బనానా ఖజానా
బ్యూటిప్స్
అరటితో లాభాలు బోలెడన్ని. అందానికి అందం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ప్రకృతి ప్రసాదించిన ఈ దివ్యఫలం ఉపయోగాలను తెలుసుకొని రోజూ రెండు పండ్లను తింటూ ఆరోగ్యాన్ని, సౌందర్యసాధనంగా ఉపయోగించుకుంటూ అందాన్ని కాపాడుకోవచ్చు.
స్కిన్ మాయిశ్చరైజర్ : అరటిపండులో విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది. అది చర్మంపై అవసరమైన తేమను పోకుండా కాపాడుతుంది. అందుకు మొదట బాగా మగ్గిన అరటిపండును గుజ్జులా చేసుకోవాలి. అందులో కొద్దిగా తేనెను కలిపి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. దాంతో ఫేస్‌ప్యాక్ వేసుకున్నప్పుడు మాత్రం కళ్లలోకి పోకుండా చూసుకోవాలి. అరటిపండును తిన్నా కూడా ముఖ సౌందర్యం మరింత మెరుగవుతుంది.
ఉబ్బిన కళ్లు మాయం : పైన చెప్పినట్టు అరటిపండు ప్యాక్‌ను కళ్లలోకి పోకుండా జాగ్రత్తగా వాటి చుట్టూ రాసుకోవాలి. అలా రాసుకున్నాక ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ఉబ్బిన కళ్ల కింద చర్మం సాధారణ స్థితికి చేరుతుంది. విటమిన్-ఏ ఉండటం వల్ల రోజూ అరటిపండ్లు తింటే కంటి చూపు కూడా చురుగ్గా ఉంటుంది.
మడమ పగుళ్లు దూరం : కాళ్ల మంటలు, మడమల పగుళ్లతో ఎంతోమంది తరచూ బాధపడుతుంటారు. ఎన్నో రకాల క్రీములు వాడి విసిగి చెంది ఉంటారు. అలాంటప్పుడు అరటిపండు గుజ్జును మడమలకు రాసుకుని ఓ 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కాళ్లను కడిగేసుకుంటే మంటలు, పగుళ్లు తగ్గుతాయి. దాంతో మునుపటి కాళ్ల సోయగం మీ సొంతమవుతుంది.
కురులకు అరటి : జుట్టు రాలిపోతోందని బాధపడేవారికి, అలాగే డ్రై హెయిర్‌తో ఇబ్బంది పడేవారికి మంచి చిట్కా ఉంది అరటితో. ప్రతిసారి తల స్నానం చేసిన తర్వాత అరటిపండు గుజ్జును పెరుగుతో కలిపిన మిశ్రమాన్ని మాడుకు, జుట్టుకు బాగా పట్టించాలి. ఓ అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే అది జుట్టుకు మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం త్వరగా తగ్గుతుంది. కెమికల్స్‌తో తయారయ్యే కండీషనర్లు వాడేకంటే ఈ అరటిగుజ్జు వాడితే అందం, ఆరోగ్యం రెండూనూ.
పాలీషింగ్ : అరటిపండు వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో, అరటి తొక్కతోనూ అన్నే ప్రయోజనాలున్నాయి. అరటి తొక్కతో షూ పాలిష్ చేసుకుంటే అవి తళతళా మెరిసి పోతాయి. అంతేకాకుండా ఆ తొక్కతో వెండి వస్తువులను రుద్దినా తళతళ మెరుస్తాయి. అరటి తొక్కతో రుద్దాక వాటిని మళ్లీ పేపర్ క్లాత్‌తో తుడవాలి. ఆ తర్వాతే నీటితో కడగాలి.