భార్య, భర్త మధ్యలో ఆమె! | Bollywood Remake Movies Special Story | Sakshi
Sakshi News home page

ఇక్కడ హిట్‌... అక్కడ ఫిట్‌

Published Tue, Jul 30 2019 11:54 AM | Last Updated on Tue, Jul 30 2019 1:56 PM

Bollywood Remake Movies Special Story - Sakshi

ప్రపంచంలో ఏడే కథలు ఉంటాయట.. సప్త సముద్రాల్లానే. ఆ సముద్రంలోని చేప ఈ సముద్రంలోకి.. ఈ సముద్రంలోని చేప ఆ సముద్రంలోకి సాధారణంగా పోదు.. పోలేదు.కానీ ముంబై మహా తీరానికి
అన్ని సముద్రాల చేపలూ కొట్టుకొస్తున్నాయి. బాలీవుడ్‌ మరి! అదొక రీమేక్‌ కథాసాగరం.

గత ఏడాదంతా బాలీవుడ్‌ సిల్వర్‌స్క్రీన్‌పై ఎక్కువగా బయోపిక్‌ల హవా నడిచింది. ఈ ఏడాది రీమేక్‌ల హవా. సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, సంజయ్‌దత్, అక్షయ్‌కుమార్‌ వంటి స్టార్‌ యాక్టర్స్‌ రీమేక్‌ సినిమాల వైపు దృష్టి పెట్టారు. ఇతర భాషల్లో బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌తో కింగ్‌లా నిలిచిన హిట్‌ సినిమాల రిమేక్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ‘రీ’మేకింగ్‌ చిత్రాల్లో నటించబోయే, నటిస్తున్న బాలీవుడ్‌ స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

మరో కొరియన్‌
కొరియన్‌ హిట్‌ సినిమాలపై ఓ కన్నేసినట్లున్నారు కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌. ఈ ఏడాది ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ అనే సౌత్‌ కొరియన్‌ మూవీ హిందీ రీమేక్‌ ‘భారత్‌’లో నటించిన సల్మాన్‌... వెంటనే మరో సౌత్‌ కొరియన్‌ చిత్రం ‘వెటరన్‌’ రీమేక్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సల్మాన్‌ ఆశించిన విజయాన్ని ‘భారత్‌’ అందించకపోయినప్పటిMీ  ‘వెటరన్‌’ చిత్రం రీమేక్‌కు సల్లూ భాయ్‌ సై అనడం విశేషం. నటుడు, నిర్మాత, దర్శకుడు అతుల్‌ అగ్నిహోత్రి ‘వెటరన్‌’ రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. హిందీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి, వచ్చే ఏడాది షూటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటున్నారట.

లాల్‌సింగ్‌
ఆమిర్‌ ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌ తొలిసారి కలిసి నటించిన 300 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిలైంది. దీంతో ఆమిర్‌ ఆలోచనలు ఒక్కసారిగా ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’ వైపు తిరిగాయి. ‘లాల్‌సింగ్‌ చద్దా’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ రీమేక్‌ కోసం ఆమిర్‌ దాదాపు 20 కిలోల బరువు తగ్గారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఆమిర్‌ కూడా ఒక నిర్మాత కావడం విశేషం.

డబుల్‌ ధమాకా
ఏడాదికి కనీసం నాలుగు సినిమాలనైనా ప్రేక్షకుల ముందకు తీసుకురావడం అక్షయ్‌ కుమార్‌ స్టైల్‌. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అక్షయ్‌ సినిమాల్లో ప్రస్తుతానికి రెండు సౌత్‌ రీమేక్స్‌ ఉన్నాయి. లారెన్స్‌ ‘కాంచన’, అజిత్‌ ‘వీరమ్‌’ చిత్రాల హిందీ రీమేక్స్‌ ‘లక్ష్మీబాంబ్‌’, ‘బచ్చన్‌పాండే’ల్లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. ‘లక్ష్మీ బాంబ్‌’ చిత్రానికి రాఘవ లారెన్స్, ‘బచ్చన్‌పాండే’కు ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే  నిర్మాతలు తనకు సరైన గౌరవం ఇవ్వలేదని లారెన్స్‌ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి మొదట తప్పుకున్నారు. అక్షయ్‌ జోక్యంతో తిరిగి మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇక అక్షయ్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్, హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌ న్యూస్‌’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి.

రాజకీయ ప్రస్థానం
రాజకీయ నాయకుడిగా ‘ప్రస్థానం’ మొదలుపెట్టారు బాలీవుడ్‌ ఖల్‌ నాయక్‌ సంజయ్‌దత్‌. ఇది వెండితెర పార్టీ. 2010లో దేవకట్టా దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం’ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చేప్పక్కర్లేదు. ఈ సినిమాను దేవాకట్టాయే ప్రస్తుతం హిందీలో ‘ప్రస్థానం’ అనే టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో సాయికుమార్‌ చేసిన పాత్రను హిందీలో సంజయ్‌దత్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో మనీషా కొయిరాల, అలీ ఫజల్, జాకీష్రాఫ్, అమైరా దస్తూర్, చుంకీ పాండే కీలక పాత్రధారులు.

కొత్త కూలీ
తొలిసారి నిర్మాతగా మారి కూలీ చేస్తున్నారు బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. 1995లో వరుణ్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘కూలీ నం 1’ అప్పట్లో మంచి విజయం సాధించింది. గోవింద, కరిష్మా కపూర్‌ నటించారు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్‌లో అదే టైటిల్‌తో రీమేక్‌ అవుతోంది. వరుణ్‌ ధావన్, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్నారు. నాటి ‘కూలీ నం 1’కు దర్శకత్వం వహించిన డేవిడ్‌ ధావనే ఈ సినిమాకూ దర్శకుడు. వచ్చే ఏడాది కార్మికుల దినోత్సవానికి (మే 1) ఈ కూలీ నం 1 వెండితెరపైకి రానున్నారు.

రంగు మారెనే!
త్వరలో రైలు ప్రయాణం చేయడానికి జుట్టు రంగు మార్చుకున్నారు హీరోయిన్‌ పరిణీతీ చోప్రా. హాలీవుడ్‌ మూవీ ‘ద గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ రీమేక్‌ కోసం అలా మేకోవర్‌ అయ్యారు పరిణీతి. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ హాలీవుడ్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిందీ రీమేక్‌ రిభూ దాస్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనుండగా పరిణీతీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

క్యాన్సర్‌ బాధితుడు
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ క్యాన్సర్‌తో బాధపడే వ్యక్తిగా కనిపించనున్న చిత్రం ‘దిల్‌ బచారే’. ఐదేళ్ల క్రితం హాలీవుడ్‌లో వచ్చిన ‘ద ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ చిత్రం హిందీలో ‘దిల్‌ బచారే’గా రీమేక్‌ అవుతోంది. సుశాంత్‌ సింగ్, సంజనా సాంఘీ హీరో హీరోయిన్లు. ముఖేష్‌ చబ్రా దర్శకుడు.

ఇంకా...
మలయాళ హిట్‌ ‘ఎజ్రా’ సేమ్‌ టైటిల్‌తో హిందీలో రీమేక్‌ అవుతోంది. నటుడు ఇమ్రాన్‌ హష్మి నటిస్తున్నారు. 1971లో వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ సినిమా సోల్‌ను ప్రేరణగా తీసుకుని అదే టైటిల్‌తో హిందీలో సినిమా చేస్తున్నారు రానా. ఈ సినిమాకు తెలుగులో అరణ్య, తమిళంలో ‘కాడన్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిందీ రీమేక్‌లో అహన్‌ శెట్టి హీరోగా నటించనున్నారు. మరోవైపు 1994లో వచ్చిన హిందీ హిట్‌ ‘అందాజ్‌ అప్నా అప్నా’ లేటెస్ట్‌ రీమేక్‌లో రణ్‌వీర్‌ సింగ్, వరుణ్‌ధావన్‌ కలిసి నటించబోతున్నారని టాక్‌. ‘ఓ కౌన్‌ తీ?’ (1964) ‘రాత్‌ ఔర్‌ దిన్‌’ (1967) తాజా రీమేక్స్‌లో ఐశ్యర్యారాయ్‌ నటించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

హీరోలు కావలెను!
కొన్ని సౌత్‌ సినిమాలు హిందీలో రీమేక్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఆ సినిమాల్లో ఎవరు హీరోలుగా నటించబోతున్నారు అనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. ఇప్పుడు ఈ రీమేక్స్‌లో నటించడానికి బాలీవుడ్‌లో హీరోలు కావాలి. తెలుగు చిత్రాలు ‘జెర్సీ’, ‘ఓ బేబి’, ‘ఎఫ్‌ 2’,  ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ఎవడు’తో పాటు తమిళ చిత్రాలు ‘వేదాలం’, ‘కత్తి’, ‘విక్రమ్‌ వేదా’, ‘పితామగన్‌’, ‘జిగర్తండా’ హిందీలో రీమేక్‌ కానున్నాయి. కానీ ఈ చిత్రాల్లో ఎవరు హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారనే అంశంపై బాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో షాహిద్‌కపూర్, ‘ఎఫ్‌ 2’లో ఒక హీరోగా అర్జున్‌ కపూర్, ‘ఓ బేబీ’ హీరోయిన్‌గా ఆలియా భట్‌ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్‌ రావు, సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారని తాజా బీ టౌన్‌ టాక్‌. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా ఆయా రీమేక్‌ చిత్రాల్లో పైన పేర్కొన్న నటీనటులు నటిస్తారా? లేక కొత్తవారు ఎవరైనా వస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వెయిట్‌ చేయాల్సిందే.

కోట్ల క్లబ్‌లో హిట్‌ ఫార్ములా
బడా బడా స్టార్స్‌ రీమేక్‌ సినిమాలవైపు ఆసక్తి చూపడానికి బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే.. అమితాబ్‌ బచ్చన్, తాప్సీ కలిసి నటించిన ‘బద్లా’ మూవీ ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. స్పానిష్‌ థ్రిల్లర్‌ ‘ది ఇన్‌విజిబుల్‌ గెస్ట్‌’ చిత్రానికి ఇది హిందీ రీమేక్‌. రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘సింబా’ (తెలుగు హిట్‌ ‘టెంపర్‌’ రీమేక్‌) బీటౌన్‌ బాక్సాఫీస్‌ వద్ద రెండువందల కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసింది. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’లో షాహిద్‌కపూర్‌ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 300కోట్ల రూపాయల వసూళ్లవైపు పరుగులు తీస్తోంది. ఇలా స్ట్రయిట్‌ చిత్రాలకు దీటుగా రీమేక్‌ చిత్రాల వసూళ్లు ఉండటంతో ఆల్రెడీ హిట్‌ అయిన సినిమా మీద నమ్మకం ఉంచి, రీమేక్‌కి సై అంటున్నారని ఊహించవచ్చు.

భార్య, భర్త మధ్యలో ఆమె!
‘సోనూ కి టిట్టు కి స్వీటీ’ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్‌లో కార్తీక్‌ ఆర్యన్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా వందకోట్ల క్లబ్‌లో చేరడంతో కార్తీక్‌ క్రేజ్‌ పెరిగింది. ప్రస్తుతం కార్తీక్‌ ఆర్యన్‌ నటిస్తున్న చిత్రాల్లో ‘పతీ పత్నీ ఔర్‌ ఓ’ సినిమా ఒకటి. ఈ సినిమా టైటిల్‌ ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. అవును.. 1978లో బీఆర్‌ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘పతీ పత్నీ ఔర్‌ ఓ’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్నారు. కార్తీక్, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే హీరో హీరోయిన్లు. ముదస్సార్‌ అజీజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది బాలీవుడ్‌లో దాదాపు 25 రీమేక్‌ సినిమాలు నిర్మాణంలో ఉండటం విశేషం. కథల కొరతా? అంటే.. అదొక కారణం అయ్యుండొచ్చు. హిట్‌ ఫార్ములాతో సేఫ్‌ గేమ్‌ ఆడొచ్చనే కారణం కూడా ఇన్ని రీమేక్స్‌కి కారణం అయ్యుండొచ్చు.– ముసిమి శివాంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement