర్జరీ ద్వారా మీ చర్మంపై ఏర్పడిన దద్దుర్లు గడ్డలను సమూలంగా తీసివేయవచ్చు. ఒకవేళ అవి చాలా పెద్దగా ఉండి, చికిత్స సమయంలో మీ చర్మం కమిలిపోవడమో, ఊడిపోవడమో జరిగితే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కూడా ఆ భాగాన్ని మునుపటిలా సరిచేయవచ్చు.


ఇదే సమస్య మీకు భవిష్యత్తులో ఎదురుకాకుండా పుండ్లు, గడ్డలు ఏర్పడ్డ స్పాట్‌లోనే కాకుండా చుట్టుపక్కల కూడా అలాంటి కణజాలాల (టిష్యూస్)ను పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల సూర్యకాంతిలోని అల్ట్రా వయొలెట్ కిరణాల తీక్షణత వల్ల ఈమధ్య తీవ్రమైన చర్మవ్యాధులు, క్యాన్సర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీలా ఎక్కువగా ఎండలో తిరిగేవారు తలపై హెల్మెట్‌గానీ, టోపీగాని ధరించాలి. ఫుల్‌షర్ట్ వేసుకోవాలి. ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. వీలైనంత వరకు తీక్షణమైన సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

డాక్టర్ సచిన్ సుభాష్ మర్దా

సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement