
గత ముప్పయి లక్షల సంవత్సరాల వ్యవధిలో మనిషి మెదడు సైజు మూడు రెట్లు పెరిగిందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. మెదడు పరిమాణం పెరగడం వల్లనే నాగరికత, సంస్కృతి, భాషలు, పరికరాలను తయారు చేసుకునే సామర్థ్యం అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు వందకు పైగా మానవ శిలాజాలను నిశితంగా పరీక్షించిన తర్వాత షికాగో వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు.
షికాగో వర్సిటీకి చెందిన శిలాజ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ డ్యూ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 13 మానవ జాతులకు చెందిన 94 శిలాజాలను సేకరించి పరీక్షలు జరిపింది. పరిణామ క్రమంలో మానవ జాతికి సమీప బంధువులైన చింపాంజీలతో పోలిస్తే ఇప్పటి ఆధునిక మానవుల మెదడు పరిమాణం మూడు రెట్ల కంటే ఎక్కువగా ఉంటోందని, ఈ స్థాయిలో పరిణామం చెందడానికి ముప్పయి లక్షల ఏళ్ల కాలం పట్టిందని డాక్టర్ ఆండ్రూ డ్యూ తెలిపారు.