అక్కా... మళ్లీ బడికి పోదామా | Balapur Youth Give Women Education In Family | Sakshi
Sakshi News home page

అక్కా... మళ్లీ బడికి పోదామా

Published Wed, Oct 30 2019 3:19 AM | Last Updated on Wed, Oct 30 2019 3:19 AM

Balapur Youth Give Women Education In Family - Sakshi

బాలాపూర్‌ యూత్‌లో చదువుకుంటున్న మహిళలు

స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు అని పెద్దలు అంటారు. కాని ఈ దేశంలో అమ్మాయిని ఒక రకంగా, అబ్బాయిని ఒక రకంగా చదివించే పరిస్థితులు ఉన్నాయి. చిన్నప్పుడు చదువు మానేసి పెళ్లి, కుటుంబం బాధ్యతలలో పడిపోయి హటాత్తుగా తిరిగి చదువుకోవాలనుకునే స్త్రీలకు మార్గం ఉందా? ఉంది. ఈ స్త్రీలు చదువుకుంటున్నారు. ఇలా చదువుకోవాలనుకుంటున్న స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు

ముప్పై ఏళ్ల క్రితం మమత చదువు ఏడవ తరగతితో ఆగిపోయింది. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం, ఆమెకు సపర్యలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చదువుకోవాలనే ఇష్టం ఉన్నా ఇంటి వద్దే ఉండిపోయింది. ఆ తర్వాత మరో పదేళ్లకు ఇల్లాలయ్యింది. అత్తింటి బాధ్యతల బరువులో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఏడవ తరగతిలో అటకెక్కిన చదువు మళ్లీ ఆమెకు ఎప్పుడూ గుర్తుకురాలేదు. ఆ అవసరమూ లేదనుకుంది. ఇద్దరు పిల్లల్ని బడికి పంపడం, ఎలక్ట్రీషియన్‌ అయిన భర్తకు క్యారేజీ సర్ది ఇవ్వడం, ఇంటిల్లిపాది బాగోగులు చూసుకోవడంవంటి పనులలో మునిగితెలింది. పిల్లలిద్దరూ డిగ్రీ స్థాయికి వచ్చేశారు. ఉదయాన్నే పిల్లలు, భర్త ముగ్గురూ బయటకు వెళ్లిపోతారు. తనకు ఇప్పుడు కాస్తంత తీరిక దొరికింది. తోటి వారితో ఓ మహిళా సంఘంలో చేరింది. అక్కడ తెలిసింది మమతకు చదువుకోకపోవడంలో తలెత్తిన ఇబ్బందులు. ఏ అప్లికేషన్‌ నింపాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా బెరుకుగా ఉండేది. చదువుకోకపోవడంతో ఎవరో ఒకరి సహాయం తప్పనిసరి అయ్యింది. తనే చదువుకుంటే ఇలా ఇబ్బందులు పడేదాన్ని కాదనుకుంది. ఆగిపోయిన చదువు మళ్లీ చదువుకుంటే అనుకుంది. కానీ, ఇంత పెద్దదాన్ని అయ్యాక ఇప్పుడేం చదువుకుంటాం అని నిట్టూర్చింది. కానీ ఆమె కలకు ఓ ఎడ్యుకేషనల్‌ ఎన్జీవో సంస్థ భరోసాగా నిలిచింది. ఓపెన్‌ విద్యా విధానం ద్వారా ఇప్పుడు మమత పదోతరగతి చదువుతోంది. 

వదిలిన చదువు
హైదరాబాద్‌ శివారులోని బాలాపూర్‌ గ్రామంలో బాలాపూర్‌ యూత్‌కు వెళితే ఓ పాతికమంది మహిళలు ఎప్పుడో వదిలేసుకున్న తమ కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉండటం మనం చూడచ్చు. అక్కడ పదహారేళ్ల వయసు నుంచి నలభై ఐదేళ్లు వయసున్న మహిళలు ఉన్నత విద్యను చదువుకుంటూ కనిపిస్తారు. ఆడపిల్లలకు చదువెందుకు అనే పెద్దల వల్ల కొందరు ప్రైమరీ పాఠశాల స్థాయిలోనే చదువు మానేస్తే, కొందరు టెన్త్‌ క్లాస్‌ ఫెయిలయ్యి ఆ తర్వాత చదువు కొనసాగించలేక మానేసిన  వారున్నారు. ఇంకొందరు వారి ఇంటి ఆర్థిక స్థితి సరిగా లేక చిన్నప్పుడే ఇంటెడు బాధ్యతలు మోసినవారున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక తమ గురించి ఆలోచించుకునే స్థాయిని కూడా మర్చిపోయినవారున్నారు. అలాంటి కొంతమంది మహిళలు ఇప్పుడు మళ్ళీ పుస్తకాలను ముందేసుకొని ఒక్కో అక్షరాన్ని

కూడబలుక్కుంటూ 
పదాలను నేర్చుకుంటున్నారు. తమ పంథాన్ని మార్చుకుంటున్నారు. పదవతరగతి పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని కొందరు, ఇంటర్‌.. డిగ్రీ స్థాయి చదువులు చదువుకోవాలని మరికొందరు, వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని తమ కాళ్ల మీద తాము నిలబడాలని కలలు కంటున్నవారు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఎప్పుడో వదిలేసిన చదువును ఇప్పుడు కొనసాగిస్తూ ఆ స్థాయికి తగిన ఉదోగ్యాలు పొందిన వారూ ఉన్నారు. జీవితంలో మరో అవకాశాన్ని పొదివిపట్టుకొని ముందడుగు వేయాలని కలలు కంటున్నవారు ఉన్నారు. వారి కలలు సాకారం కావాలని కోరుకుందాం.

డిగ్రీ చేస్తాను
నాకు ముగ్గురు అమ్మాయిలు. నా చదువు స్కూల్‌ వయసులోనే ఆగిపోయింది. అందుకే ముగ్గురినీ చదివిస్తున్నాను. మా పిల్లలకు చదువు విషయంలో ఏదైనా చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు నాకు మళ్లీ చదువుకునే అవకాశం వచ్చింది. పదోతరగతి ఆపేయకుండా డిగ్రీ కూడా పూర్తి చేస్తాను. 
– సునీత

అదనపు అర్హత
ఇంటికి ఆసరా కావాలంటే ఏదైనా ఉద్యోగం చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్‌ కూడా లేని మాకు ఏ ఉద్యోగం వస్తుంది. ఎక్కడికెళ్లినా ‘పదోతరగతి చదివారా.. సర్టిఫికెట్‌ ఉందా!’ అని అడిగేవారు. దీంతో ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలని ఉన్నా ధైర్యం చేయలేకపోయాను. ఇరవై ఏళ్ల క్రితం టెన్త్‌లోనే నా చదువు ఆగిపోయింది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. వారి బాగోగులు. ఇప్పుడు టెన్త్‌ పాసై ఇంటర్‌ కూడా చదవాలనుకుంటున్నాను. 
– జయశ్రీ

మా అబ్బాయి నేనూ ఒకే క్లాస్‌
కాస్త తీరిక దొరికితే ఏదైనా పుస్తకం చదవాలనుకున్నా ఒక్కో అక్షరం కూడబలుక్కొని చదవాల్సి వచ్చేది. చిన్నప్పుడు మానేసిన చదువు ఇప్పుడు పూర్తి చేస్తా. ఈ నాలుగు నెలలుగా అవన్నీ గుర్తుతెచ్చుకుంటున్నాను. ఇప్పుడు మా అబ్బాయితో పాటు నేనూ పదోతరగతి చదువుకుంటున్నాను.
– వసంత

ఇంగ్లిష్‌లో మాట్లాడాలి
ఇంగ్లిషులో మాట్లాడాలనేది నా కల. కానీ, చదువుకోలేదు. ఎప్పుడూ ప్రయత్నించలేదు. చిన్నప్పుడు ఆపేసిన చదువును కొనసాగిస్తున్నాను. ఇంగ్లిషు నేర్చుకుంటున్నాను. 
– మమత

బేసిక్స్‌ నుంచి మొదలు
ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ చదువుకోవచ్చు. జూన్‌లో మొదలైన ఈ క్లాసులు టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌ రాసేవరకు ఉంటాయి. ఆ తర్వాత కూడా వీరి అభిరుచి మేరకు వృత్తి విద్య కోర్సులు నేర్చుకోవచ్చు. మొదటి నాలుగు నెలలు అఆ లు, ఏబీసీడీల వంటి బేసిక్‌ చదువు చెప్తాం. కొన్నేళ్ల క్రితం వదిలేసిన చదువును కొనసాగించాలంటే బేసిక్స్‌ తప్పనిసరి. ఆ తర్వాత ఐదు సబ్జెక్టులనూ బోధిస్తున్నాం. – చిన్నికృష్ణ, ఇన్‌ఛార్జి, ప్రతన్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ 

– నిర్మలారెడ్డి ఫొటోలు: సోమ సుభాష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement