విటమిన్ – డి తో కేన్సర్ ముప్పు తక్కువ...
శరీరంలో విటమిన్ – డి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే కాలేయ కేన్సర్‌తోపాటు పలు ఇతర కేన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. సూర్యరశ్మి ఆసరాతో శరీరంలో తయారయ్యే విటమిన్ – డి... క్యాల్షియం మోతాదులను నియంత్రించడం ద్వారా ఎముకలు, పళ్లను దృఢంగా ఉంచుతుందని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేశాయి. కేన్సర్ల విషయంలోనూ ఇది మేలు చేస్తుందని గతంలోనే కొన్ని వాదనలు ఉన్నప్పటికీ కచ్చితమైన రుజువులు లేకపోవడం వల్ల విస్తృత ప్రచారంలోకి రాలేదు.
ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ సెంటర్ శాస్త్రవేత్తలు దాదాపు 33 వేల మందిపై అధ్యయనం చేశారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, రక్తంలో విటమిన్ – డి∙మోతాదులను నమోదు చేసుకున్న తరువాత వీరిపై దీర్ఘకాల పరిశోధనలు మొదలుపెట్టారు. ఋతువులకు అనుగుణంగా విటమిన్ – డి మోతాదులో వచ్చే మార్పులనూ పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు దాదాపు 16 ఏళ్లపాటు పరిశీలనలు కొనసాగించారు. ఈ కాలంలో వీరిలో దాదాపు 3301 మందికి కేన్సర్ సోకింది.
వయసు, వ్యాయామం చేసే అలవాటు, ధూమపానం, మద్యపానం వంటి అన్ని ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించినప్పుడు సాధారణ స్థాయి కంటే ఎక్కువ విటమిన్ – డి ఉన్న వారికి కేన్సర్ సోకే అవకాశాలు 20 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాలేయ కేన్సర్ విషయంలో ఇది 30 – 50 శాతం వరకూ ఉన్నట్లు తెలిసింది. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ కేన్సర్ల విషయంలో ప్రభావం పెద్దగా లేదు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ అంశాన్ని రూఢి చేసుకుంటే విటమిన్ –డి ని కేన్సర్ నిరోధక కార్యక్రమాల్లో వాడుకోవచ్చునని భావిస్తున్నారు.
ప్రోటాన్ బ్యాటరీలు వస్తున్నాయి...
అతితక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకోగల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం తక్కువైనా, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వీటినే వాడుతున్నారు. అయితే ఇకపై ఈ పరిస్థితి మారిపోనుంది. ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రోటాన్లతో పనిచేసే సరికొత్త బ్యాటరీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడికక్కడే సమర్థంగా నిల్వ చేసుకుని వాడుకోవడంతోపాటు విద్యుత్తు వాహనాలు మరింత ఎక్కువ దూరం ప్రయాణించేందుకూ ఈ కొత్త బ్యాటరీలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అన్నిటికీ మించి ప్రోటాన్ బ్యాటరీలు చాలా చౌకగా తయారుచేయవచ్చు.
పర్యావరణానికి జరిగే నష్టం కూడా చాలా తక్కువ. బ్యాటరీలోకి విద్యుత్తు ప్రవహించినప్పుడు నీరు కాస్తా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడిపోతుంది. కొన్ని ప్రోటాన్లూ విడుదలవుతాయి. ఇవి కాస్తా కార్బన్‌తో తయారైన ఎలక్ట్రోడ్‌కు అతుక్కుంటాయి. అవసరమైనప్పుడు ఇవే ప్రోటాన్లు విడిపోయి గాల్లోంచి ఆక్సిజన్‌ను తీసుకుని నీటిని తీసుకోవడం ద్వారా మళ్లీ ఎలక్ట్రాన్లను ( విద్యుత్తు) విడుదల చేస్తాయి. ప్రస్తుతం తాము తయారు చేసిన నమూనా ప్రోటాన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకోగలదని.. కొన్ని మార్పులు, చేర్పులతో సామర్థ్యాన్ని పెంచవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ ఆండ్రూస్ తెలిపారు.
రక్తపోటు పరీక్షలకు మెరుగైన స్మార్ట్‌ఫోన్ పద్ధతి!
స్మార్ట్‌ఫోన్లతో చేయగలిగిన పనుల్లో రక్తపోటు పరీక్షలు ఇప్పటికే చేరినప్పటికీ ఇదే పనిని మరింత కచ్చితత్వంతో చేసేందుకు మిషిగన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ముక్కామల రామకృష్ణ ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. ఆధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో, కొన్ని ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగించి ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ కేస్‌ను తయారు చేశారు ఈయన. దీంతోపాటు ప్రత్యేకమైన ప్రదేశంలో ఉండే ఇంకో సెన్సర్‌ను వేలితో నొక్కితే చాలు.. రక్తపోటు వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
వేలి ఒత్తిడికి ఆప్టిక్‌ల సెన్సర్లు పనిచేయడం మొదలుపెడతాయని.. రక్తనాళాల్లో రక్తపోటు కారణంగా వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా రక్తపోటు ఎంత ఉందో నిర్ణయించి ఆ సమాచారాన్ని వైర్‌లెస్ పద్ధతిలో స్క్రీన్ పైకి పంపుతాయని రామకృష్ణ వివరించారు. ఇప్పటికే తాము ఈ స్మార్ట్ కేస్‌ను కొంతమందిపై పరీక్షించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సహకారంతో తయారైన ఈ కొత్త గాడ్జెట్ వైద్య రంగంలో మేలి మార్పులకు కారణమవుతుందని వైద్య నిపుణుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment