వియ్‌ కెన్‌ | BSF Assistant Commandant Tanushree Pareek story | Sakshi
Sakshi News home page

వియ్‌ కెన్‌

Published Mon, Oct 15 2018 1:27 AM | Last Updated on Mon, Oct 15 2018 1:27 AM

BSF Assistant Commandant Tanushree Pareek story - Sakshi

మార్చి 2017. గ్వాలియర్‌లోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అకాడమీలో రైజింగ్‌ డే పెరేడ్‌ జరుగుతోంది. శిక్షణ పొందిన 67 మంది ట్రైనీ ఆఫీసర్‌లకు ర్యాంకు స్టార్‌లను ప్రదానం చేస్తున్నారు కేంద్ర హోమ్‌ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. వారిలో 66 మంది అబ్బాయిలు, ఒకే ఒక్క అమ్మాయి.. తనుశ్రీ పారీక్‌! ఇండియన్‌ ఆర్మీ చరిత్రలో తనుశ్రీది ఒక మైలురాయి. అర్ధశతాబ్దం దాటిన భారత ఆర్మీలో ఒక మహిళ కంబాట్‌ ఆఫీసర్‌గా నియామకం కావడం ఆమెతోనే మొదలు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాలో ఆర్మీలోకి వచ్చిన తొలి యువతి తనుశ్రీ. రెండున్నర లక్షల సైనిక దళానికి ఆమె అధికారి. మళ్లీ ఇప్పుడొకసారి ఆమె గురించి దేశమంతా చెప్పుకుంది. డ్రగ్‌ మాఫియా నిర్మూలన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న తనుశ్రీ.. ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఆడపిల్లల్లో చైతన్యం తీసుకువస్తోంది.


తనుశ్రీ రాజస్థాన్‌ అమ్మాయి. తండ్రి డాక్టర్‌ ఎస్‌పీ జోషి బికనీర్‌ వెటర్నరీ యూనివర్శిటీలో పారాసైటాలజీ ప్రొఫెసర్‌. తల్లి గృహిణి. తనుశ్రీ బికనీర్‌లోని గవర్నమెంట్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ చేసింది. సాఫ్ట్‌వేర్‌ రంగం పరిచిన రెడ్‌ కార్పెట్‌ను కాదని ఆమె ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో అడుగుపెట్టడానికి తగిన కారణాలే ఉన్నాయి.  ఆమె ఎన్‌సీసీ క్యాడెట్‌. ఫైరింగ్, హార్స్‌ రైడింగ్, పైలటింగ్, క్యాంపింగ్‌లలో చురుగ్గా పాల్గొనేది. అందుకే రక్షణరంగం మీద ఆసక్తి, యూనిఫామ్‌ మీద వ్యామోహం కలిగాయి తనకు.

అమ్మాయిలే కనిపించలేదు
‘‘2013లో నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు అప్లయ్‌ చేశాను. ప్రిపేరయ్యాను. కానీ లిస్ట్‌లో పేరు చూసుకునే వరకు నేను మాత్రమే మహిళను అనే సంగతి తెలియదు’’ అని నవ్వుతూ అంటుంది తనుశ్రీ. క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మొత్తం 16 వేల మంది.. బ్యాచ్‌మేట్స్‌ నుంచి, శిక్షణ ఇచ్చే అధికారుల వరకు అంతా మగవాళ్లే. మహిళలు కనిపించారు అంటే వాళ్లు అధికారుల కుటుంబ సభ్యులే. అప్పుడనిపించింది నేను తీసుకున్న బాధ్యత చిన్నది కాదని.

కష్టకాలమూ ఉంది
తనుశ్రీ పారిక్‌తోపాటు శిక్షణ తీసుకున్న వారిలో రెండు నెలలకే మానుకున్న వాళ్లూ ఉన్నారు. ఆ ప్రభావం తనుశ్రీని కూడా ఆవరించింది. తండ్రికి ఫోన్‌ చేసి బోరున ఏడ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నదామె. ‘‘మిలటరీ శిక్షణ కఠినంగానే ఉంటుంది. దేహం ఎండకు ఎండిపోయింది. రంగు మారడమే కాదు, చర్మం పొడిబారి గరుకు తేలింది. జుట్టు పెళుసుబారింది. ఒకరోజు అద్దంలో తేరిపార చూసుకుంటే.. నా రూపం చూసి నాకే భయమేసింది.

నేనలా డీలాగా ఉన్న సమయంలో వచ్చింది నాన్న నుంచి ఫోన్‌. ‘ఎలా ఉన్నావు బేటా’ అనే ఆత్మీయమైన పలకరింపుతో కదిలిపోయాను. పెద్దగా ఏడ్చేశాను. ‘నాన్నా నేనిక్కడ రోజంతా కోతిలాగ దూకుతూ ఉన్నాను. నాతోపాటు బీటెక్‌ చేసిన వాళ్లు సౌకర్యవంతంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నేను ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చానా’ అని చాలా బాధపడ్డాను’’ అని చెప్పి నవ్వుతోందిప్పుడు.

సమానంగా సాధించింది   
తనుశ్రీ మగవాళ్లతో తీసిపోకుండా ట్రైనింగ్‌ కోర్సు పూర్తి చేసింది. అంతటి కఠోర శ్రమకు ప్రతిఫలంగా ఆమె 52 వారాల శిక్షణ తర్వాత బ్యాచ్‌లో రెండవ స్థానంలో నిలిచింది. డ్రిల్, ఆల్‌రౌండ్‌ బెస్ట్‌ ట్రైనీ, పబ్లిక్‌ స్పీకింగ్‌లలో అవార్డులందుకుంది. ‘అమ్మాయిని కాబట్టి వెసులుబాటు కల్పించండి’ అని అడగలేదు.

‘‘అలా వెసులుబాటు తీసుకుని ఉంటే నా మీద ‘తొలి మహిళాధికారి అయితే వచ్చింది కానీ, ఆమె పరీక్ష కూడా సరిగ్గా చేయలేదు’ అనే ముద్రను జీవితకాలమంతా మోయాల్సి వస్తుంది. నేను తొలి మహిళాధికారిని అనే ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ, ఆ మాటకు ట్యాగ్‌లైన్‌ గా వ్యంగ్యోక్తి కూడా భరించాలి కదా. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కూడా మహిళలు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా విధులు నిర్వర్తించగలరు అని చెప్పదలుచుకున్నాను. మహిళలు చేయగలరని నిరూపించాను కూడా’’ అంటోంది తనుశ్రీ.

మత్తు మీద తూటా
ఉద్యోగంలో చేరాక పంజాబ్‌ రాష్ట్రంలో వేళ్లూనుకొని ఉన్న మత్తుమందు మాఫియాను నిర్మూలించే బాధ్యత చేపట్టింది తనుశ్రీ. పరిస్థితి తీవ్రతను అంచనా వేయడానికి సరిహద్దు గ్రామాల్లో పర్యటించింది. మగవాళ్లు, ముసలివాళ్లు, పిల్లలు అనే తేడా ఏమీ లేదు, మహిళలకు, ఆడపిల్లలు కూడా మత్తు మందుకు బానిసలై ఉన్నారని తెలిసింది.

పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి పంజాబ్‌లోకి వస్తున్న మత్తుమందును నిరోధించడానికి ఇరవై నాలుగ్గంటలూ కాపు కాసిందామె. బోర్డర్‌ సెక్యూరిటీ ఉద్యోగంలో ఇది యుద్ధసమయం, ఇది శాంతి సమయం అనే తేడా ఉండదు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. కశ్మీర్, గుజరాత్, పంజాబ్‌... ఒక్కో చోట ఒక్కో రకమైన సమస్యతో యుద్ధం చేయాలి. ఈ రోజువారీ యుద్ధాలు చేస్తూ వారాంతాల్లో గ్రామాల్లో పర్యటిçస్తుంటుంది తనుశ్రీ.

స్టార్‌ క్యాంపెయిన్‌
‘అసలే ఆడపిల్లవు, విధి నిర్వహణలో చనిపోతే’ అని ప్రేమతో కూడిన భయంతో ఆదుర్దాగా అడిగిన వాళ్లకు తనుశ్రీ చెప్పే సమాధానం ఒక్కటే. ‘మరణాన్ని గౌరవించాలి తప్ప, మరణానికి భయపడకూడదు. మరణం ఎప్పుడు వచ్చినా స్వాగతించాల్సిందే. విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు పోవడం అంటే... అది సైనికుల గౌరవాన్ని పతాక స్థాయికి చేర్చే మరణం’ అంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే ఆమెను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమించడం మరొక పెద్ద బాధ్యత.

‘ఆడపిల్లలను గర్భంలోనే చంపేయకండి, బతికి భూమ్మీదకు రానివ్వండి. వారిని వివక్షకు గురి చేయకుండా చదివించి ప్రయోజకులను చేయండి’ అని పెద్ద పెద్ద స్టార్‌లతో చెప్పించకుండా ఒక  భద్రతాధికారి చేత చెప్పించడం వెనుక పెద్ద ఆంతర్యమే ఉంది. తనుశ్రీ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో చెప్తుంటుంది. ఆమె చెప్పిన విషయాల కంటే ఆమెను చూడటం ద్వారా ఆడపిల్లల్లో కలిగే చైతన్యం గొప్పది. తమలాంటి ఒకమ్మాయి ఇంత పెద్ద హోదాలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తోంది అనే భావనే చైతన్య పరుస్తోంది.

మహిళలు ఇంకా వస్తారు
తనుశ్రీ పారీక్‌ ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్పే మాట ఒక్కటే... ‘‘అమ్మాయిలను, అబ్బాయిలను సమానంగా పెంచండి. ఇద్దరూ సమానమే అనే భావన ఇంటి నుంచే మొదలు కావాలి. అప్పుడే వాళ్లు వేధింపులకు భయపడరు. అమ్మాయి ధైర్యంగా కనిపిస్తే, ఆమెను వేధించడానికి అబ్బాయిలు భయపడతారు. ఆడపిల్లల్లో తాము ఎందులోనూ తక్కువ కాదు అనే విశ్వాసాన్ని పాదు కొల్పగలిగితే చాలు. ఆ పైన వాళ్ల ఆలోచలు, ఆశయాలు ఆకాంక్షలు, లక్ష్యాలకు ఆకాశమే హద్దవుతుంది’’ అని.

బరువు తగ్గడమే పెద్ద పరీక్ష
తనుశ్రీకి సిఎపిఎఫ్‌ పరీక్ష కంటే ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్టే అసలైన పరీక్షగా మారింది. ‘‘అప్పటి వరకు సీరియెస్‌గా వర్కవుట్స్, ఎక్సర్‌సైజ్‌లు చేసింది లేదు. రిటెన్‌ టెస్ట్‌ తర్వాత పిఈటీ ప్రిపరేషన్‌ మొదలు పెట్టాను. రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పరుగెత్తేదాన్ని. లాంగ్‌జంప్, హై జంప్‌ ప్రాక్టీస్‌ చేశాను. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకున్నాను. జీఎమ్‌ డైట్‌తో నెలలో ఏడు కిలోలు తగ్గాను. బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లలేదు. నాచురల్‌ ఎక్సర్‌సైజ్‌తోనే ఫిట్‌నెస్‌ వచ్చింది’’.


తండ్రి మాటలే ధైర్యవచనాలు
‘‘రక్షణ రంగం ఉద్యోగాలు మహిళలకు సాధ్యం కావనే ఉద్దేశంతో చాలాకాలం అవకాశాలు రాలేదు. అవకాశం తలుపు తెరుచుకుందిప్పుడు. నువ్వు సాధించి చూపిస్తే ఇప్పటి వరకు మహిళల పట్ల స్థిరపడి ఉన్న అభిప్రాయం తప్పు అని రుజువవుతుంది. నువ్వు వెనక్కి వస్తే మహిళలకు ఇది అసాధ్యమైన పని, అవకాశం ఇచ్చినా మనలేరు అనడానికి నువ్వు కూడా ఒక కారణం అవుతావు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నా బిడ్డ సంతోషంగా జీవించడమే నాక్కావలసింది. అయితే నువ్వు నీ తర్వాత ఈ ఉద్యోగాల్లోకి వచ్చే అమ్మాయిలకు ఉదాహరణగా నిలుస్తావు. ఆ నిర్ణయం ఏదయినా సరే’’ అన్నారాయన.

తనుశ్రీలో కసి మొదలైన క్షణాలవి. మగవాళ్లు సగంలో వెళ్లిపోతే... ‘ఆ వెళ్లిపోయిన వాళ్లలో మానసిక దృఢత్వం లేదు, అందుకే వెళ్లిపోయారు’ అంటారు. ఒక మహిళ వెనక్కి వెళ్లిపోతే మాత్రం ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగాలు చేయలేరు, అందుకే ఆమె వెళ్లిపోయింది’ అంటారు. నేను వేసిన అడుగు నా తరవాతి వారికి రహదారి కావాలి తప్ప, నా కారణంగా దారి మూసుకుపోకూడదు. రక్షణ రంగంలో కొనసాగి తీరాల్సిందే. ఈ నిర్ణయం నా ఒక్క జీవితం కోసం కాదు, నా కుటుంబం కోసమూ కాదు. ఇది మహిళల కోసం’ అనుకుంది తనుశ్రీ.

భయం పోగొట్టాలి
‘‘బేటీ బచావో బేటీ పఢావో ప్రచారం కోసం చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న స్కూళ్లకు వెళ్లాను. అక్కడ అమ్మాయిల్లో తెలివితేటలున్నా, నోరు విప్పే ధైర్యం ఉండటం లేదు. కొత్త వాళ్ల ముందుకు రావడానికే బిగుసుకుపోతున్నారు. వాళ్ల ఇళ్లలో ఆడపిల్లలను మగవాళ్ల ముందు నోరు తెరవనివ్వరని తెలిసింది. ఈ ప్రచారం ఇంకా విస్తృతంగా చేయాల్సి ఉందని వాళ్లతో మాట్లాడిన తర్వాతే తెలిసింది. తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులైన కుటుంబాల్లో వివక్ష ఎక్కువగా కనిపిస్తోంది. దేశమంతటా ఈ తరం పిల్లలందరినీ చదివిస్తే చాలు. ఇరవై ఏళ్లకు ఇప్పటి బాలతరం యువతరం అవుతుంది. ఇక చదివించమని చెప్పాల్సిన అవసరం ఉండదు’’. – తనుశ్రీ పారీక్, అసిస్టెంట్‌ కమాండెంట్, బిఎస్‌ఎఫ్‌
 


– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement