వలపుల మార్కెట్ | beauty tips of womens | Sakshi
Sakshi News home page

వలపుల మార్కెట్

Published Tue, Dec 8 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

వలపుల మార్కెట్

వలపుల మార్కెట్

చీకటి పడే వరకు బయట ఉండరు. పార్టీలకు వెళ్లరు. తాగరు. నచ్చినవాడిని చేసుకునే సాహసం చెయ్యరు. ఇక డేటింగ్ ఎక్కడి మాటా! ఇదీ భారతీయ మహిళలపై ప్రపంచానికి ఉన్న అభిప్రాయం. అవునా?! ఆలోచించాలి. అసలు డేట్ అంటే ఏంటి? మరీ ఆమాత్రం తెలియకుండా అడుగుతున్నారా! డేట్ అంటే క్యాలెండర్‌లో ఒక నంబర్. (కాదు లెండి). డేట్ అంటే అబ్బాయి అమ్మాయికీ, అమ్మాయి అబ్బాయికీ మీటింగ్ టైమ్ ఇవ్వడం. ఇప్పుడు అర్థమయిందా? ఇక చదవండి.
 
టిండర్, ఫ్రివిల్, ట్రూలీమ్యాడ్లీ, ఓకే క్యుపిడ్, వూ.. కొంతకాలం క్రితమే ఇండియాలోకి ప్రవేశించాయి. ఇవన్నీ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్. ప్రేమలకు, పెళ్లిళ్లకు ‘డేట్స్’ కుదిర్చిపెడతాయి. మరి.. అన్నిటికీ దూరంగా ఉన్నట్లే మన సంప్రదాయ మహిళలు వీటికీ దూరంగా ఉంటున్నారా? లేదు!
 
రుజువేమిటి? ఇక్కడుంది. గత ఒక్క ఏడాదిలోనే టిండర్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్న భారతీయుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందట! ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం! సంప్రదాయవాదులు, శుద్ధ సంప్రదాయ స్త్రీవాదులు ఈ యాప్స్‌ను ఎంత దుయ్యబడుతున్నారో... అంతగా యువతులు వీటిని ఇష్టపడుతున్నారు. వీళ్లంతా 18-35 ఏళ్ల మధ్య వయసు వారు.
 
‘ముఖ్యంగా టిండర్‌ను లైక్ చేస్తున్నారు. ఒక వారం మొత్తంలో మగవాళ్ల నుంచి వచ్చే ‘సూపర్ లైక్స్’ కన్నా ఆడవాళ్లు కొట్టే లైక్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకు మించి సాధికారత ఉంటుందా?’ అని తారూ కపూర్ అడుగుతున్నారు. టిండర్ ఇండియాకు ఆవిడ హెడ్డు. టిండర్ 2012లో ప్రారంభం అయింది. ప్రస్తుతం 196 దేశాల్లో విస్తరించి ఉంది. 30 భాషల్లో అందుబాటులో ఉంది.

అన్నిటికన్నా ఆసక్తికరమైన సంగతి ఏంటంటే.. టిండర్ యాప్‌లో జరిగే స్త్రీపురుష సంభాషణల్లో మిగతా దేశాలన్నింటి కన్నా భారత్ ముందుండడం. టిండర్ యాప్‌లోని ‘సూపర్ లైక్’ ఫీచర్‌ని వారానికి దాదాపు పది లక్షల మంది ఉపయోగిస్తున్నారు. అందులో యాక్టివ్ పార్ట్ మళ్లీ మహిళలదే.
 
స్త్రీలు ఏం కోరుకుంటున్నారు?
ఇదేమీ సమాధానం లేని ప్రశ్న కాదు. జీవన శైలులు మారుతున్నాయి. పెద్దలు చూసిన సంబంధాన్ని చేసుకోవడం మన సంప్రదాయం. అయితే ఇప్పటి అమ్మాయిలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. భారీ జీతాలను సంపాదిస్తున్నారు. ఆర్థికంగా స్వతంత్రులు అవుతున్నారు. దాంతో తమ పెళ్లి ఎప్పుడు జరగాలి? ఎవరితో జరగాలి అనే స్వతంత్ర నిర్ణయం తీసుకునే వెసులుబాటు వారికి కలుగుతోంది.

ఉన్నతమైన కెరియర్‌లో ఉన్నవారు సహజంగానే, తమకు దీటైన కెరియర్‌లో ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. అందుకు టిండర్ లాంటి యాప్స్ వీళ్లకు సహాయం చేస్తున్నాయి.
 ఇలాంటి యాప్స్ కొందరు అమ్మాయిలకు స్ట్రెస్ బస్టర్‌గా కూడా పనిచేస్తున్నాయి! మగాళ్లను సరదగా ఒక ఆట ఆడించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయట!
 
విమర్శలు.. వివాదాలు
ఫ్రెండ్స్, డేట్స్, రిలేషన్‌షిప్స్.. వీటి కోసమే నేనున్నది అని టిండర్ చెప్పుకుంటోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా టిండర్ 900 కోట్ల పెళ్లిళ్లు చేసిందట! ఇండియాలో రోజూ ఇన్నిన్ని డౌన్‌లోడ్ జరుగుతున్నాయంటే.. మన ఆడపిల్లలు సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు... వీటన్నిటినీ దాటుకుని వచ్చేస్తున్నారనే కదా అన్నది తారూ పాయింట్.
 
అయితే ఈ ధోరణి వల్ల అంతా హ్యాపీనే అని చెప్పడానికి వీల్లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అడపాదడపా టిండర్ చిచ్చుపెడుతోంది. భార్యకు తెలీకుండా ఓ భర్త.. కొత్త రిలేషన్ కోసం టిండర్‌లోకి అడుగుపెట్టడం... డేటింగ్ కోసం టిండర్‌లోకి తొంగి చూసిన భార్యకు అక్కడ తన భర్త కనిపించడం వంటి ట్విస్టులు కూడా ఇందులో ఉన్నాయి.
 ఫ్రివిల్ అనే డేటింగ్ యాప్‌కైతే.. సంప్రదాయ స్త్రీవాదుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయట. ఫ్రివిల్ వెనుక ఉన్నది షాదీ వెబ్‌సైట్.
 
ఒకావిడ అయితే మీరు సాధికారతను ప్రమోట్ చెయ్యడం లేదు. వట్టి డొల్లతనం తప్ప ఇంకేం లేదు అని ఫ్రివిల్ మీద విరుచుకు పడింది. చూపులకు ఆకర్షణీయంగా ఉండేవారే డేటింగ్‌లో పడిపోతారు కాబట్టి ‘డేట్’కి అందమే ప్రామాణికమని మీరు ప్రచారం చేస్తున్నారా అని ఆవిడ వాదన.
 
ఈ వాదనలు, ఆగ్రహాలు ఎలా ఉన్నా... సంప్రదాయ బద్ధులైన భారతీయ స్త్రీమూర్తులు మెల్లిమెల్లిగా రెక్కలు విప్పుకుంటున్నారని రోజురోజుకూ డేటింగ్ ఆప్స్‌కు పెరుగుతున్న ఆదరణను బట్టి తెలుస్తోందని తారా అంటున్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement