మీరు మర్యాద రామన్నేనా? | Behaviour, Good Manners & Respect | Sakshi
Sakshi News home page

మీరు మర్యాద రామన్నేనా?

Published Mon, Jan 15 2018 1:40 AM | Last Updated on Mon, Jan 15 2018 1:40 AM

Behaviour, Good Manners & Respect - Sakshi

సంఘ ప్రవర్తనతోనే సరైన గౌరవం సినిమా హాలుకు వెళతాం. సినిమా మొదలవుతుండగానే కాళ్లు ఎత్తి ముందు సీటు మీద పెడతాం. ఆ సీట్లో ఉన్నవాళ్లు చిరాగ్గా వెనక్కు తిరిగి ఏదో ఒక మాట అంటారు. అదా మనం కోరుకునే మర్యాద? ఇంటర్వ్యూకు వెళతాం. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మర్యాద కోసం షేక్‌ హ్యాండ్‌కు చేయి చాపుతాడు. మనం ఆత్మవిశ్వాసం లేని బిక్క చచ్చినట్టుండే చేతిని అతని చేతిలో పడేస్తాం. లేదా చెమటతో నిండిన చేతిని అతడి చేతిలో పెట్టి మన చెమటని అతనికి పూస్తాం. అతడు ఇబ్బందిగా మనవైపు చూస్తాడు.

అదా మనం కోరుకునే మర్యాద? వ్యక్తిగత ప్రవర్తన వేరు. మనం ఒక్కళ్లమే ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలాగైనా ఉండొచ్చు. కాని నలుగురిలో ఉన్నప్పుడు ‘సంఘ ప్రవర్తన’ అవసరం. దీనిని ఇంగ్లిష్‌లో ‘ఎటికెట్‌’ అంటారు. ఈ ప్రవర్తన లేకపోతే నలుగురిలో మనం అమర్యాదకు లోనవుతాం. నలుగురి దృష్టిలో మనం పలుచన అవుతాం. నలుగురు మనల్ని మర్యాద తెలియనివారనుకుంటారు.

ఇటీవలి ఉదంతం
బ్యాంకింగ్‌ రంగంలో భారతదేశంలో నంబర్‌ వన్‌గా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలనే తన సిబ్బందికి ‘సరిగ్గా వ్యవహరించండి’ అని తాకీదు పంపింది. ‘మీలో ప్రతి ఒక్కరూ ఎస్‌బీఐకి అంబాసిడరే. మీ ప్రవర్తన, ప్రదర్శన ఎలా ఉంటుందనే దాని మీదే బ్యాంకు గౌరవం ఆధారపడి ఉంటుంది’ అని అది చెప్పింది. బ్యాంక్‌ అంటే నిత్యం కస్టమర్లు వచ్చిపోయే చోటు. అది పబ్లిక్‌ ప్లేస్‌. అక్కడ నలుగురు మెచ్చే విధంగానే ఉండాలి అని ఈ తాకీదు అర్థం. బ్యాంక్‌ చేసిన సూచనల ప్రకారం–

► సీనియర్‌ సిబ్బంది చక్కటి మర్యాదకరమైన బట్టలే అంటే ఫార్మల్సే ధరించాలి.
► జీన్స్, టీ షర్ట్స్, స్పోర్ట్‌ షూస్‌ వంటివి వర్క్‌ప్లేస్‌లో ధరించరాదు.
► స్త్రీలు కూడా భారతీయ లేదా వెస్ట్రర్న్‌ ఫార్మల్స్‌నే ధరించాలి.
► సరిగా దువ్వుకున్న తలకట్టు ఉండాలి. క్లీన్‌ షేవ్‌ చేసుకోవాలి.
► చెప్పులు, షూస్‌ శుభ్రంగా, పాలిష్‌తో ఉండాలి.
► చెక్‌ షర్ట్స్‌ మీద ప్లెయిన్‌ కలర్‌ టైలు, ప్లెయిన్‌ షర్ట్స్‌ మీద చెక్స్‌ టైలు ధరించాలి
► కస్టమర్స్‌తో సరిగా మాట్లాడాలి. వారితో మీటింగ్‌లో ఉన్నప్పుడు తేన్చడం, చీదడం వంటి పనులు చేయకూడదు.


ఇలా ఎస్‌.బి.ఐ. తన సిబ్బందికి చాలా సూచనలే చేసింది. కాని ఇవి ఆ సిబ్బందికి మాత్రమే కాదు ఏ సిబ్బందికైనా వర్తిస్తాయని వాటిని చదివితే మనకు అర్థమవుతుంది. మనకు అన్నీ తెలియాలని రూల్‌ లేదు. కాని తెలిశాక అలా ప్రవర్తించడం మంచిది. మనిషి ఎదుగుదలలో సంఘ ప్రవర్తన ముఖ్య పాత్ర పోషిస్తుంది. దానిని పాటించడమే నేటి మర్యాద. నాగరికత.

పర్సనల్‌ ఎటికేట్‌
వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. శరీరం నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవాలి. నోటి నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్త పడాలి. మురికి పట్టిన, నలిగిన బట్టలు ధరించకపోవడం మేలు. చేతి, కాలి గోళ్లు శుభ్రంగా తీసుకుని ఉండాలి. ముక్కును చెవులను శుభ్రంగా ఉంచుకోవాలి. దట్టమైన మేకప్‌లు ఎబ్బెట్టుగా ఉంటాయి. జుట్టు దువ్వుకోవాలి. చుండ్రు లేకుండా చూసుకోవాలి. పెర్ఫ్యూమ్స్‌ కానీ, డియోడ్రెంట్లు కాని ఎదుటివారికి ఆహ్లాదం కలిగించే స్థాయిలో ఉండాలి తప్ప ఘాటుతో ఉండి పక్కకు తప్పుకునేలా ఉండరాదు.

సోషల్‌ ఎటికేట్‌
నలుగురిలో ఉన్నప్పుడు ఎదుటివారిని పలకరించాలి. కళ్లల్లో చూసి మాట్లాడాలి. మంచి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలి. ఇంట్లో ఉన్నవాళ్లతో కూడా మర్యాదగా ప్రవర్తించాలి. బయటకు వెళుతున్నప్పుడు తల్లిదండ్రులతో లేదా భార్యతో వెళ్లొస్తాను అని చెప్పాలి. బయటి నుంచి తిరిగి వచ్చాక సరిగ్గా పలకరించాలి. నలుగురి మధ్య తల దువ్వుకోవడం, బజారున నడుస్తూ వెళుతున్నప్పుడు ఏదైనా తింటూ వెళ్లడం చేయరాదు. అందరి మధ్య ఊయడం, స్మోక్‌ చేయడం కూడా మర్యాద కాదు. చూయింగ్‌ గమ్‌ నములుతూ కూడా మాట్లాడకూడదు.

డైనింగ్‌ ఎటికేట్‌
నలుగురితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అందరితో పాటు మొదలెట్టడం ఆనవాయితీ. ప్లేట్లు, పదార్థాలు శబ్దం వచ్చేలా లాగకూడదు. డైనింగ్‌ టేబుల్‌ మీద మోచేలు పెట్టి కూర్చోరాదు. మీ పక్కన ఉన్నవారితో మాట కలుపుతూ భోజనం చేయండి. పెద్దగా చప్పుడు చేస్తూ నమలడం కాని తాగడం కాని చేయరాదు. మూతిని నేప్‌కిన్‌తో అద్దుకోవాలి. తుడుచుకోరాదు.

టెలిఫోన్‌ ఎటికేట్‌
అనవసరమైన వేళలో ఫోన్‌ చేయకూడదు, ముఖ్యమైన విషయం ఉంటే తప్ప. మీరు కాల్‌ చేస్తే మొదట మీ పేరు చెప్పండి. ఎదుటి వ్యక్తి కాల్‌ చేస్తే వారు పెట్టేవరకు సంభాషణ కొనసాగించాలి. మీరు మధ్యలో ఫోన్‌ పెట్టేయకూడదు. ఎదుటివారు చెప్పేది వినాలి. ఒకరితో ఫోన్‌ మాట్లాడుతూ ఎదురుగా ఉన్న మరో వ్యక్తితో మాట్లాడకూడదు. అవతలి వ్యక్తికి తెలియకుండా స్పీకర్‌ ఆన్‌ చేయడం అమర్యాద.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement