బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి! | Blood Group bot matched kidney transplant | Sakshi
Sakshi News home page

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి!

Published Sun, Sep 20 2015 11:38 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

Blood Group bot matched kidney transplant

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 42. గత కొంతకాలంగా నా మోకాళ్లు తీవ్రంగా నొప్పి పెడుతున్నాయి. డాక్టర్‌ను కలిస్తే కొన్ని పరీక్షలు చేయించి, నాకు ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పి, మందులు రాశారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి? దీనికి హోమియోలో మందులు ఉన్నాయా?
- కె.ఎస్.ఆర్. హైదరాబాద్

 
మన శరీరంలో ఉండే అన్ని కీళల్లో ప్రధానమైనవి మోకాలి జాయింట్లు. ఇవి నడవడానికి, పరుగెత్తడానికీ, మెట్లెక్కడానికీ, వివిధ కదలికలన్నింటికీ సహాయపడతాయి. తొడ ఎముక (ఫీమర్), దిగువ కాలి ఎముక (టిబియా) రెండూ కలిసి మోకాలి జాయింటుగా ఏర్పడి ఉంటాయి. ఈ రెండు ఎముకల చివరి భాగాలు కలిసిన ప్రాంతంలో కార్టిలేజ్ అనే నున్నటి మృదులాస్థి ఉండి, ఇవి మృదువుగా కదలడానికి సహాయపడుతుంది. మోకాలి జాయింటును చుడుతూ సైకోవియం అనే పొర ఉంటుంది. ఈ పొర సైకోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవాన్ని విడుదల చేస్తుంటుంది. ఈ సైకోనియం పొరపై క్యాప్సూల్ అనే మరో గట్టిపొర ఉంటుంది. ఇది మోకాలి జాయింటును స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది.
 
ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా వస్తుందంటే..?
ఆర్థరైటిస్ మొదలైన కొన్ని రోజులకు కార్టిలేజ్ క్రమంగా అరిగిపోవటం ఆరంభమవుతుంది. దీంతో క్రమేపీ అది పలుచగా మారుతుంది. దీనికితోడు ఎముకలలో కణజాలం వాపునకు గురై ఎముకల చివరి భాగాలు పెరిగి పోవడంతో ఇది ఆస్టియో ఫైట్స్‌గా మారిపోతాయి. దీని ప్రభావంతో సైకోనియం పొర ఉబ్బి అదనపు ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఫలితంగా మోకాలి కీలులో వాపు, మోకాలిలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది మోకాళ్లలోనే కాకుండా చేతి వేళ్లు, వెన్నుపూస, తుంటి, కాలివేళ్లు మొద లైన చోట్ల కూడా కనిపించవచ్చు.

కారణాలు: 40 సంవత్సరాలు దాటిన వారిలో ముఖ్యంగా స్త్రీలలో ఆస్టియో ఆర్థరైటిస్  వచ్చే అవకాశం ఎక్కువ. ఊబకాయం, వంశపారంపర్య చరిత్ర తదితర కారణాల వల్ల, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాథమిక దశలో ఉన్న వారికి కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.
 
లక్షణాలు: కీళ్లనొప్పి, వాపు, బిగుసుకుపోవడంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటుంది. వీటికి తోడు కీళ్ల దగ్గర రాపిడి శబ్దాలు, చేతితో ఆ ప్రాంతాన్ని తాకిన ప్పుడు వేడిగా అనిపించడం, కింద కూర్చున్నప్పుడు తీవ్రమైన ఇబ్బంది, ఈ నొప్పి మూలాన నడిచే తీరులో సైతం తేడా వస్తుంది.
 
నిర్థారణ: రోగలక్షణాలను బట్టి, రక్తపరీక్ష, మోకాలి నుండి  నీరు తీసి పరీక్ష చేయడం ద్వారా, ఎక్స్‌రే, ఎమ్మారై, సీటీ స్కాన్...  
 హోమియో చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ విధానంలో ఆస్టియో ఆర్థరైటిస్‌ను తగ్గించడంలోనూ, కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ సత్ఫలితాలను సాధిస్తూ వస్తోంది. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ప్రభావవంతమైన చికిత్స ఇవ్వడం ద్వారా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు.
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్,
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్

 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 22 ఏళ్లు. నాకు కొంత కాలం క్రితం కాళ్లలో వాపులు రావడం, తరచూ వాంతులు అవుతుండటంతో వైద్యులను సంప్రదించాను. వైద్యపరీక్షలు చేసి, నాకు క్రానిక్ కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వెంటనే డయాలసిస్ ప్రారంభించారు. గత మూడు నెలలుగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఉత్తమమని వైద్యులు చెప్పారు. నా బ్లడ్‌గ్రూపు ఓ పాజిటివ్. మా కుటుంబంలో ఎవరికీ ఆ బ్లడ్ గ్రూపు లేదు. బ్లడ్‌గ్రూపు కలవకపోతే కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంటుందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- ఎస్.వి.ఆర్. హైదరాబాద్

 
కిడ్నీ దాత, స్వీకర్త ఒకే బ్లడ్ గ్రూపు కలిగి ఉంటే కిడ్నీ మార్పిడి చేయవచ్చు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలువుతుంది. ఏబీఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ఆధునిక వైద్య ప్రక్రియ ద్వారా బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయవచ్చు. ఈ ప్రక్రియలో వేర్వేరు బ్లడ్‌గ్రూపుల్లోని యాంటిజెన్‌ను కలిసేలా చేస్తారు. ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిష్ణాతులైన వైద్యులు, అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లోనే చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా చేసిన కిడ్నీ మార్పిడి కూడా మామూలుగా బ్లడ్ గ్రూప్‌లు కలిసినప్పుడు నిర్వహించే శస్త్రచికిత్సల్లాగా మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి. మీలాగా బ్లడ్‌గ్రూపులు కలవకపోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయించుకోలేక దీర్ఘకాలికంగా డయాలసిస్‌పైనే ఆధారపడుతున్న ఎంతోమందికి ఏబీఓ ఇన్‌కాంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.    
 
డాక్టర్ ఊర్మిళ ఆనంద్
సీనియర్ నెఫ్రాలజిస్ట్,
యశోద హస్పిటల్స్,
సికింద్రాబాద్

 
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాప వయసు ఎనిమిదేళ్లు. చాలాకాలంగా ఆయాసం, దగ్గుతో బాధపడుతోంది. ఏమీ తినలేకపోతుంది. కొద్దిగా కారం తిన్నా కడుపులో మంట అని ఏడుస్తోంది. డాక్టర్‌ను కలిశాం. మందులు వాడుతున్నా ఇంకా దగ్గు వస్తూనే ఉంది. మా పాప సమస్య పూర్తిగా తగ్గడానికి ఏం చేయాలో తెలియజేయండి.
- పవన్, విజయవాడ

 
మీ పాపకు సాధారణ ఆస్తమాతో పాటు దాని అనుబంధ సమస్యగా యాసిడ్ పెప్టిక్ డిసీజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కడుపునొప్పి (ముఖ్యంగా రాత్రిపూట), వికారం (నాసియా), బరువు సరిగా పెరగకపోవడం వంటి లక్షణాలు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌లో ఉంటాయి. ఇక మీ పాపకు ఉన్న మొదటి సమస్య ఆస్తమా ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. దాదాపు 20 శాతం నుంచి 25శాతం మందిలో ఆస్తమాకు - యాసిడ్ పెప్టిక్ డిసీజ్ (ఏపీడీ/జీఈఆర్) తోడవుతున్నట్లు చాలా అధ్యయనాల వల్ల తెలుస్తోంది. ఇలాంటి పిల్లల్లో భోజనం తర్వాత దగ్గు పెరుగుతుంటుంది. రాత్రివేళ దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో పాటు రిఫ్లక్స్ (తిన్న ఆహారం వెనక్కు రావడం) వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పిల్లల్లో మానసిక ఒత్తిడి కడుపులోని యాసిడ్ స్రావాలను పెంచుతుంది. కొన్ని రకాల డ్రగ్స్, ఆహారాలు, ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల పొట్ట, పేగులలో అల్సర్స్ వచ్చే అవకావం ఉంది. కొన్నిసార్లు ఆస్తమా చికిత్సకు వాడే కొన్ని మందుల వల్ల కూడా రిఫ్లక్స్ పెరిగి పేగుకు సంబంధించిన లక్షణాలు ఎక్కువ కావడం జరుగుతుంటుంది. మీ పాపకు పూర్తిస్థాయి ఆస్తమా చికిత్స అవసరం. దాంతోపాటు అసిడిటీతో, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్‌కు సంబంధించిన మందులు వాడటం ముఖ్యం. ఆహారంలో అసిడిటీని కలిగించే కాఫీ, పుల్లని పండ్లు, మసాలాలు నివారించడం అవసరం. నిద్ర పోవడానికీ, భోజనానికీ మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. పడుకునే సమయంలో మిగతా శరీరం కంటే తల కాస్త పైన ఉండేలా చూసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో పాప లక్షణాలను చాలావరకు తగ్గించవచ్చు. అయితే లక్షణాలు పెరుగుతుంటే మాత్రం ఎండోస్కోపీ చేసి సివియర్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్ ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. బేరియమ్ స్టడీతో పాటు ఎండోస్కోపిక్ ఇవాల్యుయేషన్ ద్వారా పాప సమస్యలకు కారణాన్ని తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించండి.

డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement