
భారతీయ క్రీడారంగంలో ఒక సంచలనం హిమదాస్. 18 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ అథ్లెటిక్ ఈవెంట్‌లో సత్తా చాటి.. భారత్ తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించిన స్ప్రింటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పుడామె జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కించాలని అక్షయ్‌కుమార్ ఆసక్తి కనబరుస్తున్నారు. నిర్మాతగా ఆమె జీవితచరిత్రను తెరకెక్కించడానికి ఇష్టపడతానని బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్కీ తాజాగా తెలిపాడు.
2018 ఆసియా గేమ్స్ కోసం సిద్ధమవుతున్న భారతీయ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈడెల్‌వీస్ గ్రూప్ శనివారం ఓ కార్యక్రమం నిర్వహించింది. హాకీ నేపథ్యంతో తెరకెక్కిన తన ‘గోల్డ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ కార్యక్రమంలో అక్షయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరు నిర్మాతగా ఏ భారతీయ క్రీడాకారుడిపై సినిమా తీసేందుకు ఇష్టపడతారని అక్షయ్‌ని అడుగ్గా.. ‘హిమదాస్‌పై బయోపిక్ తీసేందుకు నేను ఇష్టపడతాను. ఆమె ట్రాక్ రన్నర్. భారత్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి.. పరుగు పోటీల్లో స్వర్ణపతకం సాధించడమనేది చాలా అరుదైన ఘనత. ఇది నిజంగా అసాధారణమైన విషయం’ అని ఆయన అన్నారు.
‘పరుగు పోటీల విషయంలో భారత్ ప్రదర్శన ఒకింత పేలవంగా ఉందని చెప్పాలి. మనం ఈ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరముంది. మన దగ్గర కూడా గొప్ప ప్రతిభావంతులు ఉన్నారని ప్రపంచానికి చాటాలి. బస్సులు, రైళ్లను క్యాచ్ చేయడానికి రోజూ మనం చాలా వేగంగా పరుగులు దీస్తాం. అందుకే హిమదాస్‌పై నేను బయోపిక్ తీయడానికి ఇష్టపడతాను’ అని అక్షయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment