కాముకులకు ఖబడ్దార్‌ | Bollywood Rani Mukherjee new movie Mardaani 2 | Sakshi
Sakshi News home page

కాముకులకు ఖబడ్దార్‌

Published Sun, Dec 1 2019 3:38 AM | Last Updated on Sun, Dec 1 2019 3:38 AM

Bollywood Rani Mukherjee new movie Mardaani 2 - Sakshi

అత్యాచారాలు మేజర్లే చేస్తారని ఒక అభిప్రాయం ఉంది. మైనర్లు ఎంత ఘోరంగా ప్రవర్తించగలరో ‘నిర్భయ’ కేసు చెప్పింది. ప్రియాంకా రెడ్డి కేసు కూడా మైనర్ల దుశ్చర్యను బయటపెట్టింది. అత్యాచారాలు చేయొచ్చని బరి తెగిస్తున్న మైనర్లను ‘ఖబడ్దార్‌’ అని ‘మర్దానీ 2’లో హెచ్చరిస్తోంది రాణీ ముఖర్జీ.

‘మర్దానీ’ ఫస్ట్‌ పార్ట్‌ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ కథతో సాగుతుంది. మరి.. ‘మర్దానీ 2’లో ఏ అంశం గురించి చూపించారు?
రాణీ ముఖర్జీ: రెండో భాగం ప్రధానంగా అత్యాచారం మీద సాగుతుంది. నూనూగు మీసాలు కూడా రాని మగపిల్లలు అత్యాచారం చేయడం అనేది నిర్ఘాంతపరిచే విషయం. అలాంటి బాల నేరస్తుల గురించిన కథ ఇది. దర్శకుడు గోపీ పుత్రన్‌ కథ చెబుతున్నప్పుడే ఘటనలు విని, చాలా బాధ అనిపించింది. ‘మర్దానీ 1’కి ఆయన రైటర్‌గా చేశారు. సెట్స్‌కి వచ్చి చాలా ఇన్‌వాల్వ్‌ అయ్యేవారు. ఫస్ట్‌ పార్ట్‌తో రైటర్‌గా ట్రావెల్‌ అయిన అనుభవంతో డైరెక్టర్‌గా సెకండ్‌ పార్ట్‌ని అద్భుతంగా తీశారు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో, అంతకుముందు ఘోరమైన ‘హత్యాచారాలు’ జరిగాయి. వీటిపై మీ స్పందన?
అత్యాచారం అనేది అమానవీయ విషయం. దాదాపు ప్రతి రోజూ మనం ఇలాంటి ఘటనలు వింటూనే ఉన్నాం. విన్న ప్రతిసారీ మళ్లీ ఇలాంటిది జరిగిందని వినకూడదనుకుంటాను. కానీ అది సాధ్యం కాదని అర్థమవుతోంది. ఓ 15 ఏళ్ల యువకుడు 29 ఏళ్ల అమ్మాయిపై దాడి చేసి, అత్యాచారం జరిపాడు. నాలుగైదు రోజుల క్రితం ఇది ముంబైలో జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకు హైదరాబాద్‌ ఘటన. షాక్‌ అయ్యాను. ఇలాంటివాళ్లను ఊరికే వదలొచ్చా? వదిలితే నేరాలు పెరుగుతాయి. వీళ్లకు విధించే శిక్ష చాలామందికి పాఠం కావాలి. నేరం చేయాలంటేనే భయపడాలి. శిక్ష అలా ఉండాలి.

హిందీలో మీ తొలి చిత్రం ‘రాజా కీ ఆయేగీ బారాత్‌’ (1997)లో అత్యాచారానికి గురైన యువతిగా నటించారు. ఆ సినిమా గురించి రెండు మాటలు?
22 ఏళ్ల క్రితం ఆ సినిమా చేశాను. విచారించదగ్గ విషయం ఏంటంటే.. ఇన్నేళ్లల్లో అత్యాచారం మీద చాలా సినిమాలు వచ్చాయి. చాలావరకూ సమాజంలో జరిగేవే సినిమాకి కథావస్తువు అవుతాయి. ఇప్పటికీ రేప్‌ మీద సినిమాలు వస్తున్నాయంటే సమాజంలో ఇంకా జరుగుతున్నాయి కాబట్టే. వెలుగులోకి వచ్చేవి పదుల సంఖ్యలో ఉంటే రానివి వందల సంఖ్యలో ఉంటాయేమో! ‘నిర్భయ’ లాంటి ఘటనలు కొన్నే బయటకు వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే ‘రాజా కీ ఆయేగీ..’ రిలీజ్‌ అప్పుడు మా నాన్నగారికి ఆపరేషన్‌ జరిగింది. ఆయన స్పృహలోకి రాగానే సినిమా ఎలా ఉంది? అని అడిగారు. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక థియేటర్‌కి వెళ్లి సినిమా చూశారు. సినిమాలో నా పేరు మాల. ఓ పెళ్లికి వెళ్లిన మాల ఆ తర్వాత రేప్‌కి గురవుతుంది. అక్కడ్నుంచి తను పడే మానసిక క్షోభతో సినిమా ఉంటుంది. అది నటనే అని తెలిసినా మా నాన్నగారు చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. ఇక నిజంగా తమ కూతుళ్లకు అలాంటిది జరిగితే ఆ తండ్రి పడే బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

మొదటి సినిమాలోనే రేప్‌కి గురయ్యే యువతిగా చేయడం రిస్క్‌ అనుకోలేదా?
ఫస్ట్‌ నుంచి కూడా నేను నా మనసుకి నచ్చిన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఉంటుంది. అయితే మనసుకి నచ్చని పాత్రలు చేస్తే నటిగా నాకు ఆత్మసంతృప్తి లభించదు కదా. అందుకే రిస్క్‌లు తీసుకోవడానికే ఇష్టపడ్డాను. ప్రతి పాత్రనూ మనసు పెట్టి చేశాను కాబట్టి నటిగా మంచి పేరు తెచ్చుకోగలిగాను.

‘మర్దానీ’ వచ్చిన ఐదేళ్లకు సీక్వెల్‌ చేశారు. ఫస్ట్‌ పార్ట్‌కి వచ్చిన స్పందన సెకండ్‌ పార్ట్‌కి వస్తుందా లేదా? అనే టెన్షన్‌ ఏమైనా?
టెన్షన్‌ ఏమీ లేదు కానీ, ‘మర్దానీ 2’ ట్రైలర్‌ రిలీజ్‌ అప్పుడు మాత్రం ఎలాంటి స్పందన వస్తుందా? అని చాలా ఆత్రుతగా ఎదురు చూశాను. ట్రైలర్‌ చూసిన వాళ్లందరూ బాగుందన్నారు. శివానీ శివాజీ రాయ్‌ (‘మర్దానీ’లో రాణీ ముఖర్జీ పాత్ర పేరు)ని ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సీక్వెల్‌ గురించి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థమైంది. దేశం మొత్తం ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ‘అసలు వీళ్లు ఈ నేరం చేయగలుగుతారా?’ అని ఊహించలేం. అలాంటి యువకులు ఈ సినిమాలో నేరం చేస్తారు. సమాజంలో పైకి అమాయకంగా కనిపించి, పెద్ద నేరాలకు పాల్పడుతున్నారు. స్త్రీలందరూ అప్రమత్తంగా ఉండండి. మైనర్లే అని తేలికగా తీసుకుంటే జీవితం నాశనం చేస్తారు.

శివానీ శివాజీ రాయ్‌ పాత్ర చేయడంలో ఉన్న సవాళ్లేంటి?
మొదటి భాగంలో నేను క్రైమ్‌బ్రాంచ్‌ ఆఫీసర్‌గా చేశాను. సెకండ్‌ పార్ట్‌లో ఎస్‌పీ పాత్ర చేశాను. రెండూ పోలీస్‌ శాఖలకు సంబంధించిన పాత్రలే అయినప్పటికీ పాత్రల బిహేవియర్‌లో మార్పు ఉంటుంది. ఫస్ట్‌ పార్ట్‌కి, ఈ పార్ట్‌లోని శివానీ శివాజీ రాయ్‌కి వ్యత్యాసం చూపించగలగాలి. అది కొంచెం చాలెంజింగ్‌గా అనిపించింది. అదే శివానీ అయినప్పటికీ మీరు తేడా గమనించగలుగుతారు.

పోలీసాఫీసర్‌గా చేయడం మీకిది కొత్త కాదు. అయినప్పటికీ ‘ఎస్‌పీ’ పాత్ర కోసం ఎవరినైనా ప్రేరణగా తీసుకున్నారా?
ఈ సినిమా చేయడం కోసం నేను చాలామంది మహిళా పోలీసాఫీసర్లను కలిశాను. వాళ్లందరూ నాకు ఆదర్శమే. రియల్‌ పోలీస్‌లను కలిసి మాట్లాడినప్పుడు వాళ్లు కొన్ని కేసుల గురించి చెప్పారు. వాటిని పరిష్కరించడానికి వాళ్లేం చేశారో విని, ఆశ్చర్యపోయాను. పోలీసాఫీసర్స్‌కి ఎన్నో సవాళ్లుంటాయి. వాళ్లంటే అభిమానం పెరిగింది. ఆ ఫీల్‌తో నేను శివానీ క్యారెక్టర్‌ని బాగా చేయగలిగాను.

ఫైనల్లీ... ఒక పాత్ర ప్రభావం మీ మీద ఎంతవరకూ ఉంటుంది?
నేను ఒక పాత్ర చేస్తున్నానంటే ఆ పాత్ర ‘నేనే’ అనే ఫీల్‌ నాకు కలగాలి. అలాంటి పాత్రలే ఒప్పుకుంటాను. ‘మర్దానీ’ చేస్తున్నంతసేపూ నేను రాణీ ముఖర్జీని అనే విషయం మరచిపోయాను. శివానీ శివాజీ రాయ్‌ని అనుకున్నాను. అయితే ఈ ఫీల్‌ అంతా కెమెరా ముందు ఉన్నంతవరకే. ఆ తర్వాత నేను నాలా ఉంటాను.
– డి.జి. భవాని

సమాజంపై సినిమా ప్రభావం చాలా ఉంటుంది. మరి మీ సినిమాల విషయంలో మీరెంతవరకూ బాధ్యతగా ఉంటారు?
మేం చేసే అన్ని సినిమాలూ సమాజాన్ని ప్రభావితం చేసేవే అయ్యుండాలని లేదు. కాకపోతే సమాజ మార్పు కోసం కొన్ని సినిమాలు చేయాల్సిన బాధ్యత ఉన్నట్లుగా భావిస్తాను. ‘మర్దానీ’లాంటి సినిమాలు ఆ మార్పుకి కారణమవుతాయి. సమాజాన్ని ఎడ్యుకేట్‌ చేస్తాయి. స్త్రీలకు అవగాహన కల్పిస్తాయి. ఇవాళ దేశం ఎంతో ముందుకు వెళుతోంది. కానీ స్త్రీల రక్షణ విషయంలో వెనకబడి ఉన్నాం. వాళ్లని రక్షించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివన్నీ ‘మర్దానీ 2’లో చెప్పాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement